ఆ పిల్లల్లో జోష్‌ నింపడానికి...

ABN , First Publish Date - 2021-04-29T05:31:18+05:30 IST

పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న వారికి సరికొత్త సాంకేతికతతో కొత్త జీవితాన్ని అందిస్తున్నారు దేవాంగీ దలాల్‌. ముంబాయికి చెందిన యాభయ్యేళ్ళ ఈ ఆడియాలజిస్ట్‌ నేతృత్వంలోని ట్రస్ట్‌ కొన్ని వందల మందికి వినికిడి పరికరాలు ఉచితంగా అమర్చింది...

ఆ పిల్లల్లో జోష్‌ నింపడానికి...

పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న వారికి సరికొత్త సాంకేతికతతో కొత్త జీవితాన్ని అందిస్తున్నారు దేవాంగీ దలాల్‌. ముంబాయికి చెందిన యాభయ్యేళ్ళ ఈ ఆడియాలజిస్ట్‌ నేతృత్వంలోని ట్రస్ట్‌ కొన్ని వందల మందికి వినికిడి పరికరాలు ఉచితంగా అమర్చింది. అయిదువేల మందికి పైగా పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దేవాంగీ దలాల్‌ ప్రస్థానం ఆమె మాటల్లోనే...


‘‘బాల్యం నుంచి డాక్టర్‌ కావాలన్నది నా కల. దానికోసం ఎంతో కష్టపడి చదివాను. అయితే ముంబాయిలో సీటు దొరకలేదు. అమ్మాయిలు వేరే ఊర్లో ఉండి చదువుకోవడానికి ఆ రోజుల్లో పెద్దవాళ్ళు అంగీకరించేవారు కాదు. దాంతో, వేరే దారి ఎంచుకోవాల్సి వచ్చింది. అందుబాటులో ఉన్న ఆప్షన్లలో... ఆడియాలజీ, స్పీచ్‌ థెరపీలో బ్యాచిలర్‌ సైన్స్‌ కోర్సు మంచిదనిపించింది. నా జీవితంలో అది పెద్ద మలుపు అని నేననుకుంటాను.


నేను పుట్టిందీ, పెరిగిందీ ముంబాయిలోనే. అప్పట్లో ఆడియాలజీ, స్పీచ్‌ థెరపీ కోర్సులో దేశం మొత్తం మీద ఉన్న సీట్లు కేవలం అరవై అయిదు. వాటిలో పది సీట్లు మా నాయర్‌ హాస్పిటల్‌లో ఉండేవి. డిగ్రీ పూర్తయ్యాక ఒక ఈన్‌టి స్పెషలిస్ట్‌ దగ్గర పని చేశాను. వినికిడి లోపం, మాట్లాడలేకపోవడం ఒక పెద్ద సమస్య అని నాకు తెలుసు. కానీ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్‌ను చూశాక ఆ సమస్య తీవ్రత నాకు అర్థమయింది. ముఖ్యంగా పిల్లల కోసం ఏదైనా చెయ్యాలన్న తపన ఎక్కువగా ఉండేది. 


ముందుగా గుర్తిస్తేనే...

2004లో డెన్మార్క్‌లో నిర్వహించిన ఒక అంతర్జాతీయ సదస్సుకు హాజరయ్యాను. పుట్టిన పిల్లల్లో వినికిడి లోపాల గురించి తెలుసుకోవడానికి స్ర్కీనింగ్‌ చెయ్యడం గురించి మొదటిసారి అప్పుడే నాకు తెలిసింది. మన దేశంలో అలాంటి పరీక్షలేవీ లేవు. సమస్య బయటపడేసరికి అంతా చెయ్యి దాటిపోతుంది. వైద్యులు కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి ఏర్పడుతుంది. నెలల పిల్లలకు ఇటువంటి పరీక్షలు చేయించేలా ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం ‘జోష్‌ ఫౌండేషన్‌’ (జువనైల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌) అనే సంస్థను ఏర్పాటు చేశాను. పత్రికల్లో వ్యాసాలు రాశాను. వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశాను. అవసరం ఉన్న విద్యార్థులకు ప్రత్యేకమైన వినికిడి పరికరాలు అందించడం ప్రారంభించాను. జన్యుపరంగానూ, ఇతర కారణాలతోనూ పుట్టుకతోనే ఏర్పడే ఇలాంటి సమస్యలను సాంకేతికత ద్వారా అధిగమించవచ్చు. అందుకే వీలున్నప్పుడల్లా విదేశాలకు వెళ్ళి, కొత్త సాంకేతికతలను నేనూ, మా ఫౌండేషన్‌ సభ్యులు అధ్యయనం చేస్తున్నాం. డిజిటల్‌ వినికిడి పరికరాల వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే నాణ్యమైన పరికరాల ధర రూ. అరవై వేల నుంచీ మొదలవుతుంది. ఇప్పటి వరకూ దాతల సాయంతో దాదాపు 1,300 మంది పిల్లలకి పైగా వీటిని అందించాం. వాటిని నేనే స్వయంగా అమర్చి, వాటి వినియోగంపై పిల్లలకు శిక్షణ ఇస్తూ ఉంటాను. నిధుల కోసం ఎన్నో సంస్థలకు ఇప్పటికీ వెళ్తున్నాను. స్ర్కీనింగ్‌ టెస్ట్స్‌ కోసం, వినికిడి పరికరాల కోసం సాయం చెయాల్సిందిగా కోరుతున్నాను. 




అదే నాకు ప్రేరణ...

మన దేశంలో తల్లితండ్రులు తమ నెల లోపు పిల్లలకు నియోనాటల్‌ స్ర్కీనింగ్‌ (నెల పిల్లలకు పరీక్షలు) చేయించడం ఎంత ముఖ్యమన్నది ఇంకా గ్రహించలేదు. మిగిలిన పిల్లల మాదిరిగా తమ పిల్లలు మాట్లాడడంప్రారంభించకపోతే... సిగ్గు వల్ల మాట్లాడడం లేదనో, ఇంకా మాటలు రావడం లేదనో అనుకుంటూ ఉంటారు. నిజానికి అది వినికిడి సమస్య కావచ్చు. పిల్లలు ఏదైనా భాష నేర్చుకోవడానికి నెలల నుంచీ అయిదేళ్ళ మధ్య వయసు చాలా విలువైనది. వాళ్ళు మాట్లాడలేకపోయినా, సరిగ్గా వినలేకపోతున్నా వీలైనంత తొందరగా గుర్తించి, పరిష్కారాలేమిటన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆలస్యం అయ్యే కొద్దీ సమస్య తీవ్రమవుటుంది. విదేశాల్లో శిశువులకు కూడా వినికిడి పరికరాలు, కోక్లియర్‌ ఇంప్లాంట్స్‌ అమరుస్తారు. మన దేశంలో పిల్లలు భాష నేర్చుకోవడానికి బదులు సంకేతాల దగ్గరే ఉండిపోతున్నారు. వాళ్ళు ఏదీ వినలేరని నిర్లక్ష్యం చెయ్యకూడదు. సైగల భాష నేర్పడానికి బదులు ఒక మంచి వినికిడి పరికరం వల్ల ఎక్కువగా అన్నీ తెలుసుకోగలుగుతారు. దానికి సంబంధించిన సాంకేతికత కూడా మనకు అందుబాటులో ఉంది. వినికిడి సమస్య ఉన్న అయిదువేల మందికి పైగా పిల్లలు సాధారణ పాఠశాలల్లో చేరడానికి మా ఫౌండేషన్‌ సాయపడింది. వినడంలో ఇబ్బంది తొలగిపోయిన తరువాత చాలామంది పిల్లలు తమతమ కెరీర్లతో పాటు క్రీడల్లో, ఇతర రంగాల్లో విజయం సాధిస్తున్నారు. నేను చికిత్స చేసిన వారిలో నెలల పిల్లల నుంచి 107 ఏళ్ళ బామ్మ వరకూ ఉన్నారు. చికిత్స తరువాత వాళ్ళలో కనిపించే ఆత్మవిశ్వాసమే మరింత మందికి సాయపడాలనే ప్రేరణ నాలో కలిగిస్తోంది.’’


బహుముఖ ప్రతిభ

దేవాంగీ దలాల్‌ ప్రపంచవ్యాప్తంగా జరిగే పిడియాట్రిక్‌ ఆడియాలజీ సదస్సులకు క్రమం తప్పకుండా హాజరవుతారు. ఆడియాలజీ, స్పీచ్‌ థెరపీల్లో సాంకేతిక పురోగతులను తెలుసుకోవడానికి ఇరవయ్యేళ్ళుగా ఎన్నో దేశాలు పర్యటించారు. ప్రపంచ బ్యాంక్‌తో కలిసి పని చేస్తున్న ‘కొయలేషన్‌ గ్లోబల్‌ హియరింగ్‌ హెల్త్‌’లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఆడియాలజిస్ట్‌ ఆమె. ఈ క్రమంలో ఎన్నో పురస్కారాలు కూడా అందుకున్నారు. 2012లో ‘అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ ఆడియాలజీ’ నుంచి హ్యుమానిటేరియన్‌ అవార్డు ఆమెకు లభించింది. ఈ అవార్డు మన దేశానికి చెందిన వ్యక్తికి రావడం అదే తొలిసారి. దేవాంగి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆరు భాషలు మాట్లాడగలరు. బ్లాగ్‌లో చురుగ్గా ఉంటారు. ‘స్ర్పెడింగ్‌ పాజిటివిటీ’ పేరిట ఒక పుస్తకం రాశారు. ఒక మరాఠీ సీరియల్‌లో నటించారు. కొన్ని స్ఫూర్తిదాయకమైన పాటలు రాశారు. వినికిడి సమస్యపై సాధారణ ప్రజల్లో అవగాహన కలిగించడానికి మరాఠీ, హిందీ భాషల్లో పుస్తకాలు ప్రచురించారు. ఒక టెలీఫిలిమ్‌కు దర్శకత్వం వహించారు.

Updated Date - 2021-04-29T05:31:18+05:30 IST