తీరని కష్టం

ABN , First Publish Date - 2021-11-24T07:55:20+05:30 IST

మరో మూడు రోజులకు మళ్లీ వానలు ముంచెత్తుతాయన్న హెచ్చరిక చిత్తూరు జిల్లా ప్రజలను భయకంపితులను చేస్తోంది.

తీరని కష్టం
రాయలచెరువు సమీప గ్రామాల ఏరియల్‌ వ్యూ

హడావుడి ఎక్కువ, సాయం తక్కువ 


చిత్తూరు, ఆంధ్రజ్యోతి: అధినేత ఆకాశయాత్ర చేసి వెళ్లిపోయాడు. అయిదు రోజుల తర్వాత నాయకులు హడావుడి చేస్తున్నారు. పడవల్లో తిరుగుతున్నారు. సాయం అందిస్తూ హెలికాప్టర్‌లో ఎగురుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటన ప్రకటనతో సకల అధికారపార్టీ గణం కదిలి వచ్చింది. మరోవైపు ఇతర అన్ని పార్టీల నాయకులూ బాధితులను పరామర్శిస్తున్నారు. అయ్యో అంటున్నారు. అయినా ఆరవ రోజుకి కూడా వరద కష్టం తీరలేదు. గురువారం నాడు కుండపోత  సృష్టించిన విలయం నుంచి జిల్లా ఇంకా తేరుకోనేలేదు. ఇప్పటికీ వేల ఇళ్లు ముంపులోనే ఉన్నాయి. వందలాది గ్రామాలకు దారుల్లేవు. ఇళ్లు కూలిపోయాయి. పంటలు దెబ్బతిన్నాయి. చెరువులు తెగిపోయాయి. నిండుకుండల్లా ఉన్న చెరువులు అనేకం ప్రమాదకరస్థితిలో ఉన్నాయి. మరో మూడు రోజులకు మళ్లీ వానలు ముంచెత్తుతాయనే హెచ్చరిక జిల్లా ప్రజలను భయకంపితులను చేస్తోంది.


ఇంక వచ్చెయ్‌..నాన్నా!

‘ఐదు నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తానన్నారు. ఆరు రోజులైనా రాలేదు. అయినా, మా నాన్నకి ఏమీ కాదు. కొట్టుకుపోయిన ఆయన ఎక్కడో ఉండే ఉంటారు. ఈరోజు కాకపోతే రేపు.. లేదా ఎల్లుండైనా ఆయన తప్పకుండా తిరిగి వస్తారు. ఇంక వచ్చెయ్యి నాన్నా..!’ అంటూ ఆరు రోజులుగా కన్నీరు మున్నీరవుతూనే ఉన్నారు తిరుపతి లక్ష్మీపురం సర్కిల్‌ మ్యాన్‌హోల్‌లో గల్లంతైన ల్యాంకో ఉద్యోగి సుబ్బారావు పిల్లలు సాయిసతీష్‌, అపర్ణ. అమ్మ గాయత్రికి ధైర్యం చెబుతూనే దుఃఖంలో మునిగిపోతున్నారు. 


మృతులు 8 మంది 

వరదల కారణంగా జిల్లాలో 8 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఐదుగురు మరణించగా.. మరో ముగ్గురు గల్లంతై పోయారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. బంగారుపాళ్యం మండలంలోని టేకుమంద గ్రామానికి చెందిన నలుగురు మహిళలు 18వ తేదీ బలిజపల్లె సీమపంలోని కామాక్షమ్మ చెరువు మొరవ ప్రవాహంలో గల్లంతయ్యారు. వీరిలో జయంతమ్మ (45) మృతదేహం ఓ రోజు తర్వాత లభ్యమవ్వగా, లక్ష్మీదేవి (45) మృత దేహం మంగ ళవారం బయ టపడింది. కస్తూరి (44), ఉషారాణి (35), మృతదేహాల ఆచూకీ లేదు. తిరుపతిలోని సుందరయ్యనగర్‌లో స్విమ్స్‌ డాక్టర్‌ రిషిగౌతమ్‌ (29) విద్యుత్‌ షాక్‌తో 18వ తేదీ రాత్రి మరణించారు. లక్ష్మీపురం సర్కిల్‌లో సుబ్బారావు అనే ల్యాంకో ఉద్యోగి 18న రాత్రి కాలువలో పడి గల్లంతయ్యారు. చిత్తూరు మండలంలోని పెరుమాళ్ళకండ్రిగ గ్రామా నికి చెందిన మేకల కాపరి సుబ్బయ్య (75) వంకలో కొట్టుపోయారు. పెద్దమండ్యం మండలంలోని బండకింద తండాలో గోడకూలి బోజీలమ్మ (75) మృతి చెందింది.


5 రోజులుగా నీళ్లలోనే 2వేల గృహాలు 

మొత్తం 2654 ఇళ్లు వరద ముంపునకు గురయ్యాయి. ఇందులో రెండు వేల ఇళ్లు 5 రోజులుగా ముంపులోనే ఉండిపోయాయి. 563 ఇళ్లు దెబ్బతిన్నాయి. మొత్తంగా ఇళ్లకు రూ.37.14 కోట్ల నష్టం వాటిల్లింది. తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్ల సంఖ్య అధికంగా ఉంది.


 300 గ్రామాలకు రాకపోకలు లేవు

 ఇప్పటికీ 300 గ్రామాలకుపైగా రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  దెబ్బ తిన్న ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రహదారులకు సుమారు రూ.304 కోట్ల అవసరమని ఆయా శాఖల అధికారుల అంచనా. ఆర్‌అండ్‌బీ పరిధిలో 295 కిలోమీటర్ల మేర 161 ప్రాంతాల్లో రోడ్లు దెబ్బ తిన్నాయి. 47 బ్రిడ్జిలు, 50 కల్వర్టులు కొట్టుకుపోయాయి. ఆర్‌అండ్‌బీ పరిధిలో తలెత్తిన నష్టాన్ని తాత్కాలికంగా పూడ్చేందుకు రూ.28.66 కోట్లు, శాశ్వత పనులకు రూ.256.86 కోట్లు అవసరమని అధికారులు భావిస్తున్నారు.  పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని సీసీ, బీటీ, గ్రావెల్‌ రోడ్లు 116 రోడ్లు, 277 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. పాక్షిక మరమ్మతులకు రూ.2.58 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.15.85 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు.


ఈ మార్గాల్లో రాకపోకలు కట్‌

సదుం మండలంలో గార్గేయ నదిపై రోడ్డు కొట్టుకుపోయింది. నాగలాపురం టీపీకోట రోడ్డు 13 కిలోమీటర్ల వరకు కొట్టుకుపోయింది. నందనం గ్రామం మొరవ కాలువలో వర్షపు నీరు పూర్తిగా నిండిపోవడంతో ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. పలమనేరు పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలోని దండపల్లె రోడ్డులో కౌండిన్య నదికి నిర్మించిన చిన్నపాటి వంతెన కొట్టుకుపోయింది. దీంతో పలమనేరు నుంచి 30 గ్రామాల ప్రజలకు దారి లేకుండా పోయింది.  సోమల నుంచి కలికిరి, నంజంపేట, పెద్దఉప్పరపల్లె మార్గాల్లో.. సదుం నుంచి పుంగనూరు, కలికిరి, పీలేరు మార్గాల్లో రాకపోకలు ఆగిపోయాయి. 


25 వేల ఎకరాల్లో పంట నష్టం

జిల్లాలో ఇప్పటి వరకు 25 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. 722 గ్రామాల్లోని 25,106 ఎకరాల్లో వరితో పాటు మరిన్ని పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా 22,287 ఎకరాల్లో వరి పంట దెబ్బతినగా, రైతులకు రూ.66.86 కోట్లు నష్టం వాటిల్లింది. వేరుశనగ 436.35 ఎకరాలు, మొక్కజొన్న 1168 ఎకరాలు, రాగి 349 ఎకరాలు, చెరకు 752 ఎకరాలు, మరో 112 ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నాయి.


నగర, పుర పాలికల్లో రూ.232 కోట్ల నష్టం

తిరుపతి, చిత్తూరు నగరపాలక సంస్థలతో పాటు పురపాలక సంస్థల్లో సుమారు 136 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయి. 75 కిలోమీటర్ల మేర ఓపెన్‌ డ్రెయిన్స్‌, యూడీఎస్‌ దెబ్బతిన్నాయి. 41 కిలోమీటర్ల మంచినీటి పైపులైన్లు, 252 వీధి లైట్లు, 14 పాఠశాలలు, కమ్యూనిటీ సెంటర్ల భవనాలు దెబ్బతిన్నాయి. మొత్తం మున్సిపల్‌ ప్రాంతాల్లో రూ.232 కోట్ల నష్టం వాటిల్లింది.


దెబ్బతిన్న కాలువలు, చెరువులకు రూ.134.50 కోట్లు

జిల్లాలో మొత్తం 215 చోట్ల కాలువలు, చెరువులు దెబ్బతిన్నాయి. వాటి శాశ్వత మరమ్మతులకు రూ.134.50 కోట్లు అవసరమని అధికారుల అంచనా. పుంగనూరులోని రాయలచెరువుకు గండి పడింది. రామసముద్రంలోని గుంతలపేట, ఎ.కొత్తూరు చెరువులు, కమ్మవానికుంట, గోటు వంకలు తెగిపోయాయి. పీలేరు మండలంలో నాలుగు చెరువు కట్టలు తెగిపోయాయి.



Updated Date - 2021-11-24T07:55:20+05:30 IST