కరోనా భయం వద్దు

ABN , First Publish Date - 2020-08-09T11:38:15+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా ప్రజలు భయపడనవసరం లేదని, సమర్ధవంతంగా నివారణ చర్యలు చేపడుతున్నట్లు ..

కరోనా భయం వద్దు

పూర్తిస్థాయిలో వైద్య సేవలు

సమర్థవంతంగా నివారణ చర్యలు

ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని


ఏలూరు సిటీ, ఆగస్టు 8: జిల్లాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా ప్రజలు భయపడనవసరం లేదని, సమర్ధవంతంగా నివారణ చర్యలు చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో కరోనా జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేం జిల్లా ఇన్‌చార్జి మంత్రి పేర్ని నాని అధ్యక్షతన శనివారం జరిగింది. ఆళ్ల నాని మాట్లాడుతూ కొవిడ్‌ నివారణ చర్యలు అత్యంత పారదర్శకంగా చేపట్టినట్లు తెలిపారు. కొవిడ్‌ బాధితుడిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఇంటికి పంపిస్తామని తెలిపారు. జిల్లాలో కరోనా కేసులు 75 శాతం రికవరీ అవుతున్నాయన్నారు. ప్రతి కొవిడ్‌ ఆస్పత్రికి జిల్లా అధికారులను నోడల్‌ అధికారులుగా నియమించామన్నారు. కొవిడ్‌ను సమర్ధవంతంగా నియంత్రించేందుకు జిల్లాకు రూ.19 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇప్పటికే రూ.14.4కోట్లు 4ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు. జిల్లాలో కొవిడ్‌ ఆప్పత్రులలో బెడ్స్‌ సంఖ్య మరింత పెంచేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుందని, మరో మూడు రోజుల్లో మరి కొంతమంది సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలిపారు.


ఆక్సిజన్‌ లైన్‌బెడ్స్‌ పెంచడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొవిడ్‌ వైద్య సేవలందించడానికి ప్రైవేటు ఆస్పత్రులు కూడా ముందుకు రావాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రులలో ఎక్కువ మొత్తం ఫీజు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రతి ఆదివారం జిల్లాలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందన్నారు. కొవిడ్‌ బాధితుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను వెంటనే గుర్తించి వారికి కూడా పరీక్షలు నిర్వహించాలని మంత్రి తానేటి వనిత సూచించారు.


ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో సిబ్బంది కూడా కొవిడ్‌ బారిన పడుతున్నారని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆమె కోరారు. మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడారు. జిల్లాలో కొవిడ్‌ నివారణ చర్యలను పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు వివరించారు. సమావేశంలో ఏపి మెడికల్‌ కౌన్సిల్‌ బోర్డు డైరక్టర్‌ శివారెడ్డి, ఎస్పీ నారాయణ నాయక్‌, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, జిల్లాలోని ఎమ్మెల్యేలు, జేసీలు కె.వెంకటరమణారెడ్డి, హిమాన్షు శుక్లా, నండూరి తేజ్‌ భరత్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 


నేడు జిల్లాలో లాక్‌డౌన్ ఐటీడీఏ పరిధిలోని మండలాలకు మినహాయింపు

ఏలూరుసిటీ, ఆగస్టు 8: జిల్లాలో ఆదివారం ఉదయం 6గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు 24 గంటల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమయంలో మెడికల్‌ షాపులు, నిత్యావసర వస్తువులకు మాత్రమే అనుమతి మంజూరు చేశామని ఆయన తెలిపారు. మిగిలిన కార్యకలాపాలు అన్నింటినీ నిషేఽధించామన్నారు. కావున ప్రజలు ఈ నిబంధనలకు లోబడి ప్రభుత్వ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఆదివారం గిరిజన దినోత్సవం ఉన్నందున కుక్కునూరు డివిజన్‌లోని ఐటీడీఏ పరిధిలోని ఐదు మండలాల్లో లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-08-09T11:38:15+05:30 IST