డెంగ్యూ ... డేంజర్‌ !

ABN , First Publish Date - 2021-12-23T06:03:09+05:30 IST

ఇటీవల జిల్లాలో భారీ వర్షాలు, వరదలు సంభవించడంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రోజుల తరబడి నీరు నిల్వ ఉండటంతో డెంగ్యూ దోమలు ప్రబలి ప్రజలు మంచానపడుతున్నారు.

డెంగ్యూ ... డేంజర్‌ !
ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యాధిగ్రస్తులు

వందల సంఖ్యలో జ్వరపీడితులు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు కరువు

ప్రైవేటు వైద్యశాలలకు బాధితుల పరుగు 

వ్యాధిగ్రస్తుల గుర్తింపులో వైద్య శాఖ వింత ధోరణి

ఇప్పటికే ఒకరు మృత్యువాత 


జిల్లాపై డెంగ్యూ పడగ విప్పుతోంది. నెలరోజులుగా కేసులు పెరుగుతున్నాయి. బాధితులతో ప్రైవేట్‌ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. వందల సంఖ్యలో వ్యాధిగ్రస్తు లు ఉన్నారని ప్రైవేటు వైద్యులు చెబుతుంటే జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 30 కేసులే నమోదయ్యాయని వైద్యశాఖ వాదిస్తోంది. వ్యాధిగ్రస్తుల నిర్థారణ విషయంలోనూ వైద్యాధికారులు వింత ధోరణి అవలంబిస్తున్నారు. మరోవైపు బాధితుల్లో తీవ్రమైన జ్వరానికితోడు ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతుండటంతో వాటి కోసం వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులు బ్లడ్‌ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. 


నెల్లూరు(వైద్యం), డిసెంబరు 22 : 

ఇటీవల జిల్లాలో భారీ వర్షాలు, వరదలు సంభవించడంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రోజుల తరబడి నీరు నిల్వ ఉండటంతో డెంగ్యూ దోమలు ప్రబలి ప్రజలు మంచానపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులు ఉన్నప్పటికీ వాటిలో డెంగ్యూకు సరైన వైద్యం అందకపోవటంతో పేదలు సైతం ప్రైవేట్‌ ఆసుపత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది. మరోవైపు గ్రామ స్థాయిలో డెంగ్యూ జ్వరాల నియంత్రణలో వైద్య ఆరోగ్యశాఖ విఫలం అవుతోందని ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి. ఇందుకూరుపేట మండలం కొత్తూరుకు చెందిన ఓ మహిళ ఇటీవల డెంగ్యూతో మృతి చెందటం జిల్లాలో ఆ వ్యాధి తీవ్రతకు నిదర్శనం. 


పెద్ద సంఖ్యలో బాధితులు

జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక్క నెల్లూరు నగ రంలోనే పెద్ద సంఖ్యలో వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు సమాచారం. నెల్లూరు రూరల్‌ మండలం గొల్లకందుకూరు గ్రామంలోనూ కేసులు ఎక్కువ ఉన్నాయి. అలాగే కలువాయి, ఉదయగిరి, సీతారామపురం, దుత్తలూరు, బోగోలు, కలిగిరి, కావలి, రాపూరు, ఆత్మకూరు, అల్లూరు తదితర మండలాల్లో ఇప్పటికే డెంగ్యూ జ్వర పీడితులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ జ్వరంగా భావించి చికిత్స పొందుతు న్న వ్యాధిగ్రస్తులు ఆఖరుకు డెంగ్యూగా నిర్ధారణ కావడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పరిస్థితి విషమించితే చెన్నైకి పరుగులు తీయాల్సి వస్తోంది.


వైద్య శాఖ వింత వైఖరి

ప్రపంచ ఆరోగ్య సంస్థ డెంగ్యూ వ్యాధి నిర్థారణకు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ర్యాపిడ్‌ పరీక్ష ద్వారా నిర్థారణ అయితే పరిగణలోకి  తీసుకుని వైద్య చికిత్సలు అందించాలని సూచించింది. అయితే వైద్య ఆరోగ్యశాఖ మాత్రం ర్యాపిడ్‌ పరీక్షలో గుర్తించిన డెంగ్యూ కేసులను పరిగణలోకి తీసుకునేది లేదని తేల్చి చెబుతోంది. డెంగ్యూ వ్యాధి నిర్థారణకు ఎలీషా పరీక్ష తప్పనిసరి అంటోంది. ఆ పరీక్ష కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రు ల్లో ఉన్నా ఆ ఫలితాలు పరిగణలోకి తీసుకోమని, కేవలం నెల్లూరులోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రితోపాటు, కావలి, గూడూరు, ఆత్మకూరు, నాయుడుపేట, వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిపే పరీక్షలే ప్రామాణికం అంటోంది. కానీ, ఆయా ఆసుపత్రుల్లో సకాలంలో పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. దీంతో వైద్యశాఖ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 


అవగాహనేది?

వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడంలో వైద్యశాఖ వైఫల్యం చెందుతోంది.  అధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర సిబ్బంది పెద్ద సంఖ్యలో ఉన్నా ప్రాణాంతక వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమవుతున్నారు. ప్రత్యేకించి ఈ సీజన్‌లో డెంగ్యూ వ్యాధి కారకమైన టైగర్‌ దోమల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ప్రజలు వాటి నుంచి రక్షణ పొందేలా వైద్యశాఖ చేపట్టే ప్రచార కార్యక్రమా ల్లో  మున్సిపాలిటీలు భాగస్వామ్యం కావాల్సి ఉన్నా ఆ దిశగా మున్సిపల్‌ అధికారులు సహకరించటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్నాయి 

జిల్లాలో డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేట్‌ ఆసుపత్రులు బాధితులతో నిండుతున్నాయి. వ్యాధిగ్రస్తుల్లో ప్లేట్‌లెట్లు తగ్గిపోవడంతో ప్రత్యేక వైద్యం అందించాల్సి వస్తుంది. వర్షాలు, వరదల కారణంగా డెంగ్యూ దోమ విజృంభిస్తోంది. 

- డాక్టర్‌ రమణయ్య, రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల


Updated Date - 2021-12-23T06:03:09+05:30 IST