Dhanashree Verma: విడాకుల రూమర్లపై మౌనం వీడిన ధనశ్రీ వర్మ.. రెండే ముక్కల్లో తేల్చేసిన చాహల్

ABN , First Publish Date - 2022-08-22T02:56:45+05:30 IST

టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ వివాహ బంధానికి బీటలు వారిందని, వారిద్దరూ త్వరలోనే విడాకులు

Dhanashree Verma: విడాకుల రూమర్లపై మౌనం వీడిన ధనశ్రీ వర్మ.. రెండే ముక్కల్లో తేల్చేసిన చాహల్

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ వివాహ బంధానికి బీటలు వారిందని, వారిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తోంది. ధనశ్రీ(Dhanashree Verma) తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి చాహల్ (Chahal) పేరును తొలగించినప్పటి నుంచి ఈ పుకార్లు షికార్లు చేశాయి. 


దీనికి తోడు చాహల్ ఓ స్టోరీ పోస్టు చేస్తూ.. ‘కొత్త జీవితం’ ప్రారంభించడంపై మాట్లాడాడు. దీంతో చాహల్ పోస్టుకు, ధనశ్రీ తన ఖాతా నుంచి చాహల్ పేరు తొలగించడానికి లింకు కుదరడంతో వారిద్దరూ విడిపోవడం కన్ఫామ్ అంటూ నెటిజన్లు డిసైడైపోయారు. రూమర్లు చుట్టుముట్టేసి ఉక్కిరిబిక్కిరి చేయడంతో స్పందించిన చాహల్-ధనశ్రీ ఇద్దరూ స్పందించారు. ఆ రూమర్లను నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. 

 

అయినప్పటికీ పుకార్లకు అడ్డుకట్ట పడకపోవడంతో ధనశ్రీ ఆదివారం మరో భావోద్వేగ పోస్టుతో ముందుకొచ్చింది. తమపై జరుగుతున్నవి  పుకార్లు బాధించాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఓ రీల్ కోసం డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఏసీఎల్ లిగమెంట్‌కు గాయమైందని, గత 14 రోజులుగా తీవ్ర నొప్పి అనుభవిస్తున్నట్టు తెలిపింది. తన రోజువారీ జీవితంలో చిన్నచిన్న పనులు కూడా చేసుకోలేకపోతున్న ఈ సమయంలో చాహల్‌తో తన బంధంపై రూమర్లు రావడం ‘ద్వేషపూరితం’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తాను విశ్రాంతిలోనే ఉన్నానని పేర్కొంది. ఇలాంటి కఠినమైన సమయంలో తనకు బోల్డంత మద్దతు అవసరమని, కానీ బయట జరుగుతున్నది వేరే అని వాపోయింది. 


తమ గురించి లేనిపోనివి ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందింది. ఇది ద్వేషపూరిత ప్రచారమని పేర్కొంది. ఇలాంటివి విన్నప్పుడు బాధగా ఉంటోందని ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చింది. ఇంతకుమించి చెప్పడానికి కూడా ఏమీ లేదంది. ఈ అనుభవం తర్వాత తానో విషయాన్ని నేర్చుకున్నానని, ప్రజలు మాట్లాడుతూనే ఉంటారన్న విషయాన్ని అర్థం చేసుకున్నానని తెలిపింది. తన బలహీనతను బలంగా మార్చుకున్నందుకు, తన నైతిక స్థైర్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొంటూ.. DVC (ధనశ్రీ వర్మ చాహల్) అని ముగించింది.


మరోవైపు, చాహల్ కూడా స్పందించారు. ‘మై విమెన్’ అని పేర్కొంటూ తమ బంధం ఏమాత్రం చెక్కుచెదరలేదని చెప్పకనే చెప్పాడు. కఠిన సమయంలో ధనశ్రీ అభిమానుల నుంచి మంచి మద్దతు లభిస్తోందని పేర్కొన్నాడు. 

Updated Date - 2022-08-22T02:56:45+05:30 IST