ద్వేషంతో వినాశనం

ABN , First Publish Date - 2022-05-13T05:30:00+05:30 IST

మనిషి హృదయంలో ద్వేషం, దురభిమానం గూడుకట్టుకోవడం ప్రారంభిస్తే... ఒక పట్టాన వదలవు.

ద్వేషంతో వినాశనం

నిషి హృదయంలో ద్వేషం, దురభిమానం గూడుకట్టుకోవడం ప్రారంభిస్తే... ఒక పట్టాన వదలవు. క్రమంగా అవి ప్రతీకారంగా మారుతాయి. చివరకు హింసకూ, హత్యాకాండలకూ దారి తీస్తాయి. ద్వేషం, దురభిమానం పరలోకంలోనే కాదు... ఇహలోకంలోనూ మనిషి వినాశనానికి దారితీస్తాయి. కాబట్టి విశ్వాసులు వాటి విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ‘‘దౌర్జన్యపరుడికి ప్రళయదినం అంధకారంగా మారుతుంది. అతను హద్దుమీరే వరకూ దేవుడు విడుపు ఇస్తాడు. అతణ్ణి దేవుడు పట్టుకుంటే ఇక శిక్షించకుండా విడిచిపెట్టడు’’ అని చెప్పారు దైవప్రవక్త మహమ్మద్‌. ‘‘ఆయన ఏ పట్టణాన్నయినా పట్టుకుంటే దానికి వినాశనం మూడినట్టే. ఆయన పట్టు చాలా కఠినంగా ఉంటుంది. అది ఎంతో బాధాకరంగా ఉంటుంది’’ అని హెచ్చరించారు. ఒక వ్యక్తి దుర్మార్గుడని తెలిసి కూడా అతణ్ణి ఎవరైనా సమర్థిస్తే... అలా సమర్థించిన మనిషి ఇస్లాం నుంచి బయటకు వెళ్ళిపోయినట్టేననీ, అధర్మంలో, అక్రమాలలో తనకు అనుకూలమైన వారికి సహకరించేవారు... బావిలో పడిపోతున్న ఒంటె తోక పట్టుకొని... దానితోపాటు బావిలో పడిపోయే మూర్ఖులలాంటి వారనీ హదీస్‌ గ్రంథం చెబుతోంది. ‘‘దురభిమానం వైపు పిలిచేవాడు మనవాడు కాదు. దురభిమానంతో యుద్ధం చేసేవాడు కూడా మనవాడు కాదు. దురభిమానంతో రగిలిపోతూ మరణించేవాడు కూడా మనవాడు కాదు’’ అని స్పష్టం చేస్తోంది. ఇతరుల పట్ల అకారణమైన ద్వేషాన్ని పెంచుకొనేవారు, దురభిమానంతో వేరొకరికి చెడు చెయ్యడానికి సిద్ధపడేవారు చివరకు నాశనమవుతారు. దౌర్జన్యాలకూ, హింసకూ పాల్పడేవారు దైవం విధించే శిక్షకు గురికాక తప్పదు.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌


Read more