Advertisement

కొత్తగూడెం - పాల్వంచ జంట పట్టణాల అభివృద్ధే లక్ష్యం

Dec 2 2020 @ 23:21PM
మాట్లాడుతున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు

రామవరం నుంచి జగన్నాథపురం వరకు సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు  

ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు

కొత్తగూడెం, డిసెంబరు 2: కొత్తగూడెం నియోజకవర్గంలోని కొత్తగూడెం - పాల్వంచ జంట పట్టణాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, కొత్తగూడెం పట్టణంలోని రామవరం ప్రాంతం నుంచి పాల్వంచ పట్టణంలోని పెద్దమ్మగుడి సమీపంలో ఉన్న జగన్నాథపురం గ్రామం వరకు జాతీయ రహదారి మధ్య డివైడర్లు ఏర్పాటుచేసి వాటిలో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయనున్నామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వెల్లడించారు. బుధవారం కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో  అభివృద్ధి పనులను వివరించారు. హైదరాబాద్‌ - సికింద్రాబాద్‌ జంట నగరాల్లాగా కొత్తగూడెం-పాల్వంచ పట్టణాలను అభివృద్ధి చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకు కనీస సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 

పట్టణాల అభివృద్ధికి కృషి

 పట్టణాల్లో అంతర్గత రోడ్లు, ప్రధాన రోడ్లు, డ్రైన్లు, నీటి సమస్య పరిష్కారంతో పాటు  కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను సందరంగా తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్యే వనమా తెలిపారు. మొట్టమొదటిగా రామవరం-14 నెంబర్‌ బస్తీ నుంచి పోస్టాఫీస్‌ సెంటర్‌ నుంచి లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ మీదుగా జగన్నాథపురం వరకు సెంట్రల్‌ లైటింగ్‌  ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ సెంట్రల్‌ లైటింగ్‌ కోసం నిధులు కూడా సమకూర్చామన్నారు. ప్రతీ30 అడుగులకు ఒక అధునాతన ఎలక్ట్రికల్స్‌ పోల్‌ మిరమిట్లు గొలిపే ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అర్ధరాత్రి వరకు కూడా స్పష్టంగా కనిపించేటట్లు ఈ సెంట్రల్‌ లైటింగ్‌ ఉంటుందన్నారు. రామవరం నుంచి పెద్దమ్మగుడి వరకు ఈ లైటింగ్‌ ద్వారా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుందన్నారు. సెంట్రల్‌ లైటింగ్‌తోపాటు డివైడర్లు కూడా మంజూరయ్యాయని, వాటిపై మొక్కలు నాటి పట్టణాన్ని అంతా హరితహారంలా అందంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

వెలుగులకు ఏర్పాట్లు

కొత్తగూడెంలోని పోస్టాఫీస్‌ సెంటర్‌లో ఉన్న సర్కిల్‌లో ఒక అందమైన ఆహ్లాదాన్ని కలిగించేలా వాటర్‌ ఫౌంటేన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కొత్తగూడెం సరిహద్దులో ఉన్న ఇల్లెందు క్రాస్‌ రోడ్డులో  హైమాస్ట్‌ లైట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ లైటింగ్‌ ద్వారా సుమారు అర కిలో మీటర్ల వరకు ఎంతో ఆకర్శణీయంగా వెలుగులు ప్రసరింపజేస్తాయన్నారు. ప్రతి 30 అడుగులకు ఒక ఎలక్ట్రికల్‌ పోల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.  పాల్వంచ పట్టణంలో అంబేద్కర్‌ సెంటర్‌లో కూడా ఒక ఆకర్శణీయమైన ఫౌంటేన్‌ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి అల్లూరి సెంటర్‌ వరకు 100 అడుగుల రోడ్డులో డివైడర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడ కూడా నిధులను సమకూర్చి సెంట్రల్‌ లైటింగ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 

పల్లెల్లో అంతర్గత రహదారులు

 గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక సదుపాయాలను కల్పించేందుకు కృషిచేస్తున్నట్టు వనమా పేర్కొన్నారు. తానున్న లేకపోయినా భావితరాలకు గుర్తుండే విధంగా అనేక మైన అభివృద్ధి పనులను చేపట్టి పాల్వంచ, కొత్తగూడెం జంట నగరాలను సుందరీకరణ చేపట్టి ప్రజల మన్ననలు పొందేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. వీటితోపాటు నియోజకవర్గంలోని సుజాతనగర్‌, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ మండలాల్లో ఉన్న అన్ని గ్రామాలకు వెళ్లేందుకు అంతర్గత రహదారులు సైతం ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.   ఈ సమావేశంలో కొత్తగూడెం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, వైస్‌ చైర్మన్‌ వేల్పుల దామోదర్‌, కౌన్సిలర్లు వేణుగోపాల్‌, పరమేష్‌ యాదవ్‌, కో-ఆప్షన్‌ సభ్యులు దూడల బుచ్చయ్య, కోలాపురి ధర్మరాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎంఏ. రజాక్‌, కాసుల వెంకట్‌ పాల్గొన్నారు. 

 

Follow Us on:
Advertisement