రెండుసార్లు కరోనాపై గెలిచిన డీజీఎం అనుభవాలు..

ABN , First Publish Date - 2021-06-13T15:55:37+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో అప్పుడప్పుడే కరోనా వైరస్‌ విస్తరిస్తోంది. కరోనాపై అంతగా అవగాహన లేనప్పుడే మొదటిసారి సోకింది.

రెండుసార్లు కరోనాపై గెలిచిన డీజీఎం అనుభవాలు..

  • రెండు సార్లు కరోనా వచ్చింది
  • పౌష్టికాహారం తీసుకున్నా 
  • ఆధ్యాత్మికత చింతనలో గడిపా
  • ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యులు వీడియో కాల్స్‌లో ధైర్యం చెప్పారు
  • బోట్స్‌క్లబ్‌ సబ్‌ డివిజన్‌ రిజర్వాయర్‌ డీజీఎం చంద్రశేఖర్‌

తెలంగాణ రాష్ట్రంలో అప్పుడప్పుడే కరోనా వైరస్‌ విస్తరిస్తోంది. కరోనాపై అంతగా అవగాహన లేనప్పుడే మొదటిసారి సోకింది. తీవ్రంగా భయం వేసింది. వెంటనే వైద్యులను కలిసి మందులు వాడాను. తగ్గిపోయింది. మళ్లీ వైరస్‌ సోకింది. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో అడ్మిటై చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూ  వార్డులో చేర్చారు. 14 రోజులు ఆస్పత్రిలోనే ఉండి వైద్యులిచ్చే మందులు, ఆహారం తీసుకుని రెండోసారి కూడా కరోనాను జయించానని బోట్స్‌క్లబ్‌ సబ్‌ డివిజన్‌ రిజర్వాయర్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (డీజీఎం) జి.చంద్రశేఖర్‌ తెలిపారు.  ఆయన  అనుభవాలు ఆయన మాటల్లోనే...


హైదరాబాద్ సిటీ/ముషీరాబాద్ : ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని దోమలగూడలోని బోట్స్‌క్లబ్‌ సబ్‌ డివిజన్‌ రిజర్వాయర్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా జి.చంద్రశేఖర్‌ (42) విధులు నిర్వహిస్తున్నారు. కూకట్‌పల్లిలో భార్య తన కుమారుడితో నివసిస్తున్నారు. కరోనా రావడానికి ముందు, వచ్చిన తర్వాత పరిస్థితులను ఆయన ఇలా వివరించారు. భోలక్‌పూర్‌లో కలుషిత నీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి మంజూరైన రూ.23 కోట్లతో పైప్‌లైన్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రతి రోజూ ఉదయమే వచ్చి రాత్రి వరకు దగ్గరుండి పనులు చేయించేవాళ్లం. 


కరోనా రాకుండా మాస్క్‌లు, గ్లౌజ్‌లు ధరించే వాడిని. కేవలం భోజనం, టీ, వాటర్‌ తాగేటప్పుడు మాత్రమే వాటిని తొలగించేవాడిని. కార్మికులతో నిత్యం టచ్‌లో ఉండడం వల్ల గత సంవత్సరం మొదటి సారి జూన్‌ 10న అనారోగ్యానికి గురయ్యాను. మొదట ఒంటి నొప్పులు, తలనొప్పి వచ్చింది. తగ్గిపోతుందిలే అనుకున్నా. కానీ శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారడంతో ఆస్పత్రిలో చూయించుకున్నా. వారు స్కానింగ్‌ చేసి చెస్ట్‌లో సమస్యగా ఉందని చెప్పారు. వెంటనే ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటే కరోనా అని తేలింది. డాక్టర్ల సూచనలతో ఇంటికి వచ్చి ఒక గదిలో హోంక్వారంటైన్‌లో 14 రోజులు ఉన్నాను. డాక్టర్‌ ఇచ్చిన మందులు వాడుతూ వారి సూచనలు పాటిస్తూ పౌష్టికాహారం తీ సుకున్నా. ఆ 14 రోజులు ఇంట్లోనే ఒంటరిగా ఉంటూ వ్యాయామం చేసేవాడిని. మరోసారి వైద్య పరీక్షలు చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది. 10 రోజులు రెస్ట్‌ తీసుకుని మళ్లీ విధులకు హాజరయ్యాను.


మరోసారి దాడి..!!

ఈ సంవత్సరం మార్చి 31న మరోసారి జ్వరం వచ్చింది. ఒంటి నొప్పులు రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. మళ్లీ కరోనా సోకిందా అని తీవ్రంగా భయపడ్డా. వెంటనే కూకట్‌పల్లిలోని ఓ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో కరోనా టెస్టులు చేయించుకున్నాను. రిపోర్టుల కోసం భయంభయంగానే ఎదురుచూశా. పాజిటివ్‌ వచ్చిందని ఫోన్‌లో మెసేజ్‌ వచ్చింది. హోంక్వారంటైన్‌లో ఉండేందుకు డాక్టర్లు ఇచ్చిన మందులు తీసుకుని ఇంటికి వెళ్లాను. కానీ మరుసటి రోజు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యాను. చికిత్స పొందుతున్న క్రమంలో జ్వరం, ఒంటి నొప్పులు తగ్గకపోవడంతో ఐసీయూ వార్డులో రెండు రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచారు. కొంత ఆరోగ్యం కుదుటపడగానే తిరిగి ఇతరు వార్డులోకి తరలించారు. అయిదు రోజుల తర్వాత మళ్లీ టెస్టులు చేయించగా పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. డాక్టర్ల సూచనల మేరకు రెమిడిసివర్‌ ఇంజక్షన్‌ తీసుకున్నా. అనంతరం కోలుకోవడంతో 14 రోజులు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందాను. పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్‌ చేశారు. రూ.8 లక్షల బిల్లు అయిందని ఆస్పత్రి వైద్య సిబ్బంది తెలిపారు. ఇన్సూరెన్స్‌ ఉండడం వల్లనే రూపాయి కూడా చెల్లించకుండా బయటకు వచ్చాను. 


రెండు సార్లు సోకినప్పటికీ..

రెండు సార్లు కరోనా సోకినప్పటికీ మనోధైర్యంతో జయించాను. కరోనా అని ఆలోచించకుండా ఎలాగైనా కోలుకోవాలని దృఢనిశ్చయంతో డాక్టర్లు చెప్పిన సూచనలు, సలహాలు పాటించా. దేవుడి దయ, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మళ్లీ 25 రోజుల నుంచి విధులకు హాజరవుతున్నా. విధులకు హాజరయ్యే ముందు తప్పనిసరి మాస్క్‌లు, ఫేస్‌షీల్డ్‌, గ్లౌజ్‌లు ధరిస్తున్నా. ఏ రోజుకు ఆ రోజు కొత్తవి వాడుతున్నా. భోలక్‌పూర్‌లో విధులు నిర్వహిస్తున్న సందర్భంలో స్థానిక ప్రజలు, నాయకులు అప్యాయంగా పలుకరిస్తూ ఆరోగ్యం ఎలా ఉంది, మందులు వాడుతున్నారా అని అడుగుతున్నారు. వారి ఆప్యాయతతో నాకు సంతోషం కలిగింది.


ఆస్పత్రిలోనే ప్రాణాయామం, వాకింగ్‌..

ఆస్పత్రిలో ఉన్న 14 రోజులు వాకింగ్‌, ప్రాణాయామం చేశాను. కుటుంబ సభ్యుల సూచన మేరకు సెల్‌ఫోన్‌లో శ్రీవల్లభస్వామి, భక్తి భావం వీడియోలు ఎక్కువగా చూశాను. రెండు సార్లు ఆవిరి పట్టడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు రోజూ డ్రైఫూట్స్‌, చికెన్‌, ఫిష్‌, గుడ్లు, ఫ్రూట్‌ జ్యూస్‌ తీసుకున్నాను.


ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యులు వీడియో కాల్స్‌..

కరోనా సోకిన విషయాన్ని జలమండలి ఉన్నతాధికారులకు సూచించడంతో వారు తనకు ధైర్యం చెప్పి జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంలో జలమండలి జీఎం సంతో్‌షకుమార్‌, ఇంజనీరింగ్‌ సెక్షన్‌ ఉన్నతాధికారి రాజశేఖర్‌ వీడియో కాల్‌లో మాట్లాడారు. తాము కూడా కరోనా నుంచి కోలుకున్నామని, ఆధైర్య పడవద్దని సూచించారు. తోటి ఉద్యోగులు నిత్యం వీడియో కాల్‌లో మాట్లాడుతూ ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులు నా భార్య చర్మీష, కుమారుడు దేవాన్ష్‌ సహితం వీడియో కాల్‌ చేసి మాట్లాడేవారు. కుటుంబ సభ్యులు, డాక్టర్లు ప్రతి రోజూ మధ్యాహ్నం జూమ్‌ యాప్‌లో మాట్లాడేవారు. కుటుంబ సభ్యులకు వచ్చే సందేహాలను డాక్టర్లు సమాధానం చెప్పేవారు. నా వద్దకు కుటుంబ సభ్యులు వచ్చేందుకు అనుమతి లేనప్పటికీ జూమ్‌ యాప్‌లో మాట్లాడడం వల్ల కొంత రిలాక్స్‌ అయ్యేవాడిని. వారితో ఫోన్‌లో మాట్లాడుతున్నప్పటికీ వారు నా వద్ద లేరనే బాధ ఉండేది. 

Updated Date - 2021-06-13T15:55:37+05:30 IST