డెంగ్యూ నివారణ ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-05-17T05:38:55+05:30 IST

డెంగ్యూ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారి డాక్టర్‌ జువేరియా అన్నారు.

డెంగ్యూ నివారణ ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
డెంగ్యూ నివారణ ర్యాలీని ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ జువైరియా

సుభాష్‌నగర్‌, మే 16: డెంగ్యూ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారి డాక్టర్‌ జువేరియా అన్నారు. సోమవారం నగరంలో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే 16వ తేదీన డెంగ్యూ దినోత్సవం జరుపుకుంటామన్నారు. డెంగ్యూపై రాబోయే వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లలు, గర్భిణులు, దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుహ్రంగా ఉంచుకుంటూ ఇంటి చుట్టు పక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. డెంగ్యూ వ్యాధి ఎడిస్‌ ఈజిప్టి ఆడ దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందుతుందన్నారు. నీటి నిల్వ ఉండే ప్రదేశాల్లో డెంగ్యూ దోమ గుండ్లు పెడుతుందన్నారు. ముఖ్యంగా పూల కుండీలు, టైర్లు, కొబ్బరి చిప్పలు, కూలర్లు  మొదలగు ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. డెంగ్యూ వ్యాధి ప్రాణాంతకమైనదని, నిర్లక్ష్యం చేయవద్దన్నారు. జ్వరం, కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటే జిల్లా  ఆసుపత్రిలో డెంగ్యూ నిర్ధారణ కోసం పరీక్ష చేయించుకొని చికిత్స చేయించుకోవాలన్నారు. ర్యాలీలో జిల్లా మలేరియా అధికారి బి రాజగోపాల్‌రావు, క్షయ నివారణ అధికారి డాక్టర్‌ రవీందర్‌రెడ్డి, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి సాజిదా, పీవోఎంసీహెచ్‌ డాక్టర్‌ విప్లవశ్రీ, సీడీపీవో అర్బన్‌ ఉమారాణి, సీహెచ్‌ రంగారెడ్డి, పుష్ప, రాజగోపాల్‌, ప్రతాప్‌, మహేందర్‌, రామనాథం, లింగయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T05:38:55+05:30 IST