పాఠశాలల రికార్డులు పక్కాగా ఉండాలి

ABN , First Publish Date - 2020-12-03T05:27:57+05:30 IST

పాఠశాలల రికార్డులు పక్కాగా ఉండాలని జిల్లా విద్యా శాఖ అధికారి బి.లింగేశ్వరరెడ్డి ఆదేశించారు.

పాఠశాలల రికార్డులు పక్కాగా ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో లింగేశ్వరరెడ్డి

హెచ్‌ఎంల సమావేశంలో డీఈవో లింగేశ్వరరెడ్డి

22 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు


కొత్తూరు, డిసెంబరు 2: పాఠశాలల రికార్డులు పక్కాగా ఉండాలని జిల్లా విద్యా శాఖ అధికారి బి.లింగేశ్వరరెడ్డి ఆదేశించారు. స్థానిక ఏఎంఏఏ హైస్కూలులో ఎలమంచిలి డివిజన్‌ పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో బుధవారం సమావేశమయ్యారు. ఈ నెల 7న కాగ్‌ (సెంట్రల్‌ ఆడిట్‌ గ్రూపు) కమిటీ జిల్లాలోని అన్ని పాఠశాలలను పరిశీలిస్తుందని, ఈలోగా మధ్యాహ్న భోజన పథకం, డ్రై రేషన్‌ పంపిణీ, నాడు-నేడు పనులకు సంబంధించిన అన్ని రికార్డులు తయారు చేసి ఉంచుకోవాలని సూచించారు. ఐదు నుంచి పది శాతం మందికి సరుకులు సక్రమంగా అందడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని, అటువంటివి పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

కాగా, ఎటువంటి అనుమతి లేకుండా ఈ సమావేశానికి గైర్హాజరైన 22 మంది హెచ్‌ఎంలకు డీఈవో షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వారంతా గురువారం తన కార్యాలయానికి రావాలని ఆదేశించారు. విద్యార్థులకు ఏ పథకం అందకపోయినా 9493861412 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని డీఈవో చెప్పారు. సమావేశంలో ఏఎంవో వెంకటేశ్వరరావు, ఏఎంఏఏ హైస్కూలు హెచ్‌ఎం లావణ్య, హెచ్‌ఎంలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-03T05:27:57+05:30 IST