‘మూఢ’ పీడ!

ABN , First Publish Date - 2021-02-25T05:48:27+05:30 IST

‘మూఢ’ పీడ!

‘మూఢ’ పీడ!
నిర్మానుష్యంగా మారిన బేడ బుడగ జంగాల కాలనీ

వరుస మర ణాలతో భీతిల్లిపోతున్న పోతారం గ్రామస్థులు

చేతబడి భయంతో తరలివెళ్లిన 40 కుటుంబాలు

ఖాళీ అయిన బుడగజంగాల కాలనీ


తరిగొప్పుల, ఫిబ్రవరి 24: మనిషి సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా ఇంకా పల్లెల్లో మూఢవిశ్వాసాలు పోవట్లేదు. చేతబడులు, దెయ్యాలు ఉన్నాయని ఇప్పటికీ నమ్ముతూనే ఉన్నారు. ఇదే భయంతో జనగామ జిల్లాలో ఓ కాలనీ మొత్తం ఖాళీ అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. 


జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని పోతారం గ్రామంలో బేడ బుడగ జంగాల కాలనీకి చెందిన చింతల భాను, చింతల బాలరాజు అనే ఇద్దరు అన్నదమ్ములు గతేడాది అక్టోబరు నెలలో అమావాస్యకు ముందు మొదటి గురువారం ఒకరు మృతిచెందగా, రెండో గురువారం మరొకరు మరణించారు. దీనికి తోడు ఇటీవల అదే కాలనీకి చెందిన గంథం రాజు అనే యువకుడు అమావాస్యకు ముందు గురువారం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు.


వాస్తవానికి మొదటి ఇద్దరిలో ఒకరు మూర్ఛవ్యాధితో మృతిచెందగా మరొకరు అనారోగ్యంతో మృతిచెందారు. కానీ ఈ ముగ్గురి మరణాలకు ఓ మహిళ చేతబడితో సృష్టించిన దెయ్యమే కారణమని కాలనీవాసులు బలంగా నమ్ముతున్నారు. దీంతో ఇక్కడే ఉంటే ఆ దెయ్యం అందరినీ చంపేస్తుందన్న భయంతో ఒక్కొక్కరుగా మొత్తం 40 కుటుంబాలు వలసబాట పట్టడంతో కాలనీ మొత్తం ఖాళీ అయింది. వీరంతా తరిగొప్పులలో ఇప్పుడిప్పుడే తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. 


ఓ మహిళపై అనుమానం

పోతారంకు చెందిన ఓ మహిళ తన క్షుద్రశక్తితో ఓ గ్రహ (దెయ్యం)ను తయారు చేసిందని, అది కాలనీలో ని ఓ పాత బంగ్లాలో ఉంటూ రాత్రిళ్లు నెత్తిన బోనం ఎ త్తుకుని నగ్నంగా  తిరుగుతోందని వదంతులు మొదలయ్యాయి. దెయ్యం నీడపడినందుకే ఆ ముగ్గురు యువకులు మృతిచెందారని కాలనీ అంతా విశ్వసిస్తోంది. 




పిల్లలు సచ్చాక మేమెందుకు..

చింతల లక్ష్మి-భీష్మ, కాలనీవాసులు

రెండు మూడు నెలలుగా కాలనీలో చేతికొచ్చిన కొడుకులు అ కారణంగా సచ్చిపోతున్నారు. రాత్రివేళ్లలో కాలనీలోని పాడువడ్డ ఇంటి పరిసరాల్లో ఓ మహిళ నెత్తిన బోనం ఎత్తుకుని నగ్నంగా నృత్యం చేస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. అలా దెయ్యం కనిపించిన ప్రతీ యువకుడు వారం తిరుగకముందే సచ్చి పోతున్నాడు. మా పిల్లలను కాపాడుకునేందుకే ఆస్తులు వదులుకొని తరిగొప్పుల గ్రామానికి వలస పోతున్నాము. అక్కడే నివాసం ఉంటూ రోజూ వచ్చి వ్యవసాయ పనులు చూసుకుంటాం. 


కోడిగుడ్లు, నిమ్మకాయలు తిప్పేస్తున్నారు.. 

గంథం శేఖర్‌, కాలనీవాసి

కాలనీలో  రోడ్ల వెంబడి కోడిగుడ్లు, నిమ్మకాయలు, పసుపు తీప్పేస్తున్నారు. రాత్రి సమయంలో పాడుబడ్డ బంగ్లా దగ్గర భయంకరంగా వింత శబ్ధాలు చేస్తున్నారు. అది చూసిన వారిలో కేవలం యువకులు మాత్రమే చనిపోతున్నారు. చనిపోయిన వారిలో అందరూ ఆరోగ్యవంతులే.. ఎలాంటి వ్యాధులు లేవు. అయినా అకారణంగా చనిపోతున్నారు. అందుకే భయమేసి ఊరు వదిలి మండల కేంద్రానికి పోయి గుడిసెలు వేసుకున్నాం. ఏదైనా సమస్య వస్తుందని ముందు జాగ్రత్త పడ్డాం. 


అవగాహన సదస్సులు నిర్వహించాం : ఎండబట్ల అంజమ్మ, సర్పంచ్‌, పోతారం

మూఢనమ్మకాలపై గతంలోనే కాలనీలో పోలీసుల ఆధ్వర్యంలో కళాజాత నిర్వహించాం. మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాం. మంత్రాలను, చేతబడులను నమ్మొద్దని ప్రచారం చేయించాం. కావాలంటే వారు నివాసం ఉండేందుకు గ్రామంలో మరోచోట స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చాం. అయినా  ప్రయోజనం లేకుండా పోయింది. వారు తిరిగి గ్రామానికి వస్తే అన్ని విధాలుగా సహకరిస్తాం. మరోసారి అవగాహన సైతం కల్పిస్తాం. 

Updated Date - 2021-02-25T05:48:27+05:30 IST