Advertisement

విచారణ అధికారులు దగ్గుతున్నారు: దేవినేని ఉమ

May 4 2021 @ 21:06PM

అమరావతి: మాజీ మంత్రి దేవేనేని ఉమ మూడో రోజు సీఐడీ విచారణ పూర్తి అయింది. ఆయనను 9 గంటల పాటు విచారించారు. మళ్లీ విచారణకు హాజరుకావాలని దేవినేనికి అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. సీఐడీ విచారణ తర్వాత దేవినేని ఉమ మాట్లాడుతూ ‘‘జగన్మోహన్ రెడ్డివి పిల్ల చేష్టలు. నన్ను విచారణ జరుపుతున్న అధికారులు కొంత మంది దగ్గుతున్నారు... ఏంటీ పైశాచిక ఆనందం. పనికిమాలిన కేసు పెట్టి ఇబ్బందులు గురిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ పక్కన పడేసి టీడీపీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. అంబేద్కర్ రాజ్యాగంలో మార్ఫింగ్ సెక్షన్ లేదు.... రాజారెడ్డి రాజ్యాంగంలో ఉంటాయి. న్యాయస్థానంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేస్తాం’’ అని చెప్పారు. 


 

దేవినేని ఇంకా మాట్లాడుతూ 2012 మే 24, 27 తేదీల్లో జగన్‌ను సీబీఐ అధికారులు 24 గంటలు విచారించారని గుర్తు చేశారు. జగన్ కుటుంబ సభ్యులు, అనుచరులు ఆ రోజు శోకాలు పెట్టారని చెప్పారు. ‘‘300 మంది పోలీసులను, 100 ఆఫీసర్లను నాపై విచారణ‌కు పెట్టారు. పనికిమాలిన కేసులో 27 గంటలు కూర్చోబెట్టారు. ధూళిపాళ్లపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. తప్పుడు కేసులకు భయపడం. తిరుపతిలో 5 లక్షల అన్నారు చచ్చిబతికి 2.7‌లక్షలతో గెలిచారు. దమ్ము ధైర్యం ఉంటే ప్రజలకు వ్యాక్సిన్ వేయించాలి. రైతులకు న్యాయం చేయలేని ఎమ్మెల్యే‌లు, మంత్రులు గడ్డి పీకుతున్నారా?. ఈ నెల 7న హైకోర్టులో విచారణ ఉంది. నేను చచ్చే వరకూ ఇలానే మాట్లాడతా. నన్నేమీ చేయలేరు. భయపడం. మూడు రోజుల పాటు రోజుకు తొమ్మిది గంటల పాటు విచారణ చేశారు.’’ అని దేవినేని ఉమ మండిపడ్డారు. 


కరోనా రాష్ట్రంలో విలయతాండవం చేస్తుంటే తమపై తప్పుడు కేసులు పెట్టి విచారణ చేపట్టారని దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన రాజ్యం మేలుతుందన్నారు. అన్ని చెప్పినప్పటికీ కావాలని రోజుల తరబడి విచారణకు పిలిచి ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ ధూళిపాళ్ల నరేంద్రకు, సంగం డెయిరీ ఎండీని అస్వస్థతకు గురి చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించాలని సూచించారు. మూడు జాతీయ పార్టీలు చేసిన పనికి రాష్ట్రం బలైపోయిందని దేవినేని ఉమ అన్నారు.  


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.