
- డీజీపీ శైలేంద్రబాబు ప్రకటన
చెన్నై: విధినిర్వహణలో అలసిపోయే పోలీసులకు మానసికోల్లాసాన్ని కలిగించే దిశగా రూ.10 కోట్లతో కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు డీజేపీ శైలేంద్రబాబు ప్రకటించారు. మంగళవారం ఉదయం పుదుపేట సాయుధదళం ప్రాంగణంలో పోలీసు కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనర్ శంకర్ జివాల్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ శైలేంద్రబాబు మాట్లాడుతూ పోలీసుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని, పోలీసులకు వారాంతపు సెలవును ప్రకటించిందని తెలిపారు. కొత్త సూపర్‌మార్కెట్ పోలీసు కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ మార్కెట్‌లోని నిత్యావసర వస్తువులన్నీ మార్కెట్ రేటు కంటే తక్కువగా ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలో విధినిర్వహణలో పోలీసులు అలసట చెందుతుంటారని, అదే సమయంలో పలువురు మానసిక ఒత్తిడికి గురై మృతి చెందుతుంటారని తెలిపారు. ఏడాదికి సుమారు 250 మంది పోలీసులు మానసిక ఒత్తిళ్ళ కారణంగా మృతి చెందుతున్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని చెప్పారు. ఈ పరిస్థితులలో పోలీసులకు మానసికోల్లాసాన్ని పెంచేదిశగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.10కోట్లతో కొత్త పథకాన్ని అమలు చేయనున్నామని తెలిపారు. ఈ పథకంలో భాగంగా పోలీసులకు సునిశిత శిక్షణ అందిస్తామన్నారు. సుమారు 1.13 లక్షల మంది పోలీసులు ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారని డీజీపీ వివరించారు.
ఇవి కూడా చదవండి