ట్రంప్‌ను గద్దె దింపే దిశగా డెమొక్రాట్లు.. రేపే అభిశంసన!

ABN , First Publish Date - 2021-01-10T12:50:08+05:30 IST

కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రమాణ స్వీకారోత్సవ సమయం- అంటే జనవరి 20వ తేదీ- సమీపిస్తున్న కొద్దీ అమెరికాలో సామాజిక, రాజకీయ అశాంతి మరింత పెరుగుతోంది. కేపిటల్‌ భవనంపై దాడి ఘటనతో ఉత్తేజితులైన శ్వేత జాత్యహంకార గ్రూపులు- మరిన్ని దాడులకు కుట్ర పన్నుతున్నట్లు ఇంటెలిజెన్స్‌ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. కేపిటల్‌ ముట్టడితో నిఘా వైఫల్యం బట్టబయలు కావడంతో- ఇపుడు భద్రతాయంత్రాంగం అప్రమత్తమైంది.

ట్రంప్‌ను గద్దె దింపే దిశగా డెమొక్రాట్లు.. రేపే అభిశంసన!

ట్రంప్‌ తక్షణం గద్దె దిగు.. లేదంటే మళ్లీ అభిశంసిస్తాం.. డెమొక్రాట్ల చివరి హెచ్చరిక

మద్దతిస్తున్న రిపబ్లికన్లు.. బైడెన్‌ విముఖం... కొనసాగుతున్న చర్చలు 

వాషింగ్టన్‌, జనవరి 9: కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రమాణ స్వీకారోత్సవ సమయం- అంటే జనవరి 20వ తేదీ- సమీపిస్తున్న కొద్దీ అమెరికాలో సామాజిక, రాజకీయ అశాంతి మరింత పెరుగుతోంది. కేపిటల్‌ భవనంపై దాడి ఘటనతో ఉత్తేజితులైన శ్వేత జాత్యహంకార గ్రూపులు- మరిన్ని దాడులకు కుట్ర పన్నుతున్నట్లు ఇంటెలిజెన్స్‌ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. కేపిటల్‌ ముట్టడితో నిఘా వైఫల్యం బట్టబయలు కావడంతో- ఇపుడు భద్రతాయంత్రాంగం అప్రమత్తమైంది. మొత్తం అన్ని ఆన్‌లైన్‌ గ్రూపుల పోస్టింగ్‌లపై నిఘా పెట్టింది. మితవాద తీవ్రవాద గ్రూపులు- బైడెన్‌ పట్టాభిషేకాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం కావడంతో దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈ గ్రూపుల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు.


6వ తేదీన జరిగిన తీరులో మళ్లీ ట్రంప్‌-అనుకూల అరాచక శక్తులు పెట్రేగి ప్రమాణస్వీకారోత్సవాన్ని భగ్నం చేయకుండా వాషింగ్టన్‌ అంతటా నిషేధాజ్ఞలు విధిస్తున్నారు. మరోపక్క- ముట్టడిని స్వయంగా ప్రోత్సహించిన నేరంపై తక్షణం డొనాల్డ్‌ ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డెమొక్రాట్లు పట్టుబడుతున్నారు. శనివారంనాడు తెల్లవారుజాము దాకా మంతనాలు సాగించిన డెమొక్రాట్‌ కాంగ్రెస్‌ సభ్యులు- ఆయనను అభిశంసించే ప్రక్రియను సోమవారం మొదలుపెట్టాలని నిశ్చయించారు. ‘ట్రంప్‌ స్వచ్ఛందంగా వైదొలగాలి.. లేదంటే రెండోసారి అభిశంసించడానికి వెనుకాడం. ఇది మా నిర్ణయం. గద్దె దిగాలని ఇప్పటికే ఆయనకు స్ప ష్టం చేశాం’ అని స్పీకర్‌ నాన్సీ పెలోసీ చెప్పారు.


తిరుగుబాటును దగ్గరుండి నడిపిన ట్రంప్‌ పదవిలో కొనసాగడానికి అనర్హులని తీర్మానం ముసాయిదాలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సోమవారంనాడు సభా కమిటీ ఈ అభిశంసన ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసి తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. వచ్చే బుధ, గురువారాల్లో చర్చ జరుగుతుంది. తీర్మానం ఆమోదించాక- సెనెట్‌కు వెళుతుంది. అయితే సెనెట్‌ దీన్ని చేపట్టి నిష్పక్షపాతమైన విచారణ జరిపేవేళకు ట్రంప్‌ పదవీకాలం పూర్తవుతుంది. అయినా దాన్ని కొనసాగించి ఆయనను ఎలాగైనా అభిశంసించాలన్నది డెమొక్రాట్ల ఆలోచన. అయితే 20న ప్రమాణస్వీకారం చేశాక బైడెన్‌ ఈ ప్రక్రియను ఆమోదిస్తారా లేదా అన్నది సందేహమే... దేశం యావత్తునూ ఒక్కతాటిపైకి తెస్తానని ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన ఆయన- తన అధ్యక్ష పదవీకాల తొలినాళ్లలోనే ఈ ప్రతికూల వాతావరణం, రిపబ్లికన్‌ పార్టీతో విభేదాలను కోరుకోవడం లేదు.


ప్రస్తుతం కొవిడ్‌ కార్యాచరణ, ఇమిగ్రేషన్‌ విధానాల మార్పులపై ఆయన ప్రధానంగా దృష్టి సారించి- వ్యవస్థలన్నింటినీ తొలుత గాడిలో పెట్టాలనుకుంటున్నారు తప్ప రాజకీయ వ్యవహారాలపై ఆసక్తిగా లేరని సన్నిహిత వర్గాలు తెలిపాయి. స్పీకర్‌ పెలోసీ ఆయనతో తాజాగా మంతనాలు సాగిస్తున్నట్లు సీఎన్‌ఎన్‌ తెలిపింది. అభిశంసనకు పలువురు రిపబ్లికన్లు కూడా మద్దతు పలికారు. తీర్మానాన్ని తానే ప్రవేశపెడతానని నెబ్రస్కాకు చెందిన సభ్యుడు బెన్‌ సాసే తెలిపారు. కాగా- ప్రమాణ స్వీకారానికి హాజరుకాబోనంటూ ట్రంప్‌ చేసిన ప్రకటనను బైడెన్‌ స్వాగతించారు. ఆయన రాకపోవడమే మంచిదన్నారు. 


వీడియో కలకలం

ట్రంప్‌, కుటుంబ సభ్యులు పాల్గొన్న ఓ వీడియో తీవ్రచర్చను రేపింది. కేపిటల్‌ దాడికి ముందు వైట్‌హౌ స్‌ వెలుపల ఓ పార్టీ జరిగింది. రిపబ్లికన్‌ మద్దతుదారులు పాల్గొన్న ఆ పార్టీకి ఆయనతో పాటు ఇవాంకా, కొడుకు జూనియర్‌ డొనాల్డ్‌, అతని ప్రేయసి కూడా హాజరయ్యారు. దానిని లైవ్‌స్ట్రీమ్‌ చేసిన డొనాల్డ్‌ జూనియర్‌-వారంతా కేపిటల్‌ దాడికి వెళతారని ఆ వీడియోలో పేర్కొన్నారు. అయితే ఆ వీడియో ఖచ్చితంగా ఎపుడు తీశారన్నది స్పష్టం కాలేదు.


ట్విటర్‌ అనూహ్య నిర్ణయం

డొనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్లు దాదాపుగా అన్ని సామాజిక మాధ్యమాలూ ప్రకటించాయి. ఫేస్‌బుక్‌, స్నాప్‌చాట్‌, ట్విచ్‌, రెడిట్‌... మొదలైనవి ఇంతకుమునుపే ఆయన ఖాతాలను నియంత్రించగా, తాజాగా అత్యంత కీలకమైన ట్విటర్‌- ఆయన అకౌంట్‌ను శాశ్వతంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన ట్వీట్లను పరిశీలించిన మీదట మరింత హింసను ప్రేరేపించేట్లుగా ఉన్నాయని, ఇకమీదట హింసా విధ్వంసాలకు ప్రోద్బలమిచ్చేట్లు ఆయన నుంచి ఎలాంటి సందేశాలూ రాకుండా ఉండాలంటే నిషేధం అనివార్యమని ట్విటర్‌ పేర్కొంది.


‘ముఖ్యంగా ఆరో తేదీన కేపిటల్‌ భవనాన్ని ముట్టడించి, దాడి  చేసిన వారిని దేశభక్తులని కొనియాడడం, తదుపరి అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి హాజరుకాబోనని ప్రకటించడం ప్రజలను మరింత రెచ్చగొట్టడమే. ఇవి ట్విటర్‌ అనుసరిస్తున్న నియమాలకు విరుద్ధంగా ఉన్నాయి. అందుచేత రియల్‌డొనాల్డ్‌ట్రంప్‌ ఖాతాను శాశ్వతంగా నిలిపేస్తున్నాం’’ అని ట్విటర్‌ ఓ బ్లాగ్‌పోస్టులో పేర్కొంది. ఆ వెంటనే ఆయన అకౌంట్‌ను స్తంభింపజేసింది. ఆయన పోస్టుల కోసం వెతికినపుడు ‘అకౌంట్‌ సస్పెండెడ్‌’ అని డిస్‌ప్లే అవుతోంది.


ట్విటర్‌ నిర్ణయాన్ని ట్రంప్‌ తేలిగ్గా తీసుకున్నారు. ‘ట్విటర్‌ స్వేచ్ఛా వాణిని వినిపించనివ్వదు. నన్ను నోరెత్తకుండా చేయాలని చూస్తోంది. అతివాద వామపక్షవాదులకు కొమ్ముకాస్తోంది’ అని ఎదురుదాడి చేశారు. ఇక  సొంతంగా తానే ఓ సామాజిక వేదికను  ఏర్పాటుచేసుకొంటానని సంకేతాలను ఇచ్చారు. ట్రంప్‌ అకౌంట్‌ను ట్విటర్‌ నిషేధించడాన్ని అనేకమంది అమెరికన్లు సమర్థిస్తుంటే బీజేపీ మాత్రం తప్పుబడుతోంది.


‘ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇదో హెచ్చరిక. ఇవాళ అమెరికా అధ్యక్షుడి ఖాతానే నిషేధించినవారు రేపు ప్రపంచంలో వేరెవ్వరి ఖాతానైనా స్తంభింపజేయరని గ్యారంటీ ఏమిటి? భారత్‌ వెంటనే దీనిపై దృష్టి పెడుతుంది. బడా కంపెనీల నియంత్రణ విధానాలను సమీక్షిస్తుంది’ అని బీజేపీ యువ నేత తేజస్వీ సూర్య అన్నారు.  

Updated Date - 2021-01-10T12:50:08+05:30 IST