డెంగీ అలజడి

ABN , First Publish Date - 2022-07-07T17:28:36+05:30 IST

మహానగరంలో డెంగీ అలజడి మొదలైంది. వర్షాలతోపాటు చాప కింద నీరులా దోమకాటు వ్యాధులు ప్రబలుతున్నాయి. గత నెలలో

డెంగీ అలజడి

గ్రేటర్‌లో పెరుగుతున్న కేసులు 

వర్షాలతోపాటు అధికమైన దోమలు 

300 హాట్‌స్పాట్లు గుర్తింపు


హైదరాబాద్‌ సిటీ: మహానగరంలో డెంగీ అలజడి మొదలైంది. వర్షాలతోపాటు చాప కింద నీరులా దోమకాటు వ్యాధులు ప్రబలుతున్నాయి. గత నెలలో 100కు పైగా డెంగీ కేసులు నమోదు కావడం ఇందుకు నిదర్శనం. జనవరి నుంచి ఇప్పటి వరకు నిర్ధారణ అయిన డెంగీ కేసులు 191 అని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతుండగా.. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కేసులను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య రెండు, మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. ప్రజలు అప్రమత్తంగా ఉండకుంటే ముప్పు తప్పదని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి.


ఈ మూడు నెలల్లోనే..

జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి. ఈ మూడు నెలలను డెంగీ సీజన్‌గా వైద్య వర్గాలు చెబుతుంటాయి. 2019, 21లోనూ కేసులు అధికంగా నమోదైంది మూడు నెలల్లోనే కావడం గమనార్హం. దోమల ద్వారా డెంగీ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని, డెంగీ నిర్ధారణ అయిన వ్యక్తిని కుట్టిన దోమ ఆరోగ్యవంతుడైన మరొకరిని కుట్టిన పక్షంలో అతడికీ డెంగీ సోకే ప్రమాదముందని జీహెచ్‌ఎంసీలోని ఓ డాక్టర్‌ చెప్పారు. 


క్రానిక్‌ బ్రీడింగ్‌ పాయింట్లు..

ఎంటమాలజీకి చెందిన 642 బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి. మూడేళ్లుగా నమోదైన కేసుల ఆధారంగా నగరంలో దాదాపు 300 వరకు హాట్‌స్పాట్‌లను గుర్తించి అక్కడ దోమల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా ప్రాంతాల్లో నీరు నిల్వడం వల్ల డెంగీ దోమల వృద్ధికి ఆస్కారం కలుగుతుందని ఓ అధికారి చెప్పారు. వీటిని క్రానిక్‌ బ్రీడింగ్‌ పాయింట్లుగా పరిగణిస్తున్నారు. ఇలాంటివి నగరంలో 2,846 ఉన్నట్టు గుర్తించారు. రెండేళ్ల క్రితమూ సర్వే నిర్వహించి దోమల తీవ్రత ఉన్న ప్రాంతాల గుర్తింపు ద్వారా ఆ ఏరియాల్లో పకడ్భందీ నివారణ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే 2020లో డెంగీ కేసులు తక్కువగా నమోదయ్యాయి. 2021లో ఎప్పటిపాటే పాడడంతో కేసుల సంఖ్య పెరిగింది. ఈ సంవత్సరమూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఫిర్యాదు చేస్తే తప్ప ఫాగింగ్‌ చేసే పరిస్థితి లేదు. ఉన్నత స్థాయి పర్యవేక్షణ లేకపోవడం వల్లే బృందాలు సరిగా పని చేయడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫాగింగ్‌ కోసం ఏటా రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నా దోమలు తగ్గడం లేదు 


సూప్‌తో సేఫ్‌..

వర్షాకాలంలో  రోగ నిరోధక శక్తి మెరుగుపరుచుకోవడానికి తప్పనిసరిగా సీజనల్‌ ఫ్రూట్స్‌ తో పాటుగా కూరగాయలను డైట్‌లో జోడించుకోవాలని డైటీషియన్లు చెబుతున్నారు. సూప్స్‌ లాంటివి ఎక్కువ మేలు చేస్తాయని సూచిస్తున్నారు. మిక్స్‌డ్‌ వెజ్‌, దాల్‌ సూప్‌, పాలక్‌, మష్రూమ్‌, చికెన్‌, మిరియాలు జోడించిన బోన్‌సూప్స్‌ మంచిదంటున్నారు 

 ప్రొటీన్‌ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. జింక్‌, విటమిన్‌ డీ, సీ లభించే పదార్థాలతో పాటుగా ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి. 

 పండ్లు, కూరగాయలు, పాలు, చపాతీలు ఎక్కువగా తీసుకోవాలి.

 హెర్బల్‌ టీ సూపర్‌ ఫుడ్‌గా పనిచేస్తుంది. తాజా అల్లం లేదంటే సొంటి, తులసి, యాలకలు వంటి వాటితో ఈ టీ చేసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 

 ఈ సీజన్‌లో నేరేడు, పనస, జామ, ఆరెంజ్‌, కివి లాంటి పండ్లు మేలు చేస్తాయి. 

 పకోడి లేదంటే బజ్జీ కంటే బాదములు లాంటి గింజలు  తీసుకోవాలి. 

 అంటువ్యాధుల బారిన పడకుండా పెరుగు తోడ్పడుతుంది. 

 నీరు అధికంగా తీసుకోవాలి.


పొంచి ఉన్న రోగాలు

కలుషిత నీటి ముప్పు 

వానాకాలం జర భద్రం

రోగ నిరోధక శక్తిపై ప్రభావం


గ్రేటర్‌లో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోతున్నాయి. మంచి నీళ్లు, డ్రైనేజీ నీళ్లు కలుస్తున్నాయి. దోమలు పెరుగుతున్నాయి. వీటి వల్ల రోగాలు వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


వైరస్‌ విజృంభించే అవకాశాలు

ఒకే రోజు ఆగి.. ఆగి వర్షం కురుస్తుండటంతో వాతావరణం చల్లగా ఉంటోంది. దీని వల్ల వైరస్‌ విజృంభించే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇన్‌ఫ్లూయింజా వైరస్‌ శక్తివంతమైతే జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోశ వ్యాధులు తీవ్రమవుతాయని పేర్కొంటున్నారు. ఈ కాలంలో ఇన్‌ఫెక్షన్‌ను తట్టుకునే శక్తి తగ్గుతూ ఉంటుంది. వాతావరణంలో తేమ ఎక్కువ కావడంతో బ్యాక్టీరియా, వైరస్‌ విజృంభిస్తాయి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, వ్యాధిగ్రస్తులు రోగాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.


జాగ్రత్తలు ఇలా..

 తేలికైన , వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.

 నీళ్లను కాచి చల్లార్చి తాగాలి.

 చల్లటి వాతావరణంలో ఎక్కువగా తిరగొద్దు. 

 శరీరం పూర్తిగా కవర్‌ అయ్యే విధంగా వెచ్చటి దుస్తులు ధరించాలి.

 దగ్గు వస్తే చేతి రుమాలు నోటికి అడ్డంగా పెట్టుకోవాలి.

 చేతి రమాలును వేడినీటిలో నాన బెట్టి ఉతికిన తర్వాత వినియోగించాలి. 

 జ్వరం వచ్చి తగ్గుతుంటే రక్తపరీక్షలు చేయించుకోవాలి.

 అంటువ్యాధులు సోకిన వారికి చిన్నపిల్లలు, మహిళలు దూరంగా ఉండాలి.

 ఈగలు, దోమలు ముసిరే ప్రాంతాల్ని వెంటనే శుభ్రం చేసుకోవాలి.

Updated Date - 2022-07-07T17:28:36+05:30 IST