ఢిల్లీలో కూలిన ప్రజాస్వామ్యం

ABN , First Publish Date - 2021-03-27T06:08:37+05:30 IST

అధికరణ 239 ఎఎ జోలికి మోదీ ప్రభుత్వం పోలేదు. ఎందుకంటే పార్లమెంటు ఉభయ సభల్లో ఎన్‌డిఏకు మూడింట రెండు వంతుల మెజారిటీ లేదు. ఈ కారణంగా ‘గవర్నమెంట్ ఆఫ్ ది నేషనల్ కేపిటల్ టెరిటోరీ ఆక్ట్-1991’ ను....

ఢిల్లీలో కూలిన ప్రజాస్వామ్యం

అధికరణ 239 ఎఎ జోలికి మోదీ ప్రభుత్వం పోలేదు. ఎందుకంటే పార్లమెంటు ఉభయ సభల్లో ఎన్‌డిఏకు మూడింట రెండు వంతుల మెజారిటీ లేదు. ఈ కారణంగా ‘గవర్నమెంట్ ఆఫ్ ది నేషనల్ కేపిటల్ టెరిటోరీ ఆక్ట్-1991’ ను సవరించేందుకు సంకల్పించింది. శాసనసంబంధ హస్త కౌశలం ద్వారా మోదీ ప్రభుత్వం ఢిల్లీలో తన వైస్రాయ్‌ను ప్రతిష్ఠించింది.


ప్రజాస్వామ్యం ఏమిటి?ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు పాలించడమే ప్రజాస్వామ్యమని అబ్రహాం లింకన్ నిర్వచించారు. ప్రజాస్వామ్యానికి ఇది చాలా సరళమైన, సమగ్రమైన నిర్వచనం. ప్రజలే పాలనకు కేంద్రంగా ఉంటారు. భారత్ ఒక సమాఖ్య రాజ్యం. న్యూఢిల్లీ భారతదేశ రాజధాని. మిగతా రాష్టాల ప్రభుత్వాల కంటే ఢిల్లీ ప్రభుత్వం భిన్నంగా ఉండి తీరాలని అందరూ అంగీకరించారు. అయితే ఆ ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వమై ఉండితీరాలి. ప్రజలే పాలనకు కేంద్రం కావాలి. రాజ్యాంగానికి అంతిమ వ్యాఖ్యాత అయిన సుప్రీంకోర్టు 2018లో ‘స్టేట్ (నేషనల్ కేపిటల్ టెరిటోరీ ఆఫ్ ఢిల్లీ) వెర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో ఇలా వ్యాఖ్యానించింది: ‘భాగస్వామ్య అధికారాన్ని చెలాయించడమంటే ప్రత్యేక హోదా ఉన్న ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిటి)లో నివసిస్తున్న పౌరులు అందరికీ ప్రజాస్వామిక, సామాజిక, రాజకీయ అధికారాలను ప్రసాదించడమే’. ‘ప్రజాస్వామిక ప్రభుత్వం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమే’ అని కేశవానంద భారతి కేసులో జస్టిస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యను సుప్రీంకోర్టు ఉటంకించింది. 


1991లో రాజ్యాంగాన్ని సవరించి ఢిల్లీ పాలన విషయంలో ప్రత్యేక నిబంధనలను సమకూర్చేందుకు అధికరణ 239 ఎఎను పొందుపరిచారు. ‘ఢిల్లీ ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా సాగుతుంది. ఒక శాసనసభ ఏర్పాటవుతుంది. సామాన్య మానవునికి సంక్షేమాన్ని సమకూర్చేందుకు సంబంధించి తగు అధికారాలతో మంత్రిమండలి ఆ శాసనసభకు బాధ్యత వహిస్తుందని’ ఆ అధికరణ పేర్కొంది. ఇంకా ఈ అధికరణలో పేర్కొన్న ‘ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి ప్రత్యక్ష ఎన్నికలు’ మొదలైన అంశాలు ప్రతి ప్రజాస్వామిక దేశంలో ఒక నిర్దిష్ట అర్థాన్ని సంతరించుకున్నాయి. ఈ అధికరణలోని నిబంధనలను అమలుపరిచేందుకే అదే అధికరణ కింద ‘గవర్నమెంట్ ఆఫ్ ది నేషనల్ టెరిటోరీ ఆక్ట్-–1991’ను తీసుకువచ్చారు. 


ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది. కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు. అసలు అధికారాలు తనవే అని నిరూపించడానికి లెఫ్టినెంట్ గవర్నర్ పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారాయి. ఢిల్లీలో బీజేపీ యేతర ప్రభుత్వాన్ని కేంద్ర పాలకులు సహించలేక పోతున్నారు. ముఖ్యంగా ప్రజాదరణ పుష్కలంగా ఉన్న ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి సహించలేకపోతున్నారు. ఈ కారణంగానే ఢిల్లీ ప్రభుత్వంలో అసలు అధికారాలు ఎవరివి అన్న పాత వివాదాన్ని మళ్ళీ రగిలించారు. పైన ప్రస్తావించిన కేసు తీర్పులో సుప్రీం కోర్టు ఇలా పేర్కొంది: ‘అధికరణ 239 ఎఎలోని ‘‘సహాయ సలహాల’’ను మంత్రి మండలి సహాయ సలహాలకు లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడి ఉండాలని అర్థం చేసుకోవాలి’. 


నరేంద్ర మోదీ అహంకృత వ్యక్తి (ప్రధానమంత్రులు అందరూ అంతేనని నేను భావిస్తున్నాను). తప్పుడు లక్ష్యాలను సాధించే ప్రయత్నాలను ఆయన విరమించుకునే ప్రసక్తే లేదు. సమయం కోసం ఎదురు చూశారు. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కీలక ఎన్నికలు జరగనున్న సందర్భాన్ని ఎంచుకున్నారు. అయితే అధికరణ 239 ఎఎ జోలికి ఆయన పోలేదు. ఎందుకంటే పార్లమెంటు ఉభయ సభల్లో ఎన్‌డిఏకు మూడింట రెండు వంతుల మెజారిటీ లేదు. ఈ కారణంగా ‘గవర్నమెంట్ ఆఫ్ ది నేషనల్ కేపిటల్ టెరిటోరీ ఆక్ట్-1991’ను సవరించేందుకు ఆయన సంకల్పించారు. ‘గౌరవనీయ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యానాన్ని అమలుపరిచేందుకు ఈ సవరణ బిల్లును తీసుకువచ్చినట్టు’ ఆ బిల్లు లక్ష్యాలు, కారణాలలో పేర్కొన్నారు. ఇది ఒక విధంగా సుప్రీం కోర్టును అపహసించడమే! అంతేకాదు 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును త్రోసిపుచ్చే ప్రయత్నం కూడా అని చెప్పక తప్పదు.

 

‘ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరే’ అని స్పష్టంగా నిర్దేశించడం ద్వారా చట్టాన్ని ఆ బిల్లు సవరించనున్నది! అంటే తోకే (లెఫ్టినెంట్ గవర్నర్) కుక్క (మంత్రి మండలి), కుక్కే తోక!! ప్రభుత్వ అధికారాలను చెలాయించడంలో భాగంగా కార్యనిర్వాహక వర్గం చేపట్టే ఏ చర్య విషయంలో నైనా ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్ అభిప్రాయాన్ని తెలుసుకుని, ఆయన అనుమతిని పొంది తీరాలని సదరు సవరణ బిల్లు స్పష్టం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే శాసనసంబంధ హస్త కౌశలం ద్వారా మోదీ ప్రభుత్వం ఢిల్లీలో తన వైస్రాయ్‌ను ప్రతిష్ఠించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన మంత్రులు వైస్రాయ్‌కి ఆదేశాలు శిరసావహించే సేవకులు అయిపోయారు! 


ఇటువంటి విపత్కర పరిస్థితి నెదుర్కోవలసివచ్చే రోజు తనకు తప్పక వస్తుందని కేజ్రీవాల్ ముందుగానే ఊహించి వుండవల్సింది. అధికరణ 370ని రద్దుచేసి జమ్మూ -కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిననాడే తానూ ఒక వైపరీత్యాన్ని ఎదుర్కోవలసివస్తుందనే అంచనాకు ఆయన వచ్చివుండవల్సింది. అయితే కేజ్రీవాల్ మహాశయుడు కశ్మీర్‌లో ప్రజాస్వామ్యంపై దాడిని ‘జాతీయవాదం’ పేరిట సమర్థించారు. ఇప్పుడు ఆయనే ఒక ఘోర అవమానానికి గురయ్యారు. అయినప్పటికీ నా సానుభూతి అంతా కేజ్రీవాల్ కే. మరి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి ఆయన సంసిద్ధమవుతారా? 


మన దేశంలో ప్రజాస్వామ్యం అంతకంతకూ కుంచించుకుపోతోంది. భారత్‌లో ‘పాక్షిక స్వేచ్ఛ’ మాత్రమే ఉందన్న సత్యాన్ని ప్రపంచం గుర్తించింది. భారతీయ జనతాపార్టీ లక్ష్యం ఏక పార్టీ పాలనను నెలకొల్పడమే. రబ్బర్ స్టాంప్ పార్లమెంట్, అనుకూలంగా వ్యవహరించే న్యాయవ్యవస్థ, ప్రభుత్వ మద్దతుతో వర్ధిల్లే మీడియా, భౌతిక అభివృద్ధితో సంతోషించి సదా లోబడి ఉండే ప్రజలతో నవ భారతదేశాన్ని నిర్మించేందుకు బీజేపీ ఆరాటపడుతోంది. మరి ఆ కొత్త భారతదేశం చైనాకు భిన్నంగా ఉండబోదు భారత ప్రభుత్వ చట్టం -1935, ‘గో బ్యాక్ సైమన్’ అను భవాలు స్ఫురించడం లేదూ?




పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2021-03-27T06:08:37+05:30 IST