మధ్యహ్నానికి ధరాఘాతం

ABN , First Publish Date - 2021-12-07T04:41:19+05:30 IST

మధ్యాహ్న భోజన పథకం వంటకార్మికులకు భారంగా మారింది. వేణ్నీళ్లకు చన్నీళ్లవలె కొంత ఆర్థికంగా చేదోడు అవుతుందని భావించి వంట బాధ్యతలు నెత్తికెత్తుకున్న మహిళా సంఘాల సభ్యులకు పథకం నిర్వహణ ఇబ్బందికరంగా మారింది.

మధ్యహ్నానికి ధరాఘాతం
బోయపల్లి హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న కార్మికురాలు

ధరల పెరుగుదలతో మధ్యాహ్న భోజనంలో నాణ్యత కరువు

రెట్టింపైన కూరగాయలు, నూనెల ధరలు

ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోని పరిస్థితి

ఆర్థిక భారంతో కష్టంగా మారిన పథకం నిర్వహణ 

చేతులెత్తేస్తున్న మహిళా సంఘాల సభ్యులు

రేటు రెట్టింపు చేయకపోతే వంట చేయలేమంటున్న నిర్వాహకులు

మూడు నెలలుగా బిల్లులూ పెండింగ్‌ 

వేతనమూ రూ.3 వేలు ఇవ్వాలని డిమాండ్‌


 మధ్యాహ్న భోజన పథకం వంటకార్మికులకు భారంగా మారింది. వేణ్నీళ్లకు చన్నీళ్లవలె కొంత ఆర్థికంగా చేదోడు అవుతుందని భావించి వంట బాధ్యతలు నెత్తికెత్తుకున్న మహిళా సంఘాల సభ్యులకు పథకం నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. పథకం కింద వీరే సమకూర్చుకోవాల్సిన కోడిగుడ్లు, కూరగాయలు, నూనెలు, ఉప్పు, పప్పు, మసాలాలు ఇతర వంట సామగ్రి ధరలు భారీగా పెరిగిపోవడంతో నిర్వహణ కోసం ప్రభుత్వమిచ్చే బిల్లులు, వేతనాలు సరిపోక అప్పులపాలవుతున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు పెరిగిన ధరలతో వంటల నిర్వహణకు ఇబ్బందిపడుతుంటే, మరోవైపు మూడు నెలలుగా బిల్లులు కూడా ఇవ్వకపోవడంతో పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం అందించేందుకు అప్పులపాలవ్వాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు. తమ సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోతే వంట నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు.

- మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ కార్మికులకు భారంగా మారింది. ఈ పథకం కింద విద్యార్థుల భోజనానికి అవసరమైన బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది. కూరలు వండేందుకు ఒక్కో విద్యార్థికి ప్రాథమిక పాఠశాల వారికి రూ.4.47, హైస్కూల్‌ వారికి రూ.7.45 చొప్పున బిల్లులు అందిస్తారు. వారంలో మూడు రోజుల పాటు కోడు గుడ్లు అందించాలి. ఒక్కో గుడ్డుకు ప్రభుత్వం రూ.4 ఇస్తుంది. ఈ రేట్లు ఖరారు చేసినప్పుడు కూరగాయల ధరలు కిలో రూ.20 ఉంటే, వంట నూనె ధర కిలో రూ.85 ఉండేది. కోడిగుడ్ల ధర అప్పుడు రూ.4 ఉండేది. ఇప్పుడు గుడ్డు ధర రూ.5కు చేరింది. ఇతర పప్పులు, ఉప్పు, చింతపండు ధరలు సైతం రెట్టింపయ్యాయి. గ్యాస్‌ ధరలు కూడా ఊహించని రీతిలో పెరిగాయి. తాజా మార్కెట్‌ ధరలతో పోల్చుకుంటే ప్రభుత్వం ఇచ్చే ధరలతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం దుర్లభంగా మారింది. ప్రస్తుతం ఏ రకం కూరగాయలైనా కిలోకు సగటున రూ.60కి తక్కువకు లభించడం లేదని, నూనెలు కిలో రూ.190కి చేరాయని, ఈ పరిస్థితుల్లో వంట నిర్వహణ తమకు తలకు మించిన భారంగా మారిందని కార్మికులు వాపోతున్నారు.


రెట్టింపు చేయాలంటున్న కార్మికులు

విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించే ఉద్ధేశంతో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత తగ్గకుండా ఉండాలంటే తాజా ధరల మేరకు విద్యార్థులకు ఇచ్చే వంట నిర్వహణ వ్యయం పెంచాలనే డిమాండ్లు వస్తున్నాయి. కోడిగుడ్ల ధరను రూ.4 నుంచి రూ.5కు పెంచాలని కోరుతున్నారు. కూరగాయలు, ఇతర కిరాణా నిర్వహణకు ఇచ్చే బిల్లును ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు రూ.4.47 నుంచి కనీసం రూ.8కి, హైస్కూల్‌ విద్యార్థులకు రూ.7.45 నుంచి రూ.14కు పెంచాలనే డిమాండ్‌ వస్తోంది. ఈ మేరకు కార్మికులు, కార్మిక సంఘాలు ఇప్పటికే ఆందోళనలు కూడా చేస్తున్నాయి. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే త్వరలో సమ్మెకు వెళ్లేది ఖాయమని, వంట నిర్వహణ తప్పుకుంటామని ఏజెన్సీలు(మహిళా సంఘాలు) పేర్కొంటున్నాయి.


వేతనం కూడా పెంచాలి

వంటలు చేసేందుకు ప్రాథమిక పాఠశాలల్లో తక్కువ విద్యార్థులున్న చోట(50 మంది  విద్యార్థులు) ఒకరు, అంతకు మించితే ఇద్దరు, హైస్కూళ్లలో ముగ్గురు చొప్పున వంట కార్మికులు పని చేస్తున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో దాదాపు 5,240 మంది వరకు కార్మికులు పని చేస్తున్నారు. వీరికి ఒక్కొక్కరికి నెలకు రూ.1 వెయ్యి చొప్పున ప్రస్తుతం గౌరవ వేతనం ఇస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ వేతనాలను రూ.3 వేలకు పెంచాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. దినసరి కూలీలుగా, ఇళ్లలో పని చేసే కార్మికులుగా వెళ్లినా ఇంతకంటే రెట్టింపు వస్తుందని అంటున్నారు. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని వేతనాలను రూ.3 వేలకు పెంచాలని కోరుతున్నారు. 


మూడు నెలలుగా అందని బిల్లులు

నెలనెలా ఇవ్వాల్సిన పథకం బిల్లులను ప్రభుత్వం మూడు నెలలుగా పెండింగ్‌లో ఉంచింది. ఒక హైస్కూల్‌లో వంట నిర్వహించే మహిళా సంఘం సభ్యులకు నెలకు సగటున రూ.80 వేల చొప్పున బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మూడు నెలలుగా బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి, వంట చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి పెండింగ్‌ బిల్లులు ఇవ్వాలని కోరుతున్నారు. 


రేట్లు పెంచాలి 

ఇప్పుడు ధరలు ఆకాశాన్నంటుతున్నా యి. కూర గాయలు ఏది కొన్నా కిలో రూ.60కి తగ్గడం లేదు. ఐదు కిలోల నూనె మూడేళ్లలో రూ.1,500 నుంచి రూ.2,500కు పెరిగింది. కోడిగుడ్ల ధర రూ.5కు చేరింది. ఉప్పు, పసుపు, చింతపండు, కందిపప్పు ఇలా అన్ని రకాల కిరాణా వస్తువుల ధరలు పెరిగా యి. కూరలు చేసేందుకు పిల్లల సంఖ్య ప్రకారం ఇచ్చే ధర మాకేమాత్రం గిట్టు బాటు కావడం లేదు. ధరలు తక్షణం కనీసం రెండు రూపాయల చొప్పుననైనా పెంచాలి. 

- జయమ్మ, వంట కార్మికురాలు, మహబూబ్‌నగర్‌


గౌరవ వేతనం రూ.3వేలకు పెంచాలి 

బడిలో మధ్యాహ్న భోజనం వండితే మాకు నెలకు రూ. వెయ్యి గౌరవ వేతనం ఇస్తున్నారు. పెరిగిన ధరలను అర్థం చేసుకొని ఈ వేతనం కనీసం రూ.3 వేలకు పెంచాలి. ఇళ్లల్లో పని చేసినా ఒక్కో ఇంటికి నెలకు రూ.2 వేలు ఇస్తున్నారు. పరిస్థితులను గమనించి ప్రభుత్వం వేతనం పెంచాలని కోరుతున్నాం.

- నాగమ్మ, వంట కార్మికురాలు, మహబూబ్‌నగర్‌

Updated Date - 2021-12-07T04:41:19+05:30 IST