ఉద్యోగుల జీతాల ఎగవేత రాజ్యాంగ ఉల్లంఘనే : ఉత్తరాఖండ్ హైకోర్టు

ABN , First Publish Date - 2021-07-24T20:15:41+05:30 IST

ఉద్యోగుల నెలవారీ జీతాలను చెల్లించకపోవడం భారత

ఉద్యోగుల జీతాల ఎగవేత రాజ్యాంగ ఉల్లంఘనే : ఉత్తరాఖండ్ హైకోర్టు

న్యూఢిల్లీ : ఉద్యోగుల నెలవారీ జీతాలను చెల్లించకపోవడం భారత రాజ్యాంగంలోని అధికరణలు 21, 23, 300ఏలను ఉల్లంఘించడమేనని ఉత్తరాఖండ్ హైకోర్టు పేర్కొంది. ఉత్తరాఖండ్ రోడ్‌వేస్ కర్మచారి యూనియన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి, ఉత్తరాఖండ్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు ఈ విషయాన్ని గుర్తు చేసింది. ఉద్యోగులకు ప్రతి నెలా వారి న్యాయమైన జీతాల చెల్లింపును మానుకునేందుకు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అనుమతి లేదని తెలిపింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఆలోక్ కుమార్ వర్మ డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. 


ఈ ఉద్యోగులు కార్పొరేషన్‌లో అత్యున్నత స్థాయికి చెందినవారు కాదని, వీరంతా కార్మికులని, డ్రైవర్లు, కండక్లర్లు, ఇతర ఉద్యోగులని హైకోర్టు పేర్కొంది. వీరిని కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేశాయని పేర్కొంది. ఉద్యోగుల నెలవారీ జీతాలను చెల్లించకపోవడం భారత రాజ్యాంగంలోని అధికరణలు 21, 23, 300ఏలను ఉల్లంఘించడమేనని తెలిపింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కపిల హింగోరాణి వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. తన ఉద్యోగుల ప్రాథమిక హక్కులను, మానవ హక్కులను ఉల్లంఘించేందుకు రాజ్యాన్ని అనుమతించరాదని అత్యున్నత న్యాయస్థానం చెప్పిందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో తన బాధ్యతను తప్పించుకోజాలదని వివరించింది. జీతాల చెల్లింపు బాధ్యత కార్పొరేషన్‌దేనని చెప్తూ ఆకు చాటున దాక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతించరాదని తెలిపింది. 


ఉత్తరాఖండ్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ తన ఉద్యోగులకు 2021 ఫిబ్రవరి నుంచి జూన్ వరకు జీతాల బకాయిలను చెల్లించలేదు. దీంతో ఆ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. 


Updated Date - 2021-07-24T20:15:41+05:30 IST