పాఠ్యాంశాలుగా నా కథనాలు వద్దు..

ABN , First Publish Date - 2022-05-26T18:31:00+05:30 IST

పదో తరగతి పాఠ్యపుస్తకంలో నా కథనాలు చేర్చుకునేందుకు గతంలో ఇచ్చిన అనుమతి హామీ పత్రాన్ని వాపసు తీసుకుంటానని ప్రముఖ సాహితేవేత్త దేవనూరు మహదేవ

పాఠ్యాంశాలుగా నా కథనాలు వద్దు..

- అనుమతులు వాపసు తీసుకుంటా: దేవనూరు మహదేవ 

- ముద్రించాక వాపసు అంటే ఎలా..?: మంత్రి బీసీ నాగేష్‌


బెంగళూరు: పదో తరగతి పాఠ్యపుస్తకంలో నా కథనాలు చేర్చుకునేందుకు గతంలో ఇచ్చిన అనుమతి హామీ పత్రాన్ని వాపసు తీసుకుంటానని ప్రముఖ సాహితేవేత్త దేవనూరు మహదేవ ప్రకటించారు. రాష్ట్రంలో పాఠ్యాంశాల విషయమై గందరగోళం సాగుతోంది. కర్ణాటక రాష్ట్ర పాఠ్యపుస్తకాల పరిష్కరణ, వివాదాలపై ఇటీవల సాగుతున్న వివాదాలపై దేవనూరు మహదేవ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవనూరు మహదేవకు సంబంధించిన కథనం పాఠ్యాంశంగా చేర్చా రని, లేదనే అంశాలపై చర్చలు సాగుతున్న తరుణంలోనే మంగళవారం మహదేవ స్పందించారు. పాఠ్యాంశంగా నా కథనం చేర్చకుంటే సంతోషమని ఒకవేళ చేర్చి ఉంటే నా అనుమతి ఉండదని తేల్చి చెప్పారు. గతంలో పాఠ్యాంశాల కోసం ఇచ్చిన అనుమతులను రద్దు చేసుకుంటు న్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు మహదేవ లేవనెత్తిన అంశాలు గతంలో పాఠ్యాంశాలుగా ఉండే ఎల్‌. బసవరాజు, ఎఎన్‌మూర్తిరావ్‌, పి.లంకేష్‌, సారా అబూబకర్‌ వంటి వారి కథనాలను వదిలేశారు అంటే ఎవరి కథనాలు తొలగించారో వారికి కన్నడ భాషా సంస్కృతి లేదనే అర్థం కాదా అని ప్రశ్నించారు. పాఠ్యపుస్తక సమితి అధ్యక్షులు రోహిత్‌ చక్రవర్తి కవుల జాడే తెలియదంటే భారత్‌ వంటి సంకీర్ణ దేశంలో ప్రజ్ఞాపూర్వకంగా అన్నిజాతులను గుర్తించకపోతే అక్కడ 90శాతం మంది ఒకే జాతికి చెందినవారే నిండిపోతారన్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజాస్వామ్య ప్రభుత్వం కనుమరుగవుతుందని విచారం వ్యక్తం చేశారు. ఈవిధానం కేంద్రంలో మురళీ మనోహర్‌ జోషి విద్యాశాఖామంత్రి అయినప్పటి నుంచి పుట్టుకొచ్చిందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సంతానమైన బీ జేపీ పాలనలో తొలుత విద్య, చరిత్ర పైనే ప్రభావం చూపుతారన్నారు. కాగా మరో సాహితీవేత జి. రామకృష్ణ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నా అనుమతి లేకుండా పాఠ్యాంశంగా తీసుకోరాదన్నారు. 


పాఠ్య పుస్తకం ముద్రించాక వ్యతిరేకిస్తే ఎలా.... 

- మంత్రి బీసీ నాగేష్‌

పాఠ్యపుస్తకాలు ముద్రించాక అనుమతులు వాపసు తీసుకుంటానని వ్యతి రేకిస్తే ఎలాగని విద్యాశాఖా మంత్రి బీసీ నాగేష్‌ ప్రశ్నించారు. మైసూరులో బుధ వారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సాహితీవేత్తలు దేవనూరు మహదేవ, బరగూరు రామచంద్రప్పలను కొందరు దారి తప్పిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు ముద్రించామని ఇప్పుడు వ్యతిరేకిస్తే ఎలాగన్నారు. దేవనూరు మహదేవ అంటే అపారమైన గౌరవం ఉందన్నారు. పోరాట పటిమతో వచ్చినవారని ప్రస్తుతానికి వారి పాఠ్యాంశాలను తొలగించడం సాధ్యం కాదన్నారు. ఎందుకు పాఠ్యాంశంగా వద్దని అభిప్రాయపడ్డారో తెలియదన్నారు. దేవనూరు నుంచి ఇటువంటి వ్యాఖ్యలు ఊహించలేదన్నారు. బరుగూరు రామచంద్రప్ప కాంగ్రెస్‌ ప్రభావంతో మాట్లాడి ఉంటారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆరంభం నుంచి పాఠ్యపుస్తక పరిష్కరణల పట్ల వ్యతిరేకిస్తూ వచ్చే వారన్నారు. కొందరు సాహితీవేత్తలు వ్యతిరేకించడం వెనుక కాంగ్రెస్‌ ప్రభా వమై ఉండవచ్చు అన్నారు.



Updated Date - 2022-05-26T18:31:00+05:30 IST