వైద్య కళాశాలకు అనుమతి నిరాకరణ

ABN , First Publish Date - 2022-10-08T03:22:24+05:30 IST

జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటుపై అయోమయం నెలకొంది. మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ గోదాములను సుమారు రూ.11 కోట్లతో ఆధునికీకరించారు. నిర్మాణ పనులను రెండుసార్లు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) అధికారులు తనిఖీ చేశారు. ఇక అనుమతులు వచ్చి ఈయేడు అడ్మిషన్లు ప్రారంభమవు తాయనే సమయంలో రేకుల షెడ్‌లో కళాశాల ఏర్పాటు చేస్తున్నందున అనుమతులను నిరాకరిస్తున్నట్లు ఎన్‌ఎంసీ పేర్కొంది. అయితే పలు జిల్లాల్లో రేకులషెడ్‌లో మెడికల్‌ కళాశాల నిర్వహణకు అనుమతులు ఇచ్చిన ఎన్‌ఎంసీ మంచిర్యాలకు ఇవ్వకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.

వైద్య కళాశాలకు అనుమతి నిరాకరణ
గోదాంలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాల

రెండుసార్లు తనిఖీ చేసిన ఎన్‌ఎంసీ

కొత్తగా తెరపైకి వచ్చిన రేకుల షెడ్డు అంశం  

అధికారుల వైఖరిపై సర్వత్రా విమర్శలు  

మంచిర్యాల, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లాకు మం జూరైన వైద్య కళాశాలపై అయోమయం  నెలకొంది. ప్రత్యేక జిల్లా ఏర్పా టైన తర్వాత వైద్య కళాశాల మంజూరు చేస్తానన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ మేరకు మెడికల్‌ కాలేజీకి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 8  వైద్య కళాశాలలను ప్రతిపాదించగా ఒక్క మంచిర్యాల కాలే జీకే నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) అనుమతిని నిరాకరించింది.    మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, మహబూబా బాద్‌, కొత్తగూడెం, సంగారెడ్డిలో వైద్య కళాశాలలకు ప్రభుత్వం ఏర్పాటుకు సమాయత్తమైంది. వాటిలో ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్‌లు సైతం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. 

ఎన్‌ఎంసీ అనుమతి నిరాకరణ 

రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన 8 వైద్య కళాశాలల్లో మంచిర్యాలకు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ అనుమతి నిరాకరించింది. ఇప్పటికే రెండు దఫాలుగా తనిఖీలు పూర్తి కాగా మూడో విడత ఆన్‌లైన్‌ పరిశీలనలో వైద్య కళాశాలకు ఎన్‌ఎంసీ అనుమతిని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు విడతల తనిఖీల్లో ఎన్‌ఎంసీ అధికారుల సూచనల మేరకు మార్పులు, చేర్పులు చేసినప్పటికి అనుమతులు ఇవ్వలేదు. మెడికల్‌ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినప్పటికి ఎన్‌ఎంసీ అనుమతులు నిరాకరించడంతో ఇక్కడి ప్రజలు నిరాశకు లోనవుతున్నారు. 

రేకుల షెడ్డే కారణమా...?

మంచిర్యాల వైద్య కళాశాల కోసం ప్రతిపాదించిన మార్కెట్‌ యార్డు స్థలంలో రేకుల షెడ్‌తో నిర్మాణాలను చేపట్టారు. గతంలో ఇక్కడ ఉన్న మార్కెట్‌ కమిటీ యార్డు ఆవరణలో గోదాములను ఖాళీ  చేయించి ఆ ప్రదేశంలో మెడికల్‌ కళాశాల కోసం మరమ్మతు చేపట్టారు. రూ.11.50 కోట్లతో గోదాములను తరగతి గదులు, ల్యాబరేటరీలు, ఇతర అవసరాల కోసం తీర్చిదిద్దారు. అయితే తాత్కాలిక  ఏర్పాట్లలో భాగంగా రేకుల షెడ్‌లో కళాశాలకు అవసరమైన ఏర్పాట్లు జరిగాయి.  గోదామును కళా శాల నిర్వహణకు అనుకూలంగా తీర్చిదిద్దినప్పటికీ తనిఖీల్లో ఎన్‌ఎంసీ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు.  మూడో విడత ఆన్‌లైన్‌ తనిఖీల్లో రేకుల షెడ్‌ కావడంతో అనుమతిని నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. రెండు విడతల్లో రేకుల షెడ్డును గుర్తించని ఎన్‌ఎంసీ అధికా రులు మూడో విడతలో అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అధికారుల వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపాదించిన వైద్య కళాశాలల్లో మంచిర్యాల మినహా ఇతర చోట్ల రేకుల షెడ్‌లతో ఏర్పాటు చేసిన వాటికి అనుమతులు లభించాయి. జగిత్యాలలో కూడా రేకుల షెడ్‌తో కూడిన గోదాములలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలకు అనుమతులు జారీ చేసి మంచిర్యాలలో నిరాకరించడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే  వైద్య కళాశాలకు అనుమతులు నిరాకరిం చడంపై రాజకీయ పాత్రపై  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడా లేని నిబంధనలు కేవలం మంచిర్యాలకే వర్తింపజేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని వైద్య కళాశాలకు అనుమతులు తీసుకురావడానికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

కేంద్ర మంత్రికి విన్నపం 

మంచిర్యాలలో మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు తాత్కాలికంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ ఎన్‌ఎంసీ అనుమతులు నిరాకరించడంపై పెద్దపల్లి ఎంపీ  వెంకటేష్‌ నేత, ఎమ్మెల్యే దివాకర్‌రావు ఇటీవల ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రిని కలిశారు. తాత్కాలిక భవనం కావడంతోనే రేకుల షెడ్‌లో ఏర్పాటు చేశామని, శాశ్వత భవనం కోసం విశాలమైన స్థలాన్ని ఎంపిక చేయడం జరిగిందని వారు మంత్రికి వివరించారు. కొత్తగా ఎంపిక చేసిన స్థలంలో కళాశాల నిర్వహణకు అవసరమైన విధంగా భవన నిర్మాణ పనులు చేపట్టి రెండు మూడు సంవత్సరాల్లోపు అందులోకి మార్చుతా మని  హామీ ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచే మంచిర్యాల కళాశాలలో  తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని విన్న వించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్‌ఎంసీకి అనుమతిం చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. 

Updated Date - 2022-10-08T03:22:24+05:30 IST