ఆధ్యాత్మిక ఆహ్లాదం కలిగేలా తిరుమలలో పార్కుల అభివృద్ధి

ABN , First Publish Date - 2022-09-24T07:25:16+05:30 IST

తిరుమలలో భక్తులు అడుగుపెడుతూనే వారికి ఆధ్యాత్మిక ఆహ్లాదం కలిగేలా పార్కులు అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ఆధ్యాత్మిక ఆహ్లాదం కలిగేలా తిరుమలలో పార్కుల అభివృద్ధి
పార్కును ప్రారంభిస్తున్న వైవీ సుబ్బారెడ్డి

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1 పార్కు ప్రారంభోత్సవంలో టీటీడీ చైర్మన్‌ 


తిరుమల, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తులు అడుగుపెడుతూనే వారికి ఆధ్యాత్మిక ఆహ్లాదం కలిగేలా పార్కులు అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ఆనుకుని రూ.70 లక్షలతో పునర్నిర్మించిన పార్కును  ఈవో ధర్మారెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. వాటర్‌ ఫౌంటెన్‌ మధ్యలో శ్రీకృష్ణస్వామి విగ్రహం, గోవిందనామాలు, గోవులు, పాదాలతో ఈ పార్కును శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్లాస్టిక్‌ నిషేధాన్ని పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. అలాగే తిరుమలకు 50 విద్యుత్‌ బస్సులు నడిపేలా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఇందులో భాగంగా 27వ తేదీన 10 విద్యుత్‌ బస్సులను ఆయన ప్రారంభిస్తారన్నారు. మిగిలిన బస్సులు రెండు, మూడు నెలల్లోనే అందుబాటులోకి వస్తాయని వివరించారు. పార్కు పునర్నిర్మాణ దాత రవికుమార్‌, సీవీఎస్వో నరసింహకిషోర్‌, చీఫ్‌ ఇంజనీర్‌ నాగేశ్వరరావు, గార్డెన్‌ డిప్యూటీడైరెక్టర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సుబ్బారెడ్డి, ఈవో తిరుమలలోని నారాయణగిరి, స్పెషల్‌టైప్‌, జీఎన్సీ, గీతాపార్క్‌, పద్మావతి అతిథిగృహం పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. 

Updated Date - 2022-09-24T07:25:16+05:30 IST