Advertisement

గంగాజలం కోసం బయల్దేరిన మెస్రంలు

Jan 21 2021 @ 23:50PM
పూజలు చేస్తున్న మెస్రం వంశీయులు

ఇంద్రవెల్లి, జనవరి 21: తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదివాసీల ఆరాధ్య దైవం మండలంలోని కేస్లాపూర్‌ నాగోబా జాతర మహాపూజలకు కావాల్సిన పవిత్ర గంగాజలం కోసం మెస్రం వంశీయులు గురువారం బయలుదేరారు. నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు ఆధ్వర్యంలో మెస్రం వంశీయులు తొలుత సంప్రదాయ పూజలు చేశారు. అనంతరం కటోడ (పూజారీ) మెస్రం హన్మంతు, ప్రధాన్‌ మెస్రం తుకుడోజి ఆధ్వర్యంలో గంగాజలం కోసం బయలు దేరారు. కటోడ మెస్రం హన్మంతు వీపుపై కలశం  కట్టారు. తిరిగి వీరు ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుంటారు. గురువారం రాత్రి కేస్లాగూడ గ్రామంలో బస చేయనున్నట్లు మెస్రం వంశీయులు తెలిపారు. ఈ నెల 22న దోడంద, 23న నార్నూర్‌ మండలంలోని బాబేఝరి, 24న జామడ, 25న జైనూర్‌ మండలంలోని జెండగూడ, 26న గౌరి, 27న ఆల్లిగూడ, కోహినూర్‌, 28న జన్నారం మండలంలోని ఇస్లాంపూర్‌, 29న కలమడుగు, 30న జన్నారం మండలంలోని గోదావరి హస్తిన మడుగు వద్దకు చేరుకుంటామని చెప్పారు. అక్కడ పూజలు నిర్వహించి గంగాజలం సేకరించి తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 7న ఇంద్రవెల్లిలోని ఇంద్రాయి ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదే రోజు సాయంత్రం కేస్లాపూర్‌లో ఉన్న మర్రి చెట్టు వద్దకు చేరుకుంటామని తెలిపారు. మర్రి చెట్టు నీడలో మూడు రోజుల పాటు తూమ్‌ పూజలు చేసి ఫిబ్రవరి 11న ఆలయం సమీపంలోని గోవ్వాడ్‌కు చేరుకుంటామన్నారు. అదేరోజు రాత్రి నాగోబా ఆలయంలో మహాపూజలు చేసి జాతర ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయులు మెస్రం కోసు, మెస్రం తిరుపతి కోటోడ, మెస్రం శేఖర్‌, మెస్రం హనుమంత్‌రావు, మెస్రం తుక్డోజీ, మెస్రం వంశం ఉద్యోగుల సంఘం సభ్యులు మెస్రం మనోమర్‌, దేవ్‌రావు పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement