తిరుపతి, చంద్రగిరి రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయండి

ABN , First Publish Date - 2021-06-14T06:43:35+05:30 IST

తిరుపతి, చంద్రగిరి రైల్వేస్లేషన్లను అభివృద్ధి చేయాలంటూ కేంద్ర రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌కు తిరుపతి ఎంపీ గురుమూర్తి, ప్రభుత్వవిప్‌, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు.

తిరుపతి, చంద్రగిరి రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయండి
పీయూష్‌ గోయల్‌కు వినతిపత్రం అందజేస్తున్న గురుమూర్తి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి

రైల్వేమంత్రికి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వినతి


తిరుమల, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): తిరుపతి, చంద్రగిరి రైల్వేస్లేషన్లను అభివృద్ధి చేయాలంటూ కేంద్ర రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌కు తిరుపతి ఎంపీ గురుమూర్తి, ప్రభుత్వవిప్‌, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన కేంద్రమంత్రిని ఆదివారం శ్రీకృష్ణ అతిథిగృహంలో ఎంపీ మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి మోడల్‌ రైల్వేస్టేషన్‌ పనులు చేపట్టేందుకు వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని తిరుపతి, శ్రీకాళహస్తి, గూడూరు, వెంకటగిరి, వెంకటాచలం, నాయుడుపేట, సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లు అభివృద్ధిపై చర్చించారు. తిరుపతిలో బాలాజీ రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయాలని విన్నవించారు. తిరుపతి రైల్వేష్టేషన్‌ దక్షిణంవైపు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. పరిపాలనా రాజధాని విశాఖను కలుపుతూ చిత్తూరు నుంచి తిరుపతి మీదుగా ప్రత్యేక సూపర్‌ఫాస్ట్‌ రైలు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నెల్లూరు, చిత్తూరు జిల్లాలను కలుపుతూ శ్రీకాళహస్తి మీదుగా కూడా ఫాస్ట్‌ ప్యాసింజర్‌ రైలు ప్రారంభించాలన్నారు. శ్రీకాళహస్తి - నడికుడి నూతన రైల్వేలైన్‌ త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేటాయించాలన్నారు. 


తిరుపతికి ప్రత్యామ్నాయంగా చంద్రగిరి రైల్వేస్టేషన్‌

తిరుపతికి చంద్రగిరి రైల్వేస్టేషన్‌ను ప్రత్యామ్నాయంగా భావించవచ్చని చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. తిరుపతికి రైల్వే స్టేషన్‌కు భక్తులకు తాకిడి అధికంగా ఉంటుందన్నారు. ఈ క్రమంలో చంద్రగిరి రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాలని కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు. చంద్రగిరి రైల్వేస్టేషన్‌కు అతిసమీపంలో కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉందని, తిరుమలకు వచ్చే భక్తుల్లో 50 శాతం మంది ఇక్కడకు వస్తారన్నారు. అలాగే శ్రీవారిమెట్టు మార్గం నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు ఈ రైల్వేస్టేషన్‌ అనుకూలంగా ఉంటుందని చెప్పారు. జూ పార్కుకు కూడా చంద్రగిరి రైల్వేస్టేషన్‌ అనుకూలమని, వీలైనంత తర్వగా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే దామలచెరువు, పులిచెర్ల రైల్వేస్టేషన్ల మధ్యనున్న వల్లివేడు రైల్వే హాల్ట్‌స్టేషన్‌లో పలు రైళ్ల స్టాపింగ్స్‌ను రద్దు చేసిన విషయాన్ని కేంద్రమంత్రికి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల అవసరాల మేరకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-06-14T06:43:35+05:30 IST