జడ్జిని నడిరోడ్డుపై ఆటోతో ఢీకొట్టి చంపిన ఘటన గుర్తుంది కదా.. CBI నార్కో పరీక్షలు చేస్తే ఆటో డ్రైవర్ ఏం చెప్పాడంటే..

ABN , First Publish Date - 2021-08-30T22:23:17+05:30 IST

ధన్‌బాద్ జడ్జి అనుమానాస్పద మృతి కేసులో..నిందితులకు నార్కో టెస్ట్..ఆటో డ్రైవర్ ఏం చెప్పాడంటే..

జడ్జిని నడిరోడ్డుపై ఆటోతో ఢీకొట్టి చంపిన ఘటన గుర్తుంది కదా.. CBI నార్కో పరీక్షలు చేస్తే ఆటో డ్రైవర్ ఏం చెప్పాడంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఝార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్‌లో ఇటీవల జరిగిన న్యాయమూర్తి ఉత్తమ్ ఆనంద్ అనుమానాస్పద మృతి కేసు దేశవ్యాప్తంగా సంచలన కలిగించిన విషయం తెలిసిందే. ఉదయాన్నే వాకింగ్‌కని బయటకు వెళ్లిన ఆయనను హటాత్తుగా ఓ ఆటో వెనకనుంచి ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆ తరువాత.. స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. అయితే.. ప్రస్తుతం సీబీఐ పరిధిలో ఉన్న ఈ కేసు విచారణ మందకొడిగా సాగుతోందన్న విమర్శలు వినపడుతున్నాయి.


ఈ దారుణం జరిగి నెల గడుస్తున్నా..

ఘటన జరిగి నెల రోజులు కావస్తున్నా కూడా ఈ కేసులో కీలక ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు. ఇది ప్రమాదమా లేక దీని వెనుక కుట్రకోణం దాగుందా అన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. పలు కీలక కేసుల విచారణ చేపడుతున్న జడ్జి ఉత్తమ్ ఆనంద్ ఇలా అనుమానాస్పద రీతిలో మృతి చెందడంతో ఏకంగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. 


ఈ క్రమంలో..  కేసు దర్యాప్తు ఝార్ఖండ్ పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ అయింది. సెప్టెంబర్ 3న ఈ కేసుపై హైకోర్టు విచారణ కొనసాగించనుంది. కాగా.. శుక్రవారం నాడు సీబీఐ ఈ కేసు పురోగతికి సంబంధించిన నివేదికను హైకోర్టు డివిజన్ బెంచ్‌కు సమర్పించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు సీబీఐకి కొన్ని కీలక సూచనలు చేశారు. ముద్దాయిల నుంచి సేకరించిన శాంపిళ్ల తాలూకు రిపోర్టులు ట్రెయిన్ ద్వారా కాకుండా.. విమానం ద్వారా తరలించాలని సూచించారు.  ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా చేసేందుకే కోర్టు ఈ సూచన చేసినట్టు తెలుస్తోంది. 


ఇక ఈ కేసులో ప్రధాన నిందితులైన ఆటో డ్రైవర్ లఖన్ వర్మ, అతడి స్నేహితుడు రాహుల్ వర్మలకు నార్కో టెస్టు, బ్రెయిన్ మ్యాపింగ్, లై డిటెక్టర్ పరీక్షలు చేసినట్టు సీబీఐ కోర్టుకు తెలిపింది. ఇద్దరికీ రెండు పర్యాయాలు నార్కో పరీక్ష నిర్వహించగా వారు...ఇది ప్రమాదమేనని చెప్పినట్టు సీబీఐ పేర్కొంది. మద్యం మత్తులో ఉండగా ఇది జరిగిందని.. ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదని వారు తెలిపినట్టు సీబీఐ కోర్టుకు నివేదించింది.

Updated Date - 2021-08-30T22:23:17+05:30 IST