మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లో రూ.16కోట్లతో అభివృద్ధి పనులు

ABN , First Publish Date - 2021-01-24T07:33:33+05:30 IST

మీర్‌పేట్‌ కార్పొరేషన్‌ పరిధిలో అభివృద్ధి పనులకు రూ.16కోట్లు వెచ్చించనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి తెలిపారు.

మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లో రూ.16కోట్లతో అభివృద్ధి పనులు
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి


సరూర్‌నగర్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): మీర్‌పేట్‌ కార్పొరేషన్‌ పరిధిలో అభివృద్ధి పనులకు రూ.16కోట్లు వెచ్చించనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి తెలిపారు. శనివారం నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్టు ఆమె పేర్కొన్నారు. కౌన్సిల్‌ సమావేశం అనంతరం మేయర్‌ ఎం.దుర్గాదీ్‌పలాల్‌ చౌహాన్‌, డిప్యూటీ మేయర్‌ తీగల విక్రమ్‌రెడ్డితో కలిసి మంత్రి సబితారెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు. కార్పొరేషన్‌లోని దాదాపు అన్ని వార్డుల్లోనూ విద్యుత్‌ స్తంభాలు, వీధి లైట్ల సమస్య తీవ్రంగా ఉన్నట్టు సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారని, ఈ సమస్య పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించామని మంత్రి తెలిపారు. వీధి దీపాల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్‌ను బ్లాక్‌ లిస్టులో పెడుతూ తీర్మానం చేశారని పేర్కొన్నారు. కాలనీలు, బస్తీల్లో తాగునీటి సరఫరా నిమిత్తం అంతర్గత పైపులైన్‌ల నిర్మాణం చేపట్టనున్నామని, కనీసం రోజు విడిచి రోజు నీటి సరఫరా చేయాలనే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. చెరువుల సుందరీకరణ, ట్రంక్‌లైన్‌ నిర్మాణం, వరదముంపు నివారణకు భూగర్భ డ్రైనేజీ నిర్మాణం వంటి పలు అత్యవసర పనులకు కావాల్సిన నిధులను కేటాయిస్తూ తీర్మానం చేశారని పేర్కొన్నారు. సమావేశంలో కమిషనర్‌ సుమన్‌రావు, వివిధ విభాగాల అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.  

ఎంఎల్‌ఆర్‌కాలనీ రిజిస్ట్రేషన్‌ సమస్యను పరిష్కరిస్తా..
మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లోని మంత్రాలచెరువు ఎగువన గల ఎంఎల్‌ఆర్‌కాలనీలో నెలకొన్న రిజిస్ట్రేషన్‌ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి సబితారెడ్డి స్థానికులకు హామీ ఇచ్చారు. శనివారం టీఆర్‌ఎస్‌ బీసీ సెల్‌ అధ్యక్షుడు దిండు భూపేశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో కాలనీవాసులు మంత్రిని ఆమె నివాసంలో కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. మంత్రాలచెరువును రూ.కోటితో సుందరీకరిస్తున్నామని, చెరువు పక్కన రూ.35లక్షలతో పార్కు సైతం ఏర్పాటు చేయనున్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

Updated Date - 2021-01-24T07:33:33+05:30 IST