
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు గురువారం పెదసంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రావతరణ సందర్భంగా సెలవు రోజు కావడంతో ఇష్టదైవాలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ప్రధానాలయ పరిసరాలు, ఆర్జిత సేవా మండపాలు, తిరువీధుల్లో యాత్రాజనులతో రద్దీ ఏర్పడింది. స్వామికి నిత్యపూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరిగాయి. వేకువజామున స్వామివారికి అభిషేకం, అర్చనలు, అష్టభుజి ప్రాకార మండపంలో హోమ పూజలు, నిత్య కల్యాణోత్సవం, సాయంత్రం వేళ అలంకార సేవలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. స్వామి సన్నిధిలో నిర్వహించిన ఆర్జిత సేవోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ విభాగాల ద్వారా రూ.30,03,149 ఆదాయం ఆలయ ఖజానాకు సమకూరింది.