వైసీపీకి ఓట్లేయలేదని...కత్తితో వీరంగం!

ABN , First Publish Date - 2021-03-02T06:31:57+05:30 IST

అధికార బలం విర్రవీగుతోంది.

వైసీపీకి ఓట్లేయలేదని...కత్తితో వీరంగం!

మద్దులపర్వలో ముగ్గురిపై దాడి

ముగ్గురు టీడీపీ సానుభూతిపరులకు గాయాలు 

గ్రామాల్లో భయం.. భయం..

రెడ్డిగూడెం, మార్చి 1: అధికార బలం విర్రవీగుతోంది. ఏం చేసినా చెల్లుతుందని వీరంగం సృష్టిస్తోంది. ఓటు వేయలేదని ప్రాణాలను వేటాడేందుకు బరితెగిస్తోంది. కత్తులతో దాడులకు తెగబడుతోంది. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తోంది. పంచాయతీ పోరులో ఓటమిని తట్టుకోలేక టీడీపీ సానుభూతిపరులపై వరుస దాడులకు పాల్పడటమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. మొన్న మొర్సుమిల్లిలో, తాజాగా మద్దులపర్వలో జరిగిన దాడులే దీనికి తార్కాణాలవుతున్నాయి. దీంతో గ్రామాల్లో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకున్నారు. ఇవన్నీ చూస్తూ పోలీసు యంత్రాంగం మిన్నకుండిపోవడం గమనార్హం. 

  మైలవరం నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరులపై వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొదటి విడత పంచా యతీ ఫలితాల అనంతరం మైలవరం మండలం మొర్సుమిల్లిలో టీడీపీ సానుభూతిపరుడైన గిరిజనుడి జగన్నాథం సోమయ్య ఇంటిపై వైసీపీ నేతలు దాడిని మరువక ముందే నియోజక వర్గంలో రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ గ్రామంలోని దళితవాడలో ఓ వైసీపీ కార్యకర్త కత్తితో రెచ్చిపోయి వైసీపీకి ఓటు వేయలేదని ముగ్గురు టీడీపీ సానుభూతిపరులపై ఇష్టాను సారంగా కత్తితో దాడి చేశాడు. దీంతో నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని టీడీపీ సానుభూతిపరులు భయాందోళన చెందుతున్నారు.   

  రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ గ్రామంలో వైసీపీ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థిని కోమటి కోటేశ్వరమ్మ టీడీపీ బలపర్చిన అభ్యర్థిని వెలివెల నాగేంద్రమ్మపై 150 ఓట్ల తేడాతో ఓటమి చెందింది. మద్దులపర్వ దళితవాడలో 2వ వార్డులో టీడీపీ మద్దతుతో కొప్పుల అక్కమ్మ, వైసీపీ మద్దతుతో కొప్పుల జ్యోతి పోటీ చేశారు. కొప్పుల జ్యోతి ఆరు ఓట్ల తేడాతో  అక్కమ్మపై ఓటమి చెందింది. వార్డుకు పోటీ చేసిన జ్యోతికి, సర్పంచ్‌కి పోటీ చేసిన కోమటి కోటేశ్వరమ్మలకు మల్లాది సర్వేశ్వరరావు, ఏసోబు, సుభద్రమ్మలు ఓటు వేయలేదనే కారణంతో వారిపై కొప్పుల శ్రీనివాసరావుతో పాటు కొప్పుల జయరాజు, కొప్పుల మురళీలు దాడికి పాల్పడ్డారు. విక్షణారహితంగా కత్తితో టీడీపీ కార్యకర్తలను నరికాడు. సర్వేశ్వరరావు తలపై, ఏసుబు చెయ్యిపై, సుభద్రమ్మ కాలుపై శ్రీనివాసరావు కత్తితో నరికాడు. కత్తి చేత పట్టి బండబూతులు తిడుతూ దళితవాడలో హల్‌చల్‌ చేశాడు. అతనికి సహకరించిన మరో ఇద్దరు సైతం రాడ్లతో జనాన్ని భయభ్రాంతులకు గురి చేశారని బాధితుల బంధువులు వాపోయారు. గొడవ పెద్దది కావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. వైసీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు టీడీపీ కార్యకర్తలు నూజివీడు ప్రభుత్వా సుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలోని దళితవాడలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. 

గొడవల్ని ప్రేరేపిస్తున్నారు : టీడీపీ నేతలు

ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ముఖ్యంగా దళితవాడల్లో అధికార వైసీపీ నేతలు వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య గొడవల్ని, అల్లరిని ప్రేరేపిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. మద్దులపర్వలో వారు సోమవారం విలేకర్లతో మాట్లాడారు. గొడవలు వారే సృష్టిస్తూ బాధితులపై తిరిగి అక్రమ కేసులు పెట్టించడం విడ్డూరంగా ఉందన్నారు. పోలీసులు సైతం అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారన్నారు. మద్దులపర్వ గ్రామంలో జరిగిన ఘటనపై నిష్పక్ష పాతంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేయడంతో పాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

  పథకం ప్రకారమే దాడి  

 ‘‘ఎన్నికలు అయిపోయిన నాటి నుంచి మాపై వేధింపులు మొదలయ్యాయి. వైసీపీకి ఓటు వేయలేదని ప్రతిరోజూ మేం కనబడితే బండబూతులు తిడుతున్నారు. కొప్పుల శ్రీనివాసరావు, కొప్పుల మురళీ, జయరాజ్‌... మావాళ్లపై దాడి చేశారు. ఆదివారం బజారు నుంచి వస్తున్న మాపై కూడా దాడికి పాల్పడ్డారు. కత్తులు చేత బట్టుకొని, రాళ్లు రువ్వారు. రాడ్లతో దాడికి పాల్పడ్డారు’’   

- మల్లాది రామారావు (బాధితుల బంధువు)

Updated Date - 2021-03-02T06:31:57+05:30 IST