అభివృద్ధి, సాంస్కృతిక వికాసం విజ్ఞాన కేంద్రాల లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-20T05:46:04+05:30 IST

ప్రజల అభివృద్ధి, సాంస్కృతిక వికాసం పెంపొందించడమే విజ్ఞాన కేంద్రాల లక్ష్యమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మన్‌ బి.వి.రాఘవులు అన్నారు.

అభివృద్ధి, సాంస్కృతిక వికాసం విజ్ఞాన కేంద్రాల లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న పొలిట్‌ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు

అల్లూరి కేంద్రం ప్రారంభోత్సవంలో సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు

విశాఖపట్నం, మే 19 (ఆంధ్రజ్యోతి): ప్రజల అభివృద్ధి, సాంస్కృతిక వికాసం పెంపొందించడమే విజ్ఞాన కేంద్రాల లక్ష్యమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మన్‌ బి.వి.రాఘవులు అన్నారు. డాబాగార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన అల్లూరి విజ్ఞాన కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సమాజంలో ఆకలికి ఆహారం లేకపోవడమే ఒక కారణం కాదని, మంచి సాంస్కృతిక వాతావరణం లేకపోవడం కూడా కారణమన్నారు.


జానపద కళలు ప్రజల్ని శ్రమ నుంచి దూరం చేసేందుకు పుట్టాయని, సినిమా మాధ్యమం ప్రభావం పడ్డాక తప్పుదోవ పట్టాయన్నారు. తెరపై చూపించి డబ్బు చేసుకోవడం తప్ప కళాకారులకు ప్రయోజనం క ల్పించే ఆసక్తి సినీ పరిశ్రమకు లేదన్నారు. ఈ పరిస్థితుల్లో విజ్ఞాన కేంద్రాలు జ్ఞానపద కళారూపాలను పునరుజ్జీవించేసేందుకు కృషి చేస్తున్నాయన్నారు.  కలుషితం అవుతున్న సాంస్కృతిక రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం, విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంతోపాటు కొత్తగా ఏర్పాటైన అల్లూరి విజ్ఞాన కేంద్రాలపై ఉందన్నారు.


ప్రజలకు అన్నివిధాలుగా అందుబాటులో ఉంటూ వారి పురోగమనానికి, చైతన్యం నింపేలా కేంద్రాల నిర్వహణ జరగాలని పిలుపునిచ్చారు. ప్రజలు తమ జీతభత్యాల్లో అధిక మొత్తం విద్య, వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తోందని రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు.  సీపీఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం చైర్మన్‌ పి.మధు మాట్లాడుతూ ఉత్తమ సంప్రదాయానికి ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో అభ్యుదయ కృషి జరుగుతోందన్నారు. ఏజెన్సీలో విద్యార్థుల చర్యవ్యాధుల నివారణకు మందులు రప్పించడంలో అల్లూరి విజ్ఞాన కేంద్రం విశేషమైన సేవలందించిందని ప్రశంసించారు.


మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌.శర్మ మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీలో బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా వందేళ్ల కిందటే అల్లూరి ప్రయోగించిన మిరపకాయ టపా గురించి దేశం యావత్తు ఇప్పుడు ఎలా చెప్పుకుంటుందో, అల్లూరి విజ్ఞాన కేంద్రం గురించి వందేళ్ల తర్వాత అలాగే చెప్పుకునేలా కార్యకలాపాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఏయూ హాస్టల్‌ ఉద్యోగులు 15, 20 ఏళ్ల కిందట చేసిన పోరాటం ఫలితంగా అల్లూరి విజ్ఞాన కేంద్రం స్థాపనకు బీజం పడిందన్నారు. సభాధ్యక్షుడు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ అనేక మంది వ్యక్తులు, సంస్థలు ఆదరించబట్టే ఇంత భారీ భవన నిర్మాణం పూర్తిచేసుకోగలిగామన్నారు.


ఈ కేంద్రంలో సివిల్స్‌, గ్రూప్స్‌తోపాటు ఇతర ఉద్యోగాల పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్‌, విజయ్‌నిర్మాణ్‌ సంస్థ అధిపతి సూరపనేని విజయ్‌కుమార్‌, విశ్రాంత డీఎంఈ ఆర్‌.శశిప్రభ, పోర్టు ట్రస్ట్‌ మాజీ ఇంజనీర్‌ కె.స్వతంత్రకుమార్‌, ఏవీకే మాజీ ట్రస్టీ రెడ్డి వెంకటరావు, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.సురేంద్ర, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.ప్రభావతి, 78వ వార్డు కార్పొరేటర్‌ బి.గంగారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T05:46:04+05:30 IST