
మనకు ఎలాంటి కష్టం వచ్చినా సరే.. ఆ దేవుడికి మొక్కుకుంటాం. కష్టం నుంచి బయట పడేస్తే ఏదో ఒకటి చేస్తామని ఒట్టుపెట్టుకుంటాం. అనుకున్నది జరిగితే సంతోషిస్తాం. జరగకపోతే బాధపడతాం. కానీ నోయిడా ప్రాంతంలో నివసించే వినోద్ అనే యువకుడు మాత్రం అలా చేయలేదు.
మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్కు చెందిన అతను.. కుటుంబ సభ్యులతో కలిసి నోయిడాలో నివసిస్తున్నాడు. అతని కుటుంబసభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో ఎలాగైనా వాళ్లకు నయం చేయాలని స్థానికంగా ఉన్న ఒక ఆలయంలో పూజలు చేశాడు. కానీ ఫలితం లభించలేదు. ఈ మధ్య కాలంలోనే అతని మేనత్త అనారోగ్యం కారణంగా చనిపోయింది. దీంతో కోపం తెచ్చుకున్న వినోద్.. తన కోపాన్ని దేవుడిపై తీర్చుకున్నాడు.
అర్ధరాత్రి పూట తను పూజలు చేస్తూ వస్తున్న ఆలయంలోకి ప్రవేశించి, అక్కడ ఉన్న దేవతామూర్తుల విగ్రహాలను సుత్తితో కొట్టి ధ్వంసం చేశాడు. విగ్రహాలు ధ్వంసమైన విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. జరిగింది తెలుసుకొని వినోద్‌ను అదుపులోకి తీసుకున్నారు. తన కోరిక తీరలేదనే కోపంతోనే దేవతా మూర్తులను ధ్వంసం చేసినట్లు వినోద్ కూడా అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి