జీవితపు ఎడారిలో..

Published: Wed, 24 Feb 2021 07:12:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జీవితపు ఎడారిలో..

తోబుట్టువులు, అన్నదమ్ముల జీవితాలలో వెలుగులు నింపడం కోసం ఎడారి ప్రవాసానికి వచ్చే అనేక మంది చివరకు కుటుంబ జీవితాలకు, ఆప్యాయతలకు దూరమవుతున్నారు. ఈ కారణంగా మానసిక ఒత్తిళ్ళకు గురవుతూ అనారోగ్యం పాలవుతున్న ప్రవాసులు ఎందరో ఉన్నారు. అహర్నిశలు కష్టపడి పైసకు పైసా జతచేసి కుటుంబాలకు పంపితే కష్టం తెలియని కుటుంబాలు డబ్బుతో మాత్రమే తమకు పని అని, మనిషితో కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. యవ్వనంలోకి అడుగుపెట్టిన తొలినాళ్ళలోనే ఎడారులకు చేరుకుని అరబ్బుల పెత్తనంపై పోరాడి గెలిచినప్పటికీ ఇంట్లో అన్నదమ్ములతో ఓడిపోయి చివరకు రిక్తహస్తాలతో, నిరాశా నిస్పృహలతో కొట్టామిట్టాడుతున్నారు. 


అనారోగ్యంతో మరణించిన తండ్రి, అడుగడుగున ఉన్న అప్పులు, పట్టించుకోని బంధువులు. అరకొరగా కూలీ చేసి సంపాదించే అన్నకు తోడుగా కుటుంబానికి చేయూతనిచ్చేందుకు వచ్చిన నెల్లూరు జిల్లా యువకుడు ఒకరు తన ఆప్తుల కోసం సర్వం త్యాగం చేశాడు. యజమాని కాఠిన్యాన్ని భరిస్తూ ఆకలితో గడిపాడు. అలా ఎంతో కష్టపడి సంపాదించిందంతా ఆ యువకుడు అన్నకు పంపగా, అతడు తన పిల్లల పెళ్ళిళ్లు చేశాడు, చదువులు చెప్పించాడు. తమ్ముడు పంపిన డబ్బుతో తన పేర ఆస్తులను కొను గోలు చేసిన ఆ అన్న ఇప్పుడు మొత్తం తనదేనంటున్నాడు. అన్యాయం జరిగితే న్యాయస్థానానికి వెళ్ళి కేసు వేసుకోమంటున్నాడు. 


ఏళ్లకు ఏళ్ళు కష్టపడి, స్వదేశానికి తిరిగి వెళ్ళిన తమ్ముడు తనకు జరిగిన మోసం గురించి బంధుమిత్రులతో చెప్పి బోరుమన్నాడు. చేసేది లేక పాత మిత్రుల సహాయంతో వీసా పొంది మళ్ళీ గల్ఫ్‌కు తిరిగి వచ్చాడు కానీ అనారోగ్యం వల్ల సక్రమంగా ఉద్యోగం చేయలేకపోతు న్నాడు. అలాగని ఆర్థిక కారణాలతో స్వదేశానికి వెళ్ళడానికీ వెనుకంజ వేస్తున్నాడు, షుగర్ వ్యాధితో కళ్ళు సరిగ్గా కనిపించకపోయినా తన పిల్లల కోసం ఏడ్చుకొంటూ పని చేస్తు న్నాడు, ఇక్కడి నుంచి అతడు పంపే డబ్బు కొరకు భార్య, పిల్లలు ప్రతి నెలా ఆతృతగా ఎదురు చూస్తుంటారు. 


మెదక్ జిల్లాకు చెందిన మరో యువకుడికి ఏడుగురు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. టైలరింగ్ పని చేసే తండ్రి అనారోగ్యంతో మంచం పాలవగా అప్పులు పెనుభారంగా మారాయి. కుటుంబం గడిచీ గడవక నెట్టుకొచ్చేది. దానికి తోడు పెళ్ళికి ఎదుగుతున్న చెల్లెళ్లు, తమ్ముళ్ళ చదువు ఎలాగా అనుకుంటూ అందరికంటే పెద్దవాడయిన అన్న డిగ్రీ చదువును వదిలిపెట్టి అప్పులు చేసి ఎడారి విమానమెక్కాడు. కంపెనీ వీసా అంటూ మోసపోయి అరబ్బు చేతికి చిక్కాడు. తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి వరకు సెలవు, పండుగ, పబ్బం లేకుండా యాంత్రికంగా పని చేసినా ఒక్క నయా పైసా అందలేదు, పైగా యాజమాని చేతిలో దెబ్బలు తిన్నాడు, గత్యంతరం లేని పరిస్థితులలో పారిపోయి ఎడారిలో ఆకలితో కొన్ని రోజులు నడుచుకుంటూ రోడ్డుపైకి చేరుకుంటే అక్కడ ఒక పాకిస్థానీ డ్రైవర్ అతడి పరిస్థితికి జాలిపడి ధైర్యం చేసి తన ట్రక్కులో దొంగచాటుగా దాచి వేయి కిలోమీటర్ల దూరంలోని రియాద్ నగర పొలిమేరకు తీసుకువచ్చి ఒక హోటల్ వద్ద వదిలి పెట్టాడు. 


ఎటు వెళ్ళాలో తెలియక ఆ హోటల్లో గిన్నెలు కడగడంతో కొత్త జీవితం ప్రారంభించాడు. అక్కడి నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆ యువకుడు అంచెలంచెలుగా ఎదిగి తోబుట్టువులు, సహోదరులు అందర్నీ ఆదుకుని ప్రయోజకుల్ని చేశాడు. చెల్లెళ్ల వివాహాలను ఘనంగా జరిపించాడు. సంపాదించిన ప్రతి నయా పైసా ఇంటికి పంపించాడు. లక్షలలో సంపాదించినా కనీసం బ్యాంకు ఖాతా కూడ తెరుచుకోలేదు. అన్న గల్ఫ్‌కు వెళ్ళేవరకు అన్నం కోసం తిప్పలు పడ్డ ఆ కుటుంబం గతాన్ని మరిచిపోయింది. కాపురానికి వచ్చిన భార్య భర్త కష్టార్జితం రాళ్ళపాలవుతోందని గ్రహించే సరికి కుటుంబ కలహాలు పెరిగాయి. సంపాదించిన ఆస్తులను తమ్ముళ్ళు, బావలు గుంజుకున్నారు. జీవితంలో ఎక్కువకాలం విదేశాలలో గడపడంతో తోబుట్టులను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడు. 


ఇంటింటి కుటుంబ సర్వే సందర్భంగా కనీసం ఇంట్లోకి అతడి పిల్లలను కూడ రానివ్వలేదు. ఎవరి కోసం తాను రేయింబవళ్ళు కష్టపడ్డాడో వాళ్లే పరాయివారు కావడాన్ని తట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం క్షీణించింది. పని చేసేందుకు ఓపిక లేకపోయినా తన పిల్లల కోసం కష్టపడ్డాడు. చివరకు అతడు ప్రవాసంలోనే అనారోగ్యంతో కన్నుమూయగా స్వదేశంలో అతడి పిల్లలు, భార్య అతికష్టంగా బతుకీడుస్తున్నారు. భార్య పగటిపూట ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా, రాత్రి పూట ఇంట్లో బట్టలు కుడుతుండగా ఆమె భర్త సంపాదనతో ఎదిగిన వారందరు హాయిగా ఉన్నారు. ఈ రకంగా కుటుంబ బాధ్యతలతో చిన్న వయస్సులో ఎడారులకు వచ్చి చివరకు తమ జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకున్న తెలుగు ప్రవాసులు అసంఖ్యాకంగా ఉన్నారు. వారి మనోవేదన అర్థం చేసుకోగల వారెవ్వరు? 


మొహమ్మద్ ఇర్ఫాన్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.