దేవిరెడ్డిదే కీలకపాత్ర

ABN , First Publish Date - 2022-06-28T07:58:37+05:30 IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు ప్రణాళిక నుంచి హత్య తర్వాత ఆధారాలు ధ్వంసం చేసే వరకు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి(ఏ5) కీలకపాత్ర

దేవిరెడ్డిదే కీలకపాత్ర

  • హత్య ప్రణాళిక నుంచి ఆధారాల ధ్వంసం వరకూ ఆయనే
  • అవినాశ్‌ రెడ్డి, దేవిరెడ్డి తనకు రెండు కళ్లని సీఎం చెప్పారు
  • ఆ విషయాన్ని డీజీపీయే వివేకా కుమార్తెకు తెలిపారు
  • అధికార యంత్రాంగమంతా వారి కనుసన్నల్లో నడుస్తోంది
  • జైల్లో ఉంటూనే సాక్షులను ప్రభావితం చేస్తున్న దేవిరెడ్డి
  • సాక్షులను ప్రభావితం చేసేలా పెద్ద పెద్ద ఫ్లెక్సీలూ ఏర్పాటు
  • విచారణ పూర్తయ్యే వరకు బెయిల్‌ మంజూరు చేయొద్దు
  • హైకోర్టులో వివేకా కుమార్తె తరఫు న్యాయవాది వాదనలు


అమరావతి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు ప్రణాళిక నుంచి హత్య తర్వాత ఆధారాలు ధ్వంసం చేసే వరకు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి(ఏ5) కీలకపాత్ర పోషించారని వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు. మొదటి బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన తరువాత పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ(ఛేంజ్‌ ఆఫ్‌ సర్కమ్‌స్టెన్స్‌) లేదని తెలిపారు. చార్జిషీట్‌ దాఖలు చేయడాన్ని పరిస్థితుల్లో మార్పుగా పరిగణించడానికి వీల్లేదన్నారు. విచారణను వేగవంతం చేయాలంటూ వివేకా కుమార్తె సునీత డీజీపీని కలిసిన సందర్భంలో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి తనకు రెండు కళ్లు లాంటి వారని సీఎం చెప్పినట్లు అప్పటి డీజీపీ తెలిపారన్నారు. ఆ విషయాన్ని సునీత 164 స్టేట్‌మెంట్‌లో చెప్పారన్నారు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రాజకీయపార్టీలో దేవిరెడ్డి ఇప్పటికీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారని, అధికార యంత్రాంగం మొత్తం ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తోందని తెలిపారు. పోలీసుల సహకారం లేకుండా దర్యాప్తు ముగించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దేవిరెడ్డికి బెయిల్‌ మంజూరు చేస్తే అధికారులను, సాక్షులను ప్రభావితం చేస్తారని, విచారణ ముగిసేవరకు అతనికి బెయిల్‌ మంజూరు చేయవద్దని అభ్యర్థించారు. సోమవారం జరిగిన విచారణలో వివేకా కుమార్తె సునీత తరఫు వాదనలతో పాటు దేవిరెడ్డి రిప్లై వాదనలు ముగియడంతో బెయిల్‌ కోసం ఇతర నిందితులు దాఖలు చేసిన వ్యాజ్యాలలో వాదనలు వినేందుకు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.


విచారణ ముగిసే వరకు బెయిల్‌ ఇవ్వొద్దు..

వివేకా హత్య కేసులో సునీల్‌ యాదవ్‌(ఏ2), గజ్జల ఉమాశంకర్‌రెడ్డి(ఏ3), డి.శివశంకర్‌రెడ్డి(ఏ5)లను సీబీఐ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. సీబీఐ దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్‌ ఇవ్వలేమంటూ వీరి బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు గతంలో కొట్టివేయగా, తాజాగా మరోసారి వారు బెయిల్‌ కోసం పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలు సోమవారం మరోసారి విచారణకు వ చ్చాయి. వివేకా కుమార్తె సునీత తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ ‘కేసు దర్యాప్తును సీబీఐ స్వీకరించకముందే ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి దిగువ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అప్పట్లో పోలీసు యంత్రాంగం చార్జిషీట్‌ దాఖలు చేయడంలో విఫలమవ్వడంతో బెయిల్‌ లభించింది. ఏ1 గంగిరెడ్డి బెయిల్‌పై ఉన్నాడనే కారణంతో తనకూ బెయిల్‌ ఇవ్వాలని పిటిషనర్‌ కోరడానికి వీల్లేదు. హత్యకు ప్రణాళిక రచించే దగ్గర నుంచి హత్య తర్వాత ఆధారాలు ధ్వంసం చేసే వరకు దేవిరెడ్డి కీలకపాత్ర పోషించారు. బెడ్‌ రూమ్‌లో రక్తాన్ని శుభ్రం చేయాలని పనిమనిషిపై ఒత్తిడి చేశారు. 


కాంపౌండర్‌ను పిలిపించి మృతదేహంపై గాయాలు కనపడకుండా కట్లు కట్టించారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేశారు. పోస్టుమార్టం చేయకుండా ఆలస్యం చేశారు. కేసు నమోదు చేయవద్దని పోలీసులపై ఒత్తిడి చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు పంచనామా నిర్వహించలేదు. పిటిషనర్‌ ఒత్తిడి కారణంగానే వివేకాది అనుమానాస్పద మృతిగా ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. పిటిషనర్‌కి దురుద్దేశం లేకపోతే హత్య జరిగినట్లు ముందే పోలీసులకు సమాచారం ఇచ్చేవారు. బెయిల్‌పై బయటకు వస్తే, దర్యాప్తు ముందుకు సాగదు. సాక్షులను ప్రభావితం చేస్తారు. పిటిషనర్‌ ఈ ఏడాది మే 26న తాత్కాలిక బెయిల్‌పై బయటకు వచ్చిన సందర్భంగా సాక్షులను ప్రభావితం చేసేలా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున రాజకీయ నాయకులూ అతన్ని కలిశారు. ఓ ఇన్‌స్పెక్టర్‌ కూడా అతనితో భేటీ అయ్యారు. ఆ తరువాత నాలుగు రోజులకే దస్తగిరి(ఏ4)పై కేసు నమోదు చేశారు. సీబీఐ తనను వేధిస్తోందంటూ ఉదయకుమార్‌ రెడ్డి దర్యాప్తు అధికారిపై కేసు పెట్టారు. ఉదయకుమార్‌ రెడ్డి, దేవిరెడ్డి, ఎంపీ అవినాశ్‌రెడ్డి ముగ్గురూ మిత్రులు. అవినాశ్‌రెడ్డి, ఉదయకుమార్‌ రెడ్డిది ఒకే గ్రామం. పిటిషనర్‌ దేవిరెడ్డికి క్రిమినల్‌ రికార్డు ఉంది. అతనిపై మొత్తం 31 కేసులు ఉన్నాయి. వాటిలో 302, 301, 354 వంటి తీవ్రమైన నేరారోపణలు కూడా ఉన్నాయి. ఫిజియోథెరపీ పేరుతో పిటిషనర్‌ తరచూ బయట ఆసుపత్రికి వస్తున్నాడు. వాంగ్మూలం ఇచ్చేందుకు ముందుకు వచ్చినవారు కూడా తరువాత సీబీఐకి సహకరించడం లేదు. చార్జిషీట్‌ దాఖలు చేయడాన్ని చేంజ్‌ ఆఫ్‌ సర్కమ్‌స్టెన్స్‌గా పరిగణించడానికి వీల్లేదు. ట్రయల్‌ ముగిసేవరకు దేవిరెడ్డికి బెయిల్‌ మంజూరు చేయవద్దు’ అని అభ్యర్థించారు.


దేవిరెడ్డి తరఫు న్యాయవాది వాదన ఇదీ..

దేవిరెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.... ‘దర్యాప్తులో స్థానిక యంత్రాంగం సహకరించకపోతే సీబీఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చి తగిన ఆదేశాల కోసం ప్రయత్నించాలి. బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా ఆ విషయాన్ని లేవనెత్తడానికి వీల్లేదు. దస్తగిరి వాంగ్మూలం తప్ప పిటిషనర్‌కు హత్యలో భాగస్వామ్యం ఉన్నట్లు ఎలాంటి ఆధారమూ లేదు. ఆయనపై 5 కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. దేవిరెడ్డి గత ఆరున్నర నెలలుగా జ్యుడీషియల్‌ కస్టడీలోనే ఉన్నారు. సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో అతను బెయిల్‌కు అర్హుడు’ అని రిప్లై వాదనలు వినిపించారు. సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి వాదనల కోసం న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.

Updated Date - 2022-06-28T07:58:37+05:30 IST