
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టి దాదాపు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో దుర్గామల్లేశ్వరస్వామి దర్శన వేళలను మళ్లీ యథావిధిగా మార్చేశారు. దాదాపు నెల రోజులుగా ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీసంఖ్యలో భక్తులు జగన్మాత దర్శనానికి తరలివస్తున్నారు. సాధారణ రోజుల్లో 20 నుంచి 30 వేల మంది వరకు అమ్మవారి దర్శనానికి తరలివస్తుండగా.. వారంతాలు, సెలవు రోజుల్లో 30 నుంచి 50 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. తెల్లవారు జాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. ఆలయంలో ప్రతిరోజూ నిర్వహించే నిత్య ఆర్జిత సేవలకూ డిమాండ్ పెరిగింది. ఖడ్గమాలార్చన, చండీ హోమం, లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవావరణార్చన, శాంతి కళ్యాణం తదితర పూజల్లో పాల్గొనే భక్తులు సాధారణ రోజుల కంటే రెట్టింపు సంఖ్యలో ఉంటున్నపుడు ఆర్జిత సేవలను రెండేసి విడతలుగా నిర్వహిస్తున్నారు.