వారసులొస్తున్నారు..!

ABN , First Publish Date - 2021-11-01T05:02:15+05:30 IST

మదనపల్లె మండలం బసినికొండలోని అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ భూ విక్రయంపై టి.ఎన్‌.రఘునాథరెడ్డి కుటుంబీకులు ఆరా తీస్తున్నారు.

వారసులొస్తున్నారు..!
అమ్మకం జరిగిన అగ్గిపెట్టెల ఫ్యాక్టరి భూమి

దానం భూమి అమ్మకంపై టి.ఎన్‌.కుటుంబం ఆరా

క్రయవిక్రయదారులపై చర్యలకు సన్నాహాలు


మదనపల్లె, అక్టోబరు 31: మదనపల్లె మండలం బసినికొండలోని అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ భూ విక్రయంపై టి.ఎన్‌.రఘునాథరెడ్డి కుటుంబీకులు ఆరా తీస్తున్నారు.  రఘునాథరెడ్డికి కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. వీరంతా అమెరికాలో వైద్యవృత్తిలో స్థిరపడ్డారు. మదనపల్లె, తంబళ్లపల్లెలోని ఆస్తులను స్థానికంగా నియమించిన మేనేజర్‌ ద్వారా చిన్న కుమార్తె పర్యవేక్షిస్తుంటారు. ఇదిలా ఉండగా, ఆమె తండ్రి రఘునాథరెడ్డి.. బసినికొండలో అగ్గిపెట్టెల ఫ్యాక్టరీకి, అందులోని కార్మికుల కోసం 1956లో 2.87 ఎకరాలను 1982లో దానంగా ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్‌ కాంప్లెక్స్‌ వర్కర్స్‌ డెవల్‌పమెంట్‌ అసోసియేషన్‌ తరపున తొమ్మిదిమంది కార్మికులు, ఇతరులకు  విక్రయాలు చేపట్టారు. దీనిపై ‘అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ భూమిని అమ్మేశారు’ శీర్షికన గత నెల 29న ఆంధ్రజ్యోతిలో కథనం వెలువడింది. ఈ విషయం తెలుసుకున్న భూ దాత టి.ఎన్‌.రఘునాథరెడ్డి వారసులు రంగంలోకి దిగారు. భూ విక్రయాలపై ఆరా తీస్తున్నారు. క్రయ, విక్రయదారులపై చర్యలకు సిద్ధమవుతూ, న్యాయపరమైన చర్యలతో భూ స్వాధీనానికి సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 

కాగా, అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ, అందులోని కార్మికులకే కాకుండా ఎందరో వ్యక్తులకు, మరెన్నో సంస్థలకు భూములను టీఎన్‌ రఘునాథరెడ్డి దానంగా ఇచ్చారు. మదనపల్లెలో విద్యాభివృద్ధికి కృషి చేశారు.  కార్య విద్యాలయం మోరీస్‌ ప్రైమరీ స్కూల్‌ ఉరఫ్‌ భారతనందిని పేరుతో సొసైటీని ఏర్పాటు చేయగా, అనంతరం అది మూతపడింది. తాను దానంగా ఇచ్చిన భూమిని అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ పనులకు మాత్రమే వాడుకోవాలని, లేకుంటే, కార్య విద్యాలయానికే అప్పగించాలని రిజిస్ర్టేషన్‌ దాన దస్తావేజులో పేర్కొన్నారు. అంతకుముందే ఇదే భూమిపై కార్మికులుగా చెబుతున్న మరికొందరు ఆర్థిక లావాదేవీలు నడిపినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ భూమిని తాకట్టు పెట్టడం, లీజుకు ఇవ్వడం, అద్దెకు ఇవ్వడం, భాగ పరిష్కారాలు తదితరాలతో రిజిస్ర్టేషన్లు చేయగా, తాజాగా కార్మికులు అమ్మేశారు. ఈ భూమిని కొనుగోలు చేయడంలో నలుగురు రాజకీయ నాయకులు, రియల్టర్లు ఉన్నారు.


ఇంకా ఎన్నెన్నో..!


ఫ  ఈ విక్రయాలు ఓ ఎత్తయితే, తామేమీ తక్కువ తిన్నామా అన్నట్లు స్థానికంగా ప్రైవేటు పాఠశాల నడుపుతున్న ఓ వ్యక్తి మొత్తం భూమినే పాఠశాలకు ఆటస్థలంగా మార్చేశారు. ఓ వ్యక్తి నుంచి ఆ భూమిని ఐదేళ్లకు లీజుకు తీసుకున్నట్లు రికార్డులు సృష్టించారు. ఇదే తరహాలో అదే భూమిని ఇద్దరు వ్యక్తుల నుంచి పేర్లు మార్చి రెండు సార్లు లీజు డీడ్‌ రాయించుకున్నారు.

ఫ బసినికొండ సర్వే నెం.679లో మొత్తం 4.42 ఎకరాలు ఉండగా, సబ్‌డివిజన్‌ అనంతరం 679-ఏలో 1.55 ఎకరాలు, 679-బిలో 2.87 ఎకరాలుగా కేటాయించారు. అయితే పాఠశాలకు లీజుకు తీసుకునే క్రమంలో అసలు భూమే లేని పేరన్‌ సర్వే నెం.679ని వేసి రిజిస్ర్టేషన్‌ చేశారు.

ఫ గొర్ల గోపాల్‌రెడ్డికి తనకు పిత్రార్జితంగా వచ్చిన రెండెకరాల భూమిని శాంతి నికేతన్‌స్కూల్‌కు ఐదేళ్లు లీజుకు ఇచ్చినట్లు 2016, ఫిబ్రవరి 27న, డాక్యుమెంట్‌ నెం.1250 కింద లీజు డీడ్‌ రిజిస్ర్టేషన్‌ చేయించి, తర్వాత ఏడాదిలో 2017 జూన్‌ 6న రద్దు చేసుకున్నారు. అనంతరం ఇదే తరహాలో అదే భూమిని, అంతే విస్తీర్ణాన్ని, మరోసారి అదే పాఠశాలకు లీజుకు తీసుకున్నారు. ఇక్కడ గొర్ల గోపాల్‌రెడ్డి స్థానంలో భూ యజమాని బోయపాటి రామన్న తెర మీదకు వచ్చారు. ఈక్రమంలో 2020, అక్టోబరు 3న డాక్యుమెంట్‌ నెం.7561, ఐదేళ్ల లీజు డీడ్‌ కింద రిజిస్ర్టేషన్‌ చేయించారు. ఈ రెండు సర్వే నెంబర్లలో దేనికీ సంబంధ లేని వ్యక్తులను యజమానులుగా తీసుకొచ్చి ఓ డాక్యుమెంట్‌ రైటర్‌ రికార్డు సృష్టించారు. భూమి ప్రభుత్వానిదైనా, ప్రైవేటు వ్యక్తులదైనా, సంస్థలదైనా డాక్యుమెంట్‌  రైటర్లు సూత్రధారులుగా, దళారులు పాత్రధారులుగా ఉంటున్నారన్నది స్పష్టమవుతోంది. ఇందుకు సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయ అధికారులు సహకారం అందిస్తున్నారనేది సుస్పష్టం.


Updated Date - 2021-11-01T05:02:15+05:30 IST