తీరని వెతలు

ABN , First Publish Date - 2022-09-30T05:11:00+05:30 IST

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్‌ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో ఎక్కడి సమస్యలు అక్కడే మూలుగుతున్నాయి. ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా భూనిర్వాసిత కాలనీ పరిస్థితి తయారైంది. సమస్యలను తీర్చాలంటూ భూనిర్వాసితులు తొగుట తహసీల్దారు కార్యాలయం, గజ్వేల్‌, సిద్దిపేట ఆర్డీవో కార్యాలయాలు, సిద్దిపేట కలెక్టరేట్‌, మంత్రి క్యాంపు కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినప్పటికీ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు.

తీరని వెతలు
గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోని పునరావాస కాలనీ

మల్లన్నసాగర్‌ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో ఎక్కడి సమస్యలు అక్కడే

ఎవరైనా మరణిస్తే ఖననం చేయడానికి చోటు లేదు

చెత్తను వేయడానికి అందుబాటులో లేని డంపింగ్‌యార్డు 

ముంపు బాధితులకు ఇంకా పూర్తిస్థాయిలో అందని నష్టపరిహారం, ప్యాకేజీ


గజ్వేల్‌, సెప్టెంబరు 29: గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్‌ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో ఎక్కడి సమస్యలు అక్కడే మూలుగుతున్నాయి. ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా భూనిర్వాసిత కాలనీ పరిస్థితి తయారైంది. సమస్యలను తీర్చాలంటూ భూనిర్వాసితులు తొగుట తహసీల్దారు కార్యాలయం, గజ్వేల్‌, సిద్దిపేట ఆర్డీవో కార్యాలయాలు, సిద్దిపేట కలెక్టరేట్‌, మంత్రి క్యాంపు కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినప్పటికీ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. 


ఏడాది క్రితం పునరావాస కాలనీకి

సిద్దిపేట జిల్లాలోని తొగుట, కొండపాక మండలాల్లోని వేములఘాట్‌, ఏటిగడ్డ కిష్టాపూర్‌, పల్లెపహాడ్‌, ఎర్రవల్లి, సింగారం, బ్రాహ్మణ బంజేరుపల్లి, లక్ష్మాపూర్‌, రాంపూర్‌ గ్రామాల ప్రజలు గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్‌, ముట్రాజ్‌పల్లి గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసిన పునరావాస కాలనీకి ఏడాది క్రితం తరలివచ్చారు. వారి సమస్యలు మాత్రం తీరడం లేదు. భూనిర్వాసిత కాలనీలో పూర్తిస్థాయి పనులు చేపట్టకపోవడం, చేసిన పనుల్లో నాణ్యత లోపించడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వర్షం వస్తే గోడలు పూర్తిగా నీరుపట్టడం, పూర్తిస్థాయిలో మురుగునీటి కాలువలు, రోడ్లు ఏర్పాటు కాకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. గ్రామంలోని ఒక్క ఏటిగడ్డ కిష్టాపూర్‌ పాఠశాలలో 400మంది విద్యార్థులుంటే కేవలం నలుగురు మాత్రమే ఉపాధ్యాయులున్నారు. ముంపు గ్రామాల్లో 14 పాఠశాలల్లో 56మంది ఉపాధ్యాయులు గతంలో పనిచేస్తుండగా, ప్రస్తుతం కేవలం మూడు పాఠశాలలను మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిల్లో 29 మంది ఉపాధ్యాయులను నియమించింది. వారిలో 16 మంది మాత్రమే విధులకు వస్తుండగా, 13 మంది కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. కాగా కోర్టుకు వెళ్లిన ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో తమను ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి బదిలీ చేయాలని కోరుతున్నారు. 


ఇక గ్రామాల్లో శ్మశాన వాటికలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బ్రాహ్మణ బంజేరుపల్లికి చెందిన ముస్లిం మహిళ మృతిచెందితే గ్రామ సర్పంచ్‌ సంగాపూర్‌ గ్రామస్థులతో మాట్లాడి మృతదేహాన్ని ఖననం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గ్రామాల్లో సేకరించిన చెత్తను వేయడానికి డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయలేదు. ఇక ప్యాకేజీలు, పరిహారం విషయానికి వస్తే దాదాపుగా వంద కోట్లకుపైగా భూనిర్వాసితులకు ప్రభుత్వం నుంచి అందాల్సి ఉంది. ట్యాంకుల నిర్మాణం సాగుతుండగా, గ్రామాల్లో ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని గ్రామస్థులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఇటీవలే ఏటిగడ్డ కిష్టాపూర్‌ గ్రామ సర్పంచ్‌ దామరంచ ప్రతాప్‌రెడ్డి, ఎర్రవల్లి ఉపసర్పంచ్‌ మంత్రి హరీశ్‌రావును కలసి తమ సమస్యలు విన్నవించుకోగా, త్వరలోనే పరిష్కారం చేస్తానని మంత్రి హమీ ఇచ్చినట్లు తెలిసింది.

Updated Date - 2022-09-30T05:11:00+05:30 IST