కోతలు.. కొర్రీలు..

ABN , First Publish Date - 2020-11-30T04:43:50+05:30 IST

ఆరుగాలం కష్టించినా చివరికి రైతు శ్రమకు ఫలితం దక్కడం లేదు. పాలకులు చెప్పే మాటలకు చేతలకు పొంతన లేకపోవడంతో వానాకాలంలో వరి రైతులు తీవ్ర నష్టాల బారిన పడుతున్నారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు సరైన మార్కెట్‌ వ్యవస్థ లేకపోవడంతో రైతులు దళారుల బారిన పడాల్సివస్తోంది.

కోతలు.. కొర్రీలు..
కరకగూడెంలో ఆరబోసిన ధాన్యం, వైరాలో దళారులు కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు

ధాన్యం కొనుగోళ్లలో అడ్డగోలు నిబంధనలు

ఫలితంగా ముందుకు సాగని కాంటాలు

కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం రాసులు

ఇదే అదనుగా రెచ్చిపోతున్న దళారులు

పడికట్టుతో రైతులను మోసగిస్తున్న వైనం 

కానరాని తూనికలు, కొలతల అధికారులు 

వైరా/కరకగూడెం, నవంబర్‌ 29 : ఆరుగాలం కష్టించినా చివరికి రైతు శ్రమకు ఫలితం దక్కడం లేదు. పాలకులు చెప్పే మాటలకు చేతలకు పొంతన లేకపోవడంతో వానాకాలంలో వరి రైతులు తీవ్ర నష్టాల బారిన పడుతున్నారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు సరైన మార్కెట్‌ వ్యవస్థ లేకపోవడంతో రైతులు దళారుల బారిన పడాల్సివస్తోంది. ఎలాంటి దోపిడీ లేకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మాటలు చెప్పినా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీసుకెళ్లిన ధాన్యానికి అడ్డగోలుగా కొర్రీలు పెడుతూ.. కోతలు విధిస్తుండడంతో రైతులు ఏంచేయాలో పాలుపోని పరిస్థితుల్లో పడిపోయారు.

కొర్రీలతో కోత..

ప్రభుత్వం ఏ గ్రేడ్‌ ధాన్యం క్వింటాకు రూ.1,888, కామన్‌ రకం క్వింటాకు రూ.1,868 చొప్పున మద్దతు ధర ప్రకటించినా ఆచరణలో మాత్రం అమలుకావడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం సూచించిన ప్రకారం రైతులు ఎక్కువ మొత్తంలో సన్నరకం ధాన్యం సాగుచేశారు. కానీ ఆ ధాన్యాన్ని మిల్లర్లు నాణ్యత, నిబంధనల పేరుతో దిగుమతి చేసుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులుగా నిలిచిపోయింది. ఇదే అదునుగా దళారులు గ్రామాల్లో ఇష్టానుసారం కొనుగోళ్లు చేస్తున్నారు. రైతుల ఆందోళన, అవసరాలను ఆసరా చేసుకున్న దళారులు అయినకాడికి రేటు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. పూర్తిస్థాయిలో నష్టపోయే కంటే పంటకు పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందనే ఆశతో రైతులు వచ్చినకాడికి తెగనమ్ముకుంటున్నారు. నివర్‌ తుఫాన్‌తో మారిన వాతావరణ పరిస్థితులతో మిషన్ల ద్వారా ధాన్యం కోయించిన రైతులు ఆవెంటనే పచ్చి వడ్లనే విక్రయిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తేమశాతం అన్నీ సక్రమంగా ఉంటేనే క్వింటాకు రూ.1,888 చెల్లిస్తున్నారు. అయితే దళారులు మాత్రం బస్తా ఒక్కింటికి(75కిలోల నికరం, రెండుకిలోల తరుగు మొత్తం 77కిలోలు) రూ.1,250నుంచి రూ.1,260వరకు చెల్లిస్తున్నారు. పచ్చి వడ్లు బస్తా ధర రూ.1,050మాత్రమే పలుకుతోంది. డీఏపీ ఇతర కాంప్లెక్స్‌ బస్తాల ఎరువుల ధరలకంటే రైతులకు బస్తా ధాన్యానికి లభించే ధర సుమారు రూ.200నుంచి రూ.300తక్కువగా ఉంది. ఇప్పుడు వర్షాల మూలంగా కోసిన ధాన్యాన్ని ఆరబోసే వెసులుబాటు లేక పొలాల్లోనే వచ్చినకాడికి  దళారులకు విక్రయిస్తున్నారు. ఆదివారం వైరా ఆయకట్టులోని పలు గ్రామాల్లో దళారులు తక్కువ ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 

పడికట్టుతో కుచ్చు టోపి 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారమూల ఏజెన్సీ మండలాలైన కరకగూడెం, పినపాక, గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో రైతులు ఎక్కువగా వరి సాగు చేస్తుండగగా.. వారిని దళారులు నట్టేట ముంచుతున్నారు. తూకం పడికట్టులో మోసాలతో కుచ్చుటోపీ పెడుతున్నారు. కాంటా బస్తా, తెల్లబస్తాకు రెండు నుంచి నాలుగు కిలోల ధాన్యం తరుగు తీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వం సక్రమంగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాళ్లకాంటాకు బదులు కంప్యూటర్‌ కాంటాలను వినియోగించాలని రైతులు కోరుతున్నారు.

కానరాని తూనికలు, కొలతల అధికారులు 

మారుమూల ఏజెన్సీ గ్రామాలలో దళారులు రైతులను, వ్యాపారులు దుకాణాల్లో ప్రజలను పడి కట్టులో మోసాలకు పాల్పడుతున్నారు. మారుమూల ఏజెన్నీ గ్రామాల్లో ఇలా మోసాలు జరుగుతున్నా తునికలు, కొలతల అధికారులు మాత్రం నిద్ర మత్తులో ఉన్నారని, ఏజెన్సీ గ్రామాలలో వ్యాపారులపై పర్యావేక్షణ కరువైందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తునికల అధికారులు పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.

అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు 

భూక్య తులసీరాం కలవలనాగారం రైతు

ఆరుగాల కఅధికారులు వెంటనే స్పందించాలి. అనేక ఇబ్బందులు పడల్సి వస్తుంది ఇర్ప వెంకటనర్సయ్య, రైతుష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అధికారులు అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 10ఎకరాల్లో వరి సాగుచేశాను. ప్రభుత్వం చెప్పినట్లు సన్నరకం సాగుచేశాను. కోత కోసి 20 రోజులవుతోంది. ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులు మా ధాన్యాన్ని కొనుగోలు చేయాడం లేదు. అడిగితే మిల్లర్ల నుంచి అనుమతులు రాలేదంటున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించాలి.

అనేక ఇబ్బందులు పడల్సి వస్తుంది  

ఇర్ప వెంకటనర్సయ్య, రైతు

అధికారులు, పాలకులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. కానీ ప్రస్తుతం కేంద్రాల్లో కొత్త నిబంధనలు రైతులకు శాపంగా మారాయి. ఇన్ని రోజులు ఎదురు చూసి ఇప్పుడు దళారులను ఆశ్రయించల్సి వస్తోంది. ఇదే అదునుగా వారు ఇష్టం వచ్చినట్లు కొనుగోలు చేస్తూ రైతులను ముంచుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి త్వరగా ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి.

Updated Date - 2020-11-30T04:43:50+05:30 IST