ధ్వంసమవుతున్న భారత ధర్మం

Published: Fri, 22 Apr 2022 04:27:45 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ధ్వంసమవుతున్న భారత ధర్మం

‘అల్పసంఖ్యాక వర్గం వారి ఆగడాలకు మీరు బాధితులని, మిమ్ములను సంరక్షించగలిగేది నేను మాత్రమేనని అధిక సంఖ్యాక వర్గం వారిని మీరు నమ్మించగలిగితే ప్రజాస్వామిక సమాజంలో మీరు ఏ ఉన్నత స్థాయికి అయినా చేరుకోగలరు’- చదరంగం చక్రవర్తి గారీ కాస్పరోవ్ 2016లో డొనాల్డ్ ట్రంప్ అమెరికాను ప్రస్తావిస్తూ పలికిన ఈ నిష్ఠుర సత్యం 2022లో నరేంద్ర మోదీ భారత్‌కూ వర్తిస్తుంది. సదృశత కొట్టొచ్చినట్టు కన్పించడం లేదూ! సంఖ్యానేక భారతీయుల ఆరాధ్య దైవాల జయంతి వేడుకలు మతోన్మాద మంటల భగభగలకు ఆలవాలమయ్యాయి. ఈ వైపరీత్యం ఏదో ఒక ప్రదేశంలో సంభవించడం కాదు, అరడజనుకు పైగా రాష్ట్రాలలో భిన్న మతస్థుల మధ్య సుహృద్భావాన్ని దెబ్బ తీసింది. అంతకంటే ఘోరం సదరు సంఘటనలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవటం. శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి ప్రదర్శనలపై రాళ్లు రువ్వడాన్ని చూపించిన వీడియోలవి. అధిక సంఖ్యాక మతస్థులలో అవి ఎటువంటి భావనను నెలకొల్పుతున్నాయనేది మరి చెప్పాలా? హింసాత్మక ఆవేశకావేశాలతో చెలరేగిపోతున్న అల్పసంఖ్యాక వర్గం దౌర్జన్యాలకు హిందువులు బాధితులు అవుతున్నారన్న అభిప్రాయాన్ని ఆ వీడియోలు దృఢతరం చేస్తున్నాయి. అంతేకాదు, ఆ అల్పసంఖ్యాక వర్గం వారికి ఒక పాఠం నేర్పితీరాలన్న తలంపును ‘బాధితుల’లో బలోపేతం చేస్తున్నది.


అయితే కనిపించేదే నిజమా? సత్యం సదా జటిలంగా ఉంటుంది. శ్రీరామ నవమి, హనుమ జయంతి వేడుకలలో పాల్గొన్నవారు మైనారిటీ మతస్థులను దుర్భాషలాడారు. వారికి వ్యతిరేకంగా భీతావహం కలిగించే నినాదాలు ఘోషించారు. హిందూత్వ వర్గాల వారి బహిరంగ బెదిరింపులను కోపోద్రిక్త ఇస్లామిస్ట్ శ్రేణులు అదే రీతిలో ప్రతిస్పందించాయి. ఈ పరిణామాలు సూచిస్తున్నదేమిటి? దేశానికి అమంగళకర భవిష్యత్తును కాదూ? సందేహం లేదు, అవి దుశ్శకునాలే. ఇవి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ స్వప్నాన్ని తప్పక భగ్నం చేస్తాయి. గతంలో సంకుచిత ప్రయోజనాలకు ఆలంబనగా చేసుకున్న విద్వేష రాజకీయాలు ఇప్పుడు క్లిష్ట పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఒకనాడు ప్రజల గుర్తింపుకే నోచుకోని సంస్థలు నేడు జాతి జీవన ప్రధాన స్రవంతిలో అంతర్భాగమయ్యాయి.


ఈ మతతత్వ హింసాకాండ భౌగోళిక విస్తృతిని చూడండి. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్‌లతో పాటు ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాజస్థాన్, బెంగాల్, ఒడిషా, జార్ఖండ్‌లను కూడా ఆ వేడి బలంగా తాకింది. చివరకు జాతీయ రాజధాని న్యూఢిలీల్లో సైతం ఆ మతోన్మాద రక్కసి తన రాక్షసత్వాన్ని ప్రదర్శించింది. దేశ రాజధానిలో పోలీసు శాఖ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఉంటుందనేది ఇక్కడ ప్రత్యేకంగా గుర్తు చేయవలసి ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ పాలనలో ఉన్న రాజస్థాన్‌లో కూడా. ఇక ఢిల్లీలో ఈ ఏడాది ద్వితీయార్థంలో కీలక మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మతతత్వ వేడి క్రమంగా పెరుగుతోంది. అలాగే విభజించి పాలించే క్షుద్ర రాజకీయాలు మళ్లీ బుసలు కొడుతున్నాయి.


ఇదొక కీలక సమయం. మతపరమైన అస్తిత్వాల పరిరక్షణకు ‘పాత’ భారత దేశం చేసిన పోరాటాల నుంచి శీఘ్ర అభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు సాధించుకోవడానికై ‘కొత్త’ భారతదేశం ఆరాటాలపై మనం మన దృష్టిని మళ్లీ కేంద్రీకరించాలి. నిరంతర ఇబ్బందుల నుంచి శతాధిక కోట్ల ఆకాంక్షల నవ్య, భవ్య భారతదేశం వైపుగా మన ప్రస్థానం సాగాలి. అయితే మనం అలాంటి సంకల్పంతోనే ఉన్నామా? లేదు. భావోద్వేగాలకు ప్రాధాన్యమిస్తున్నాం. విభేదాలను సృష్టించే అంశాలను పట్టుకు వేలాడుతున్నాం. సంకుచిత వైఖరులతో మన ముస్లిం సహోదరులను ‘ఇతరులు’గా పరిగణిస్తున్నాం. వారినలా వేధిస్తున్నాం. తొలుత హిజాబ్‌ను నిషేధించాం. పిదప హలాల్ మాంసాన్ని తిరస్కరించాం. తుదకు అజాన్‌ను ఆక్షేపిస్తున్నాం.


ఆదాయాలు పడిపోతున్నాయి. ధరలు పెరిగిపోతున్నాయి. కాయకష్టం మీద బతికేవారేకాదు, మధ్యతరగతి ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఆ అశేష ఆర్తజనుల దృష్టిని మళ్ళించేందుకే మతతత్వ భావావేశాలను రెచ్చగొడుతున్నారని, హిజాబ్, హలాల్, అజాన్‌లు అందుకు ఆయుధాలు అయ్యాయని కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ సూచించారు. ఆయన సబబుగా చెప్పారు. అయితే అదే పూర్తిగా సమంజసమైన కారణం కాదు. ఎందుకని? సంఘ్ పరివార్ హిందూ రాష్ట్ర స్థాపన లక్ష్య పరిపూర్తికి ‘మత-సాంస్కృతిక’ పోరాటం కీలకమైనది. ఇప్పుడు ఆ పోరాటం ఉధృతమైనది. అసాధారణంగా ముందంజలో ఉంది. ఎనిమిది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న తాము, లక్ష్య సాధనకు చేరువయ్యామని హిందూత్వ ఉన్మాదులు విశ్వసిస్తున్నారు. ఆఖరి, నిర్ణయాత్మక పోరాటం చేయవలసిన సమయమాసన్నమయిందని వారు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వరుసగా రెండోసారి విజయం సాధించడం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.


వివిధ ఆయుధాలను ప్రదర్శిస్తూ శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వేడుకలను కలహశీలంగా నిర్వహించడం ఆ స్వప్న సాధనా ప్రయత్నాలలో భాగమేనని చెప్పవచ్చు. తద్వారా హిందూ సాంస్కృతిక వైభవ పునరుద్ధరణను అడ్డుకోవడం ఇక ఎవరి వల్లా సాధ్యంకాబోదనే సందేశాన్ని సంఘ్ పరివార్ పంపించింది. 19వ శతాబ్ది తుదినాళ్ళలో వినాయక చవితి పండుగను లోక్‌మాన్య తిలక్ ఉద్దేశపూర్వకంగా ఒక సామూహిక ప్రజా వేడుకగా మార్చివేశారు. బ్రిటిష్ వలసపాలనకు వ్యతిరేకంగా కుల మతాలకు అతీతంగా సమాజాన్ని సమైక్యం చేసే సదుద్దేశమే ఆయన్ని అందుకు పురిగొల్పింది. 21వ శతాబ్దిలో హిందూత్వ శక్తులు శ్రీరాముడు, హనుమంతుడిని మతపరమైన పురుషాహంకృత శక్తిశీలతకు ప్రతీకలుగా ఉపయోగిస్తున్నాయి. ఇది సంప్రదాయ ఆచార కాండకు భిన్నమైనది, కాదు, విరుద్ధమైనది. కాకపోతే శ్రీరామనవమి ప్రదర్శనల సందర్భంగా మస్జీదుల ఎదుట ఉద్దేశపూర్వకంగా సంగీతాన్ని విన్పించేందుకు ప్రయత్నించడమేమిటి? తద్వారా హిందూత్వ శక్తులు పంపుతున్న సందేశం స్పష్టమే: అజాన్‌కు లౌడ్ స్పీకర్లను ఉపయోగించుకోవడానికి ముస్లింలు అనుమతిస్తున్నప్పుడు, ఆ మతస్థులు అధికంగా ఉన్న మొహల్లాలలో తమ ఉనికిని చాటుకునేందుకు హిందూత్వ బృందాలు మస్జీదుల ముందు తప్పకుండా తమ పాటలను హోరెత్తిస్తాయి.


విశ్వహిందూ పరిషత్, భజ్‌రంగ్‌దళ్‌లకు ఇటువంటి సమరశీల మత రాజకీయాలు ఒక జీవరేఖ అని చెప్పి తీరాలి. రామజన్మ భూమి ఉద్యమం తొలినాళ్లలో కీలకపాత్ర వహించిన ఈ సంస్థలు ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. గతంలో వలే బీజేపీ ఎన్నికల యంత్రాంగం తమపై అంతగా ఆధారపడకపోవడం ఈ ఉభయ సంస్థలకు ఏమాత్రం సంతోష దాయకంగా లేదు. బీజేపీ తరపున పార్లమెంటు, శాసనసభలకు ఎన్నికైన రాజకీయవేత్తలు అధికారంపై గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు. అయితే విశ్వహిందూ పరిషత్, భజ్‌రంగ్‌దళ్‌లకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించడం లేదు. మారిన పరిస్థితులలో, చట్టబద్ధమైన లేదా పాలనాపరమైన అవరోధాలు ఏవైనప్పటికీ తమకూ కీలక భాగస్వామ్యం కల్పించాలని ఆ ఉభయ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.


ఈ సంకల్పంతోనే ఆ రెండు హిందూత్వ సంస్థలు నిర్భయంగా వ్యవహరిస్తున్నాయి. విద్వేషాన్ని వెదజల్లుతున్న ధర్మసంసద్‌లను నిర్వహిస్తున్నాయి. గో రక్షణ ఉద్యమాలలో హింసాకాండకు పాల్పడడానికి సంకోచించడం లేదు. మత సామరస్యాన్ని దెబ్బతీసే లవ్ జిహాద్ ఉద్యమాలను ఉధృతం చేశాయి. కిక్కిరిసిన హిందూత్వ విపణిలో తమ రాజకీయ వాటాను పునరుద్ధరించుకునేందుకు అవి సకల చర్యలూ చేపడుతున్నాయి. హనుమాన్ జయంతి నాడు ఢిల్లీలో, పోలీసుల అనుమతి లేనప్పటికీ శోభాయాత్ర నిర్వహించడానికి విశ్వహిందూ పరిషత్, భజ్‌రంగ్‌దళ్‌లు సాహసించాయి! వాటికి భరోసా ఏమిటి? అధికారంలో ఉన్న తోటి హిందూత్వవాదులు అంతిమంగా తమ ప్రయోజనాలను కాపాడేందుకు తప్పక ప్రయత్నిస్తారని ఈ రెండు హిందూత్వ సంస్థలు విశ్వసిస్తున్నాయి. విచారకరమైన విషయమేమిటంటే విశాల హిందూత్వ ప్రాజెక్టులో కీలక భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం హిందూత్వ శక్తుల చట్ట విరుద్ధ ప్రవర్తనను కట్టడి చేయలేకపోతోంది. రాజకీయ నాయకత్వంతో పూర్తిగా రాజీపడ్డ పోలీసులు అధికారంలో ఉన్న వారికి మతతత్వ అల్లర్ల వ్యతిరేక చట్టం గురించి నిర్మొహమాటంగా చెప్పలేకపోతున్నారు. ఈ కారణంగానే శాంతిభద్రతల పరిరక్షణ చట్టాలను నిష్పాక్షికంగా అమలుచేయడానికి బదులు చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడిన వారి గృహాలను బుల్‌డోజర్లతో కూల్చివేసేందుకు పూనుకుంటున్నారు!


బుల్‌డోజర్ మొదలైన విధ్వంసక శకటాలతో చేసే రాజకీయాలు అల్ప సంఖ్యాక వర్గాల వారిని భయకంపితులను చేస్తాయి (ఉత్తరప్రదేశ్‌లో ముస్లింల అనుభవం ఇదే కదా). అయితే దీర్ఘకాలంలో ఆ హింస జ్వలన, ధ్వంస రచన బాధితులను ఆగ్రహావేశులను చేస్తుంది. అన్యాయాలపై తిరగబడేందుకు పురిగొల్పుతుంది. అమాయకులు ఆగ్రహ భార్గవులు అయితే వారిని నియంత్రించడం సాధ్యమవుతుందా? ‘హిందువులే బాధితులు’ అనే ఆక్రోశం అధిక సంఖ్యాక మతస్థులను ఉద్రిక్తులను చేస్తే, ‘బాధితులుగా ముస్లింలు’ అనే విరుద్ధ వృత్తాంతం ఇస్లామిస్ట్ తీవ్రవాదులకు సరికొత్త విద్వేష మందుగుండును సమకూరుస్తుంది. కరడుగట్టిన సంకుచితత్వ విశ్వాసాల వ్యాప్తిని మరింత పట్టుదలతో పరిపూర్తిచేసేందుకు వారిని ఆయత్తం చేస్తుంది. తనను తాను ‘విశ్వగురు’ అగ్రరాజ్యంగా భావించుకుంటున్న దేశానికి అంతకంటే ఆందోళనకరమైన పరిస్థితి మరేముంటుంది? వర్తమాన భారత్‌కు అవసరమైన వారు స్నేహ సేతువుల నిర్మాతలేగానీ నాగరికతా విలువల విధ్వంసకులు కానే కాదు.

ధ్వంసమవుతున్న భారత ధర్మం

రాజ్‌దీప్‌ సర్దేశాయి 

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.