పేరుకే వికాసం.. అభివృద్ధి శూన్యం!

ABN , First Publish Date - 2022-07-01T05:35:14+05:30 IST

జిల్లాలో క్రీడా వికాసం మసకబారింది. ఇండోర్‌ స్టేడియాలకు ఈ ప్రభుత్వం వచ్చాక క్రీడా వికాస కేంద్రాలు (కేవీకే) అంటూ పేరు మార్చింది. ఆచరణలో ఆ మార్పు చూపించలేకపోయింది. ఆరు చోట్ల ఇండోర్‌ స్టేడియం నిర్మాణాలు ప్రారంభించగా ఒక్కటే కొలిక్కి వచ్చింది.

పేరుకే వికాసం.. అభివృద్ధి శూన్యం!
పునాది స్థాయిలో నిలిచిన ఇండోర్‌ స్టేడియం


ఎక్కడికక్కడే నిలిచిపోయిన క్రీడా వికాస కేంద్రాలు
బొబ్బిలిలో పునాది స్థాయి దాటని నిర్మాణం
నిరాశ చెందుతున్న క్రీడాకారులు
బొబ్బిలి, జూన్‌ 30:
జిల్లాలో క్రీడా వికాసం మసకబారింది. ఇండోర్‌ స్టేడియాలకు ఈ ప్రభుత్వం వచ్చాక క్రీడా వికాస కేంద్రాలు (కేవీకే) అంటూ పేరు మార్చింది. ఆచరణలో ఆ మార్పు చూపించలేకపోయింది. ఆరు చోట్ల ఇండోర్‌ స్టేడియం నిర్మాణాలు ప్రారంభించగా ఒక్కటే కొలిక్కి వచ్చింది. బొబ్బిలిలో అతీగతీ లేకుండా పోయింది. ఏళ్లు గడుస్తున్నా పునాది స్థాయి దాటలేదు.
బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐ సమీపంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీఈడబ్ల్యుఐడీసీకి చెందిన రూ.2 కోట్ల నిధులతో ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి అప్పట్లో శ్రీకారం చుట్టారు. సుమారు రూ.30 లక్షలు వెచ్చించి పునాదుల వరకు నిర్మించారు. అంతే ప్రభుత్వం మారడంతో నిర్మాణాలు ఆగిపోయాయి. ఈ ప్రభుత్వం వచ్చాక ఇండోర్‌ స్టేడియాలకు క్రీడా వికాస కేంద్రాలంటూ పేరైతే మార్చారు. అంతటితో వదిలేశారు.   కాంట్రాక్టర్‌కు బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు అంగుళమైనా కదలలేదు. పునాదులను గ్రావెల్‌తో నింపేందుకు కాంట్రాక్టరు స్థానికంగా ఉన్న మరో చిన్న కాంట్రాక్టరుతో సుమారు రెండున్నర లక్షల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మూడేళ్లు కావస్తున్నప్పటికీ గ్రావెల్‌కు సంబంధించిన సొమ్ములు అందలేన్న కోపంతో ఆ వ్యక్తి పునాదుల్లో నుంచి మట్టిని వెనక్కి తీసుకున్నారు. సబ్‌కాంట్రాక్టర్‌ మధ్యలోనే పని వదిలేసి వెళ్లిపోయాడు. ఇది గత ఏడాది అక్టోబర్‌లో జరిగింది. అప్పటి నుంచి అధికారులు వచ్చి పరిశీలిస్తుండడమే తప్ప,  పరిష్కారం ఏదీ చూపలేకపోయారు. ఇటీవల బొబ్బిలి వచ్చిన మంత్రి బొత్స బుడా నుంచి రెండు కోట్ల రూపాయల నిధులను ఇండోర్‌ స్టేడియం నిర్మాణం పూర్తి చేసేందుకు ఇస్తామని ప్రకటించారు.  కానీ నిధుల రాకపై క్రీడాకారులకు మాత్రం నమ్మకం లేదు.

ఉమ్మడి జిల్లాలో కేవీకే నిర్మాణాలిలా...
 బొబ్బిలిలో రూ.2కోట్ల శాప్‌ నిధులతో చేపట్టగా నేటికీ  పునాదుల స్ధాయి దాటలేదు.
 కొత్తవలసలో బీమ్‌ లెవెల్‌ వరకు నిర్మించి వదిలేశారు.
 నెలిమర్లలో రూఫ్‌లెవెల్‌ వరకూ చేపట్టి బిల్లు పెండింగ్‌లో పెట్టారు. దీంతో నిర్మాణం ఆగిపోయింది.
 గంట్యాడలో పంచాయతీరాజ్‌ శాఖ పిలిచిన టెండర్లు తాత్కాలికంగా నిలిపేశారు. స్థల వివాదం కొలిక్కి రాలేదు.
 గరివిడి మండలం కోడూరు కేవీకేను మాత్రమే నిర్మించి వీఎంఆర్‌డీఏకు అప్పగించారు.
 గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరిలో రూఫ్‌ లెవెల్‌ వరకే పనులు సాగి ఆగిపోయాయి.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతా
బొబ్బిలి స్టేడియంలో పునాదుల్లో నుంచి గ్రావెల్‌ తరలిస్తున్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.  దీనిపై పూర్తిగా అధ్యయనం చేసి నివేదిక అందజేస్తాను. బిల్లుల చెల్లింపులు లేక కాంట్రాక్టరు పనులు నిలిపివేసినట్లు తెలిసింది. కాంట్రాక్టు గడువు పెంచాలని ప్రభుత్వానికి కాంట్రాక్టరు  దరఖాస్తు చేసుకున్నారు.   ఇందుకు సూత్రప్రాయంగా అనుమతి వచ్చింది. బిల్లులు అందిన తరువాత  ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే సకాలంలో పనులు పూర్తి చేస్తానని కాంట్రాక్టరు చెబుతున్నారు.
                - శ్రీరామ్మూర్తి, ఏఈ, ఏపీఈడబ్ల్యుఏడీసీ


Updated Date - 2022-07-01T05:35:14+05:30 IST