గాలివాన బీభత్సం

ABN , First Publish Date - 2021-04-23T05:22:51+05:30 IST

పులివెందుల, పుల్లంపేట ప్రాంతంలో బుధవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు, వర్షానికి అరటి రైతుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. దాదాపు 550ఎకరాల్లో అరటి, 45 ఎకరాల్లో బొప్పాయి దెబ్బతిన్నాయి. దాదాపు రూ.6కోట్ల మేర పంటనష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. పులివెందుల ప్రాంతంలో ప్రతి వేసవిలోను అరటి రైతులను అకాల వర్షాలు, ఈదురుగాలులు కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి.

గాలివాన బీభత్సం
పులివెందుల మండలం బొగ్గుడుపల్లెలో నేలకొరిగిన అరటి తోట

నేలమట్టమైన 550ఎకరాల అరటితోటలు

45 ఎకరాల్లో బొప్పాయి తోటలు ధ్వంసం

నేలరాలిన మామిడి

వడగండ్లవానతో వరికి దెబ్బ


జిల్లాలో బుధవారం రాత్రి వీచిన ఈదురుగాలులు, గురువారం కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పులివెందుల, పుల్లంపేట ప్రాంతంలో సుమారు 45 ఎకరాల్లో బొప్పాయి, 550 ఎకరాల్లో అరటితోటలు నేలమట్టమయ్యాయి. రెండుమూడువారాల్లో కోతకొచ్చే దశలో ఉన్న ఇవి నేలకొరగడంతో రైతులు దాదాపు రూ.6 కోట్లమేర నష్టపోయారు.  జమ్మలమడుగు ప్రాంతంలో ఈదురుగాలులకు వరిపైరు నేలకొరిగింది. అట్లూరు మండంలో వడగండ్ల వానతో కోతదశలో ఉన్న వరిపైరులో ధాన్యం రాలిపోయింది. వీరబల్లి మండలంలో మామిడికి తీవ్ర నష్టం వాటిల్లింది. అకాల వర్షం, ఈదురుగాలులలో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


అరటి నేలమట్టం 

రూ.6 కోట్ల మేర ఆస్తినష్టం 

పులివెందుల/పుల్లంపేట, ఏప్రిల్‌ 22: పులివెందుల, పుల్లంపేట ప్రాంతంలో బుధవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు, వర్షానికి అరటి రైతుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. దాదాపు 550ఎకరాల్లో అరటి, 45 ఎకరాల్లో బొప్పాయి దెబ్బతిన్నాయి. దాదాపు రూ.6కోట్ల మేర పంటనష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. పులివెందుల ప్రాంతంలో ప్రతి వేసవిలోను అరటి రైతులను అకాల వర్షాలు, ఈదురుగాలులు కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఈ ఏడాది కూడా బుధవారం రాత్రి వీచిన ఈదురుగాలులు, వర్షానికి దాదాపు 500 ఎకరాల్లో అరటి పంట నేలమట్టమైంది. అలాగే 45 ఎకరాల్లో బొప్పాయిపంట దెబ్బతినింది. దాదాపు రూ.5.50 కోట్ల మేర రైతులకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. లింగాల, పులివెందుల, వేముల, వేంపల్లె తదితర మండలాల్లో ఈదురుగాలుల దెబ్బకు పంటలు నేలకొరిగాయి. అలాగే పుల్లంపేట మండలంలో గురువారం మధ్యాహ్నం వీచిన పెనుగాలులకు అనంతసముద్రం, అనంతయ్యగారిపల్లె, రామసముద్రం, పీవీజీ పల్లె పంచాయతీల్లో అరటిపంట దెబ్బతింది. సుమారు 30మంది రైతులు సాగు చేసిన 50ఎకరాల్లో అరటిపంట నేలవాలింది. రైతులకు సుమారు రూ.50లక్షల నష్టం జరిగింది. ఉద్యానవన శాఖాధికారి హరినాథరెడ్డి రైతులతో మాట్లాడి పంటనష్టం అంచనా వేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని లేదంటే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు కోరుతున్నారు.


నేలకొరిగిన వరి పంట

జమ్మలమడుగు రూరల్‌, ఏప్రిల్‌ 22: జమ్మలమడుగులో బుధవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి 10 గంటల వరకు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం తో వరి పంట నేలకొరిగింది. పది రోజుల్లో వరిపంట కోత కోయాల్సి ఉన్న సమయంలో పెద్ద ఎత్తున వీచిన గాలులతో నష్టం జరిగింది. గురువారం ఉదయం జమ్మలమడుగు మండలంలోని ధర్మాపురం గ్రామంలో రైతు శ్రీనివాసరెడ్డి, పుల్లారెడ్డి, తదితరులు  నేలకొరిగిన వరిపంటను చూసి ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది భారీ వర్షాలతో వరి రైతులందరూ తీవ్రంగా నష్టపోయామని ఈసారైనా గట్టెక్కవచ్చని ఆశాజనకంగా ఉన్న సమయంలో ఈదురుగాలులు వీచి పంట నష్టం జరిగిందని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని నష్టపోయిన రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 


కామసముద్రంలో వడగళ్లవాన

అట్లూరు, ఏప్రిల్‌22: మండల పరిధిలోని కామసముద్రం గ్రామంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వడగళ్లవానకు వరి చేలు ధ్వంసమయ్యాయి. ఈదుర గాలులకు చేతికి వచ్చిన వరిపంట గింజలు పూర్తిగా రాలిపోయాయి. వరికోతకు వచ్చిన సమయంలో పంటకు నష్టం వాటిల్లడంతో  రైతులు ఆందోళన చెందుతున్నారు.


మామిడి రైతులకు అపార నష్టం

వీరబల్లి, ఏప్రిల్‌ 22: మండలంలో గురువారం మధ్యాహ్నం గాలివాన బీభత్సానికి అరకొర ఉన్న మామిడికాయలు నేలరాలి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వీరబల్లి మండలంలో మామిడితోటలు విస్తారంగా సాగులో ఉన్నాయి. వాతావరణంలో మార్పులతో ఈ ఏడాది దిగుబడి తగ్గింది. ప్రస్తుతం గాలివానతో చెట్లలో ఉన్న కాసిన్ని కాయలు కూడా రాలిపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓదివీడు, వంగిమళ్ల, సానిపాయి గ్రామాల్లో వడగండ ్లతో కూడిన వర్షం కురిసింది.

Updated Date - 2021-04-23T05:22:51+05:30 IST