ధరాఘాతం.. 8 ఏళ్ల గరిష్ఠం

ABN , First Publish Date - 2022-05-13T06:40:28+05:30 IST

ఏప్రిల్‌ నెలలో రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం 8 ఏళ్ల గరిష్ఠ స్థాయి 7.79 శాతానికి ఎగబాకింది.

ధరాఘాతం.. 8 ఏళ్ల గరిష్ఠం

ఏప్రిల్‌లో  7.79 శాతానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం 

 

ఇంధనం, ఆహారోత్పత్తులు మరింత ప్రియం

ఆర్‌బీఐ వడ్డీ రేట్లను మరో 0.25% పెంచే చాన్స్‌ 


న్యూఢిల్లీ: ఏప్రిల్‌ నెలలో రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం 8 ఏళ్ల గరిష్ఠ స్థాయి 7.79 శాతానికి ఎగబాకింది. ఇంధనం, ఆహారో త్పత్తులు మరింత ప్రియమవడం ఇందుకు కారణమైంది. ఆర్‌బీఐకి ప్రభుత్వం నిర్దేశించిన నియంత్రణ లక్ష్యమైన 6 శాతా నికి ఎగువన రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదు కావడం వరుసగా ఇది నాలుగో నెల. 2014 మే నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 8.33 శాతంగా నమోదైంది. ఈ ఏడాది మార్చిలో 6.95 శాతంగా ఉంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కమోడిటీల ధరలు భగ్గుమంటున్నాయి. దాంతో రిటైల్‌ ఉత్ప త్తుల రేట్లు కూడా రికార్డు స్థాయిలో ఎగబాకాయి. మార్కెట్‌ ధరలకు కళ్లెం వేసేందుకు గత వారంలో కీలక వడ్డీ (రెపో) రేటును 0.40 శాతం పెంచిన ఆర్‌బీఐ.. జూన్‌లో నిర్వహించనున్న ద్రవ్య పరపతి విధాన సమీక్షలో మరోమారు ‘వడ్డి’ంచనుందని విశ్లేషకులంటున్నారు.

జూన్‌ 8న ప్రకటించిన సమీక్ష నిర్ణయాల్లో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటును మరో 0.25 శాతం పెంచవచ్చని ఉందని కేర్‌ రేటింగ్స్‌ ప్రధాన ఆర్థికవేత్త రజనీ సిన్హా అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 0.75-1 శాతం మేర పెంచే అవకాశాలున్నాయని ఆమె పేర్కొన్నారు. క్రిసిల్‌ రేటింగ్‌ సంస్థ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు, ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2022-23) ద్రవ్యోల్బణం అంచనాలను సైతం మరోమారు పెంచవచ్చని వారు భావిస్తున్నారు. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్‌బీఐ ఇప్పటికే ద్రవ్యోల్బణ అంచనాను 4.5 శాతం నుంచి 5.7 శాతానికి పెంచింది. 


ఐఐపీ అంతంతే.. 

ఈ ఏడాది మార్చి నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 1.9 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. గత ఏడాది మార్చిలోనైతే సూచీ లో బేస్‌ ఎఫెక్ట్‌ కారణంగా 24.2 శాతం వృద్ధిని కనబర్చింది. ఎన్‌ఎస్‌ఓ డేటా ప్రకారం.. ఈ మార్చిలో మాన్యుఫాక్చరింగ్‌ రంగ వృద్ధి వార్షిక ప్రాతిపదికన 0.9 శాతం పెరగగా.. మైనింగ్‌ 4 శాతం, విద్యుత్‌ 6.1 శాతం పుంజుకున్నాయి. ఈ మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఐఐపీ 11.3 శాతం వృద్ధిని కనబరిచింది. కరోనా సంక్షోభ ప్రభావంతో అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2020-21)లో మైనస్‌ 8.4 శాతానికి క్షీణించింది. 


మే నెలలోనూ 6.5 శాతం పైనే..

మే నెలలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయి నుంచి కాస్త దిగిరానున్నప్పటికీ, 6.5 శాతం ఎగువనే నమోదు కావచ్చని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్‌ అన్నారు. జూన్‌ సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను మరింత పెంచనుందని ఆమె అభిప్రాయపడ్డారు.


8.38 శాతానికి ఆహార ద్రవ్యోల్బణం 

జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ మార్చిలో 7.68 శాతంగా నమోదైన ఆహార ధరల ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 17 నెలల గరిష్ఠ స్థాయి 8.38 శాతానికి ఎగబాకింది. తృణధాన్యాలు, సంబంధిత ఉత్పత్తులు 21 నెలలు, మసాలాలు 17 నెలల గరిష్ఠానికి పెరిగాయి. ఇంధనం, విద్యుత్‌ విభాగంలో ధరల వార్షిక పెరుగుదల (ద్రవ్యోల్బణం) ఏప్రిల్‌లో 10.80 శాతానికి చేరుకుంది. మార్చిలో 7.52 శాతం పెరుగుదల నమోదైంది. వంటనూనెలు, కొవ్వు సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 17.28 శాతంగా (మార్చిలో 18.79 శాతం) ఉంది.  ఉక్రెయిన్‌ ప్రపంచంలోనే అతిపెద్ద సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ఎగుమతిదారు. భారత అవసరాల్లో మెజారిటీ భాగం ఆ దేశమే సమకూరుస్తోంది. కానీ, రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుంచి దిగుమతులకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో దేశంలో వంట నూనె రేట్లు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. 2021 ఏప్రిల్‌తో పోలిస్తే గతనెలలో కూరగాయల ధరలు కూడా 17 నెలల గరిష్ఠ స్థాయి 15.41 శాతం పెరిగాయి. ఈ మార్చిలో  11.64 శాతంగా నమోదైంది. 

Read more