కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై రాష్ట్ర అభివృద్ధి

ABN , First Publish Date - 2022-08-13T05:37:05+05:30 IST

కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపైనే రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉందని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ అన్నారు.

కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై రాష్ట్ర అభివృద్ధి
వేదికపై బీజేపీ నాయకులు

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌

కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఆగస్టు 12: కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపైనే రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉందని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ అన్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన యువ సంఘర్షణ బైక్‌ యాత్ర శుక్రవారం కర్నూలులో ముగిసింది. ఈ బైక్‌ యాత్ర కర్నూలు పాత నగరం జమ్మి చెట్టు నుంచి పాత బస్టాండు, కొండారెడ్డి బురుజు వరకు, అక్కడి నుంచి కల్లూరు చెన్నమ్మ సర్కిల్‌ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వేర్వేరు సభల్లో బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే రోడ్ల నిర్మాణాలు తప్ప.. రాష్ట్రంలో ఎలాంటి రోడ్డు పనులు జరగడం లేదన్నారు. జిల్లాలోని గుండ్రేవుల ప్రాజెక్టుపై జగన్‌ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. గురు రాఘవేంద్ర, వేదవతి ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉందన్నారు. ప్రచార ఆర్భాటాలు తప్ప రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదన్నారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్‌ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా కర్నూలు జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగులను దగా చేశారన్నారు. సాండ్‌, వైన్స్‌, మైన్స్‌, దోపిడీ కొనసాగుతుందన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ స్టిక్కర్‌ కింగ్‌ను ఇంటికి పంపాలని లేదంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని తెలిపారు. బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బైౖరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు చంద్రబాబు నాయుడు, జగన్‌ మోహన్‌ రెడ్డినే కారణమన్నారు. అభివృద్ధికి నిరోధకాలు, టీడీపీ, వైసీపీలే అన్నారు. బీజేపీలో కుల రాజకీయాలు లేవన్నారు. కర్నూలులో సర్వజన సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి అందరిని ఒకే వేదికపైకి తెచ్చి బీజేపీని బలోపేతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా.పార్థసారధి, బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్‌, జాతీయ కార్యదర్శి రోహిత్‌వాలా, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బైరెడ్డి శబరి, బీజేపీ సీనియర్‌ నాయకులు హరీ్‌షబాబు, రంగస్వామి, డా.వినీత్‌ రెడ్డి, ప్రభాకర్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాద్యక్షులు చంద్రమౌళి, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీవిశ్వనాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-13T05:37:05+05:30 IST