ధనాధన్‌ దందా!

ABN , First Publish Date - 2022-08-03T08:23:13+05:30 IST

ధనాధన్‌ దందా!

ధనాధన్‌ దందా!

ఆ అధికారి ఓ అవినీతి గని

‘ల్యాండ్‌ సెటిల్‌మెంట్లే’ కీలకం

సొంత మనుషులకు పోస్టింగ్‌లు

వారి ద్వారానే లావాదేవీలు పూర్తి

అవినీతి సొమ్ముతో భూముల కొనుగోళ్లు

విశాఖ చుట్టూ 47 ఎకరాలు సొంతం

వాటి విలువ రూ.400 కోట్లకు పైనే

మంగళగిరిలో మరో 300 కోట్ల భూమి

సొంత ప్రాంతంలో 80 ఎకరాలు 

భార్య, బామ్మర్ది ప్లానింగ్‌తో పక్కా ఆచరణ

‘ఆంధ్రజ్యోతి’ కథనంతో సంచలనం


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

కేడర్‌లో అనేకమంది ఐఏఎస్‌ల కంటే జూనియర్‌! కానీ... అందరికంటే ఎక్కువ పవర్‌! ప్రభుత్వ పెద్దల అండతో ‘వసూల్‌ రాజా’గా మారిన ఆ కీలక అధికారి అవినీతి గని తవ్వేకొద్దీ బయటపడుతోంది. ఆయన అవినీతి బాగోతంపై మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ప్రత్యేక కథనం సామాన్యులు, సీనియర్‌ బ్యూరోక్రాట్లు, రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. బిల్లుల చెల్లింపుల్లో కమీషన్లు, పోస్టింగుల్లో వసూళ్లు భారీగా ఉండగా... భూముల సెటిల్‌మెంట్లు ‘లెక్క’లేనన్ని ఉన్నట్లు తెలిసింది. ఇలా అడ్డగోలుగా పోగేసుకున్న సంపదతో విశాఖ అవతల భోగాపురం నుంచి రాయలసీమలోని సొంత జిల్లా వరకు... భారీ స్థాయిలో భూములు కొన్నట్లు సమాచారం. మంగళగిరి, విశాఖ, భీమిలిలో భారీగా భూములు కొనుగోలు చేశారని... తన సొంత ప్రాంతమైన రాయలసీమలో కొత్తగా జిల్లా కేంద్రమైన పట్టణం చుట్టూ 80 ఎకరాలు కొని ల్యాండ్‌బ్యాంక్‌ ఏర్పాటు చేసుకున్నారని విశ్వసనీయంగా తెలిసింది. భూముల పంచాయితీలను దృష్టిలో పెట్టుకునే ఆయన కీలక పోస్టింగ్‌లు ఇచ్చారని... ‘సెటిల్‌మెంట్లు’ సక్సెస్‌ చేసిన వారికి ఊహించనివిధంగా మరిన్ని ముఖ్యమైన పోస్టింగ్‌లు ఇచ్చారని అధికారవర్గాల్లో చర్చసాగుతోంది.


అడ్డగోలు దందాలు...: విశాఖలో భూ అక్రమాలపై గత ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్‌ నివేదికను నాటి చంద్రబాబు మంత్రివర్గం ఆమోదించింది కూడా! అయితే...  ఈ ప్రభుత్వం వచ్చాక మరో సిట్‌ను నియమించింది. అదే సమయంలో... ముఖ్యనేత వద్ద పనిచేస్తున్న ఈ అధికారి... తన అధికారాన్ని అడ్డంపెట్టుకొని భారీగా లబ్ధి పొందినట్లు తెలిసింది. విశాఖ కేంద్రంగానే భూ వ్యవహారాలు నడిపించారని సమాచారం. దీనికోసం అర్హతలతో సంబంధం లేకుండా... కోస్తా జిల్లాలో ఉన్న తన నమ్మిన బంటుకు విశాఖలో కీలకమైన పోస్టింగ్‌ ఇప్పించారు. సిట్‌ పరిశీలనకు వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణల్లో ముఖ్యమైన వాటిపై ఫోకస్‌ పెట్టి సెటిల్‌మెంట్‌ చేశారు. అలా పోగేసుకున్న డబ్బులతో విశాఖ చుట్టూ మూడు చోట్ల 47 ఎకరాలు కొన్నట్లు తెలిసింది. భీమిలిలో 5 ఎకరాలు, ఎండాడ ప్రాంతంలో నాలుగు ఎకరాలు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 38 ఎకరాలు కొన్నట్లు తెలిసింది. ఈ లావాదేవీలన్నీ తన సమీప బంధువు పేరిట జరిగాయి. ఈ 47 ఎకరాల విలువ కనీసం 400 కోట్ల రూపాయలకు పైమాటే అని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ అనుకున్నట్లుగా... రాజధాని విశాఖకు తరలివెళ్తే అక్కడ మహా సామ్రాజ్యాన్ని నిర్మించుకునేందుకు  వీలుగానే ముందస్తు భూ సేకరణ చేపట్టారు. ఈ భూ వ్యవహారాలను మూడో కంటికి తెలియకుండా సెటిల్‌ చేయించినందుకు నజరానాగా అక్కడ పనిచేసిన ఓ అధికారికి ఊహించని పోస్టింగ్‌ ఇప్పించారు. అత్యంత కీలకమైన జిల్లా బాధ్యతలు అప్పగించారు. 


మంగళగిరిలోనూ అడ్డా...: అమరావతి రాజధానిగా ఉంటుందా, ఉండదా అనే సంగతి పక్కన పెడితే... విజయవాడ- గుంటూరు మధ్య ఉన్న మంగళగిరి ఎప్పటికీ ‘హాట్‌ కేక్‌’. ఈ దందాల అధికారి మంగళగిరిలోనూ భారీగా భూములు పోగేసుకున్నట్లు సమాచారం. జాతీయ రహదారికి సమీపంలోనే... ప్రముఖ ప్రభుత్వ సంస్థలున్న ప్రాంతంలో ఏకంగా 20 ఎకరాలు సొంతం చేసుకున్నారు. అందులో పదెకరాలు వివాదంలో ఉండటంతో... ‘22-ఏ’ అస్త్రాన్ని ప్రయోగించి సెటిల్‌ చేసినట్లు చెబుతున్నారు. ఈ సెటిల్‌మెంట్‌లో తనకు నమ్మినబంటులాంటి మరో అధికారి సేవలను ఉపయోగించుకున్నారు. ఇక్కడ ఎకరం భూమి విలువ 15 కోట్లపైమాటే! అంటే... సదరు అధికారి మంగళగిరిలో దక్కించుకున్న భూమి విలువ రూ.300 కోట్లు.


రాయలసీమ కొత్త జిల్లాలో: రాయలసీమకు చెందిన ఈ అధికారి తన సొంత ప్రాంతంలోనూ భారీగానే  భూములు వెనకేశారని తెలిసింది. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలో తన కుటుంబీకుల పేరిట 80 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. జిల్లాగా ప్రకటించడానికి ముందే భూ లావాదేవీలు జరిగాయి. జిల్లా కేంద్రం ఎక్కడ ఉండాలో నిర్దేశించే స్థాయిలో ఉన్న సదరు అధికారి... అదే ప్రాంతంలో ఒక ప్రజాప్రతినిధితో కలిసి ఈ భూములు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.


భార్య, బావమరిది కౌంటర్లు...: భూ వ్యవహారాలు, బిల్లుల చెల్లింపు, పోస్టింగ్‌ల విషయంలో ఆచరణ మాత్రమే ఈ అధికారిది! అంతకుముందస్తు ‘ప్రణాళిక’ మొత్తం ఆయన భార్య, బావమరిదివే అని సెటిల్‌మెంట్లకు వెళ్లి వచ్చిన వారు చెబుతున్నారు.  ఏ పోస్టుకు ఎంత? ఏ బిల్లుకు ఎంత కమీషన్‌ అనేది వీరే నిర్ణయిస్తారని, వీరి నిర్ణయాలను ఆ అధికారి అమలు చేస్తారని చెబుతున్నారు. బిల్లుల క్లియరెన్స్‌కు 10 శాతం కమీషన్‌ తీసుకుంటారని తెలిసే అంతా ఆశ్చర్యపోయారు. కానీ... ‘ఫిఫ్టీ:ఫిఫ్టీ’ కేసులూ ఉన్నాయని తాజాగా తెలిసింది. కాంట్రాక్టర్లు లేదా వెండర్లు పూర్తిగా ఆశ వదులుకున్న బిల్లులను సగం వరకూ కమీషన్‌ తీసుకుని క్లియర్‌ చేసినట్లు సమాచారం!


‘ఆంధ్రజ్యోతి’ వార్తతో ప్రకంపనలు...: ముఖ్యనేత వద్ద పనిచేస్తున్న ఈ అధికారిపై మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన ‘వసూల్‌ రాజా’ కథనం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఎవరా అధికారి అంటూ  అధికార వర్గాలు, నాయకులు, సామాన్యుల్లో చర్చోపచర్చలు సాగాయి.  ఐఏఎస్‌, అఖిల భారత సర్వీసు అధికారుల సోషల్‌ మీడియా గ్రూపుల్లో పోస్టింగ్‌లు పెట్టి ఎవరీ అధికారి అంటూ ఆరా తీశారు. ‘ఫలానా అధికారే’ అంటూ పేరును ప్రస్తావిస్తూ మరీ చర్చించుకున్నారు. ప్రజాప్రతినిధుల్లోనూ ఈ అంశంపై చర్చ జరిగింది. ‘‘ఈ కథనం ఫలానా అధికారి గురించే. ఆయన లీలలు ఇంకా చాలా ఉన్నాయి’’ అని అధికార పార్టీ నేతలూ చర్చించుకున్నారు.

Updated Date - 2022-08-03T08:23:13+05:30 IST