దేవరపల్లి మలుపు అంటేనే దడ

ABN , First Publish Date - 2022-01-23T05:29:12+05:30 IST

పర్చూరు - చిలకలూరిపేట ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారిలోని దేవరపల్లి మలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది.

దేవరపల్లి మలుపు అంటేనే దడ
ప్రమాదాలకు నిలయంగా ప్రధాన రహదారిలోని దేవరపల్లి మలుపు

రోడ్డుపక్క పెరిగిపోయిన చిల్లచెట్లు

హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయని అధికారులు

 పలు ప్రమాదాల్లో  ప్రాణాలు కోల్పోయిన వైనం

పర్చూరు, జనవరి 22: పర్చూరు - చిలకలూరిపేట ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారిలోని దేవరపల్లి మలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ రహదారి మలుపులో నిత్యం అనేక వాహనాలు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు కనీస చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకోపోకలు సాగించే ప్రధాన రహదారి కావటం, గ్రామానికి వెళ్లే మలుపు పల్లంగా ఉండటం ప్రమాదాలకు దారితీస్తోంది. దీనికితోడు మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు రోడ్డుకు ఇరువైపులా ముళ్ల చెట్లు పెరిగిపోవటం, రహదారిలో వచ్చే వాహనాలను గుర్తించలేక ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. గడిచిన మూడు రోజుల వ్యవధిలో పర్చూరు నుంచి ద్విచక్రవాహనంపై మండలంలోని దేవరపల్లి గ్రామం వెళుతూ మలుపు వద్ద ట్రాక్టర్‌ను ఢీకొనటంతో  ఓ వ్యక్తి అక్కడి కక్కడే మృతి చెందాడు. ఇలాంటి సంఘటనలో అనేకం ఈమలుపు వద్ద చోటుచేసుకున్నాయి. అదే విధంగా పక్షం రోజుల వ్యవధిలో చిలకలూరిపేట నుంచి పర్చూరు వైపు వస్తున్న తరుణంలో దేవరపల్లి నుంచిపర్చూరు వైపు వెళుతుండగా ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి ఆటో  పక్కనే ఉన్న కాలువలోకి బోల్తా పడింది. ఈసంఘటనలో అనేక మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది కూలీలు ఉండగా అంద రూ స్వల్పగాయాలతో బయట పడ్డారు. అలాగా గతంలో ఇదే మలుపు వద్ద పర్చూరుకు చెందిన ఓరైతు కూలీ పనులు ముగించుకొని సైకిల్‌పై వస్తుండగా లారీఢీకొనటంతో ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి సంఘటనలో నిత్యం చోటుచేసుకుంటున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు.

పెరిగిపోయిన చిల్లచెట్లు...

దీనికి తోడు ప్రధాన రహదారికి ఇరుపైపులా అడవిని తలపించేలా చిల్లచెట్లు పెరిగిపోయాయి. వాటి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అలాగే వాడరేవు - పిడుగురాళ్ళ ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారిలో ఎక్కడ సూచినా రోడ్డుకు ఇరువైపులా చిల్లచెట్లు, ముళ్ల పొదలే దర్శనమిస్తున్నాయి. 

కనిపించని సూచిక బోర్డు..

ప్రధాన రహదారికి అనుకొని గ్రామంలోకి వెళ్లే రహదారి మలుపు వద్ద కనీసం సూచిక బోర్డుకూడా ఏర్పాటు చేయలేదు. అధికారుల నిర్లక్ష్యంవల్లే ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని గ్రామస్థులు, వాహనదారులు ఆరోపిస్తున్నారు.  ఇప్పటికైనా సంబంధిత ఆర్‌అంబ్‌బీ అధికారులు రహదారి మలుపు వద్ద సూచిక బోర్డులను ఏర్పాటు చేయటంతో పాటు, చిల్లచెట్లు తొలగించి ప్రమాదాలను నియంత్రించాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.   

Updated Date - 2022-01-23T05:29:12+05:30 IST