Devendra Fadnavis : ఆ పడవ ఆస్ట్రేలియన్లది

ABN , First Publish Date - 2022-08-19T00:58:44+05:30 IST

మహారాష్ట్ర (Maharashtra)లోని రాయ్‌గఢ్ (Raigadh) తీరానికి వచ్చిన అనుమానాస్పద

Devendra Fadnavis : ఆ పడవ ఆస్ట్రేలియన్లది

ముంబై : మహారాష్ట్ర (Maharashtra)లోని రాయ్‌గఢ్ (Raigadh) తీరానికి వచ్చిన అనుమానాస్పద పడవ ఆస్ట్రేలియన్లకు చెందినదని ప్రాథమిక సమాచారం. దీనిలో మూడు ఏకే-47 రైఫిళ్ళు, ఇతర ఆయుధాలు కనిపించడంతో ఇది ఉగ్రవాదులకు సంబంధించినదని ఆందోళన వ్యక్తమైంది. హుటాహుటిన పోలీసులు, యాంటీ టెర్రర్ స్క్వాడ్ సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు చెందిన బృందాన్ని కూడా పంపించింది. 


ఎన్‌సీపీ ఎమ్మెల్యే అదితి తత్కరే శాసన సభలో గురువారం అడిగిన ప్రశ్నకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఈ పడవ రాయ్‌గఢ్ తీరానికి వచ్చిందని చెప్పారు. ఓ ఆస్ట్రేలియన్ మహిళ ఈ పడవకు యజమానురాలని, ఆమె భర్త దీనికి కెప్టెన్ అని చెప్పారు. దీనిలో కొన్ని సెమీ ఆటోమేటిక్ ఆయుధాలను గుర్తించినట్లు చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. ప్రస్తుతానికి ఉగ్రవాద కోణం కనిపించలేదని, అయితే దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ప్రస్తుతానికి ఏ కోణాన్నీ తోసిపుచ్చలేమని చెప్పారు. ప్రస్తుతం తాను ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే పంచుకుంటున్నానని చెప్పారు. 


ఈ పడవ మస్కట్ నుంచి జూన్‌లో బయల్దేరిందని, అది యూరోప్ వెళ్తోందని చెప్పారు. ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో ఆ దంపతులు దానిని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లు తెలిపారు. ప్రాథమికంగా ఉగ్రవాద కోణం కనిపించకపోయినప్పటికీ, ఆయుధాలు ఎందుకు ఉన్నాయో స్పష్టంగా తెలియడం లేదన్నారు. 


ముంబై నుంచి 190 కిలోమీటర్ల దూరంలో ఈ పడవను స్థానికులు గురువారం గుర్తించి, భద్రతా సంస్థలకు సమాచారం ఇచ్చారు. 


Updated Date - 2022-08-19T00:58:44+05:30 IST