ఆవిరైన ఆనందం!

ABN , First Publish Date - 2021-04-22T04:33:50+05:30 IST

రాపూరు మండలంలో నాలుగేళ్ల తర్వాత చెరువులు జలకళసంతరించుకున్నాయి. దీంతో అప్పులు చేసి మరీ సుమారు 3 వేల ఎకరాల్లో నెల్లూరు, తెలంగాణ మసూరి, బీపీటీ రకాలు సాగు చేశారు.

ఆవిరైన ఆనందం!
రోడ్డుపైనే ధాన్యం అమ్ముతున్న రైతులు కళ్లాలోనే ధాన్యం విక్రయాలు

ధాన్యం దిగుబడి పెరిగినా ధర ఢమాల్‌!

పుట్టి రూ.16వేల నుంచి 13వేలకు తగ్గుదల

కొనుగోలు కేంద్రాలపై పెదవి విరుపు

కళ్లాల్లోనే తెగనమ్ముకుంటున్న కర్షకులు


అసలే మెట్టప్రాంతం. ఓ ఏడాది పంట పండితే మరో ఏడాది పొలాలు బీళ్లే. అలాంటి చోట నాలుగేళ్ల తర్వాత ధాన్యం విరగపండింది. అయితే, అధిక దిగుబడులు కళ్లజూశామన్న ఆనందం అన్నదాతలో ఆవిరవుతోంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర ఇస్తామన్న ప్రభుత్వ హామీలు నీటిమూటలు కావడంతో తక్కువ ధరకే ధాన్యం  అమ్ముకోవడమో లేదా దళారులకు అప్పుగా అప్పగించాల్సిన పరిస్థితి దాపురించింది. 


రాపూరు, ఏప్రిల్‌ 21 : రాపూరు మండలంలో నాలుగేళ్ల తర్వాత చెరువులు జలకళసంతరించుకున్నాయి. దీంతో అప్పులు చేసి మరీ సుమారు 3 వేల ఎకరాల్లో నెల్లూరు, తెలంగాణ మసూరి, బీపీటీ రకాలు సాగు చేశారు. ఎకరాకు ఏకంగా 50 బస్తాల దిగుబడి సాధించారు. అయితే, డిమాండ్‌ లేదన్న సాకుతో దళారులు దోచుకుంటుండటాన్ని ఆపలేక రైతు కుదేలయ్యాడు. కొనుగోలు కేంద్రాల్లో పుట్టి రూ.16,480 చెల్లిస్తున్నట్లు సొసైటీ సీఈవో పెంచలనరసింహం ప్రకటించారు. అయితే, కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించడం ద్వారా ఎదురయ్యే కష్టాలకు భయపడటంతోపాటు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించే స్తోమత, ధాన్యాన్ని నిల్వ చేసుకునే వనరులు లేకపోవడంతో కళ్లాల్లోనే అమ్ముకునేందుకు రైతు ఆసక్తి చూపుతున్నాడు. కాగా, దళారులు  పుట్టి ధాన్యానికి కేవలం రూ.13,150 చెల్లిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. పైగా, తరుగు పేరుతో 75 కిలోల బస్తాకు 80 కిలోల ధాన్యం సేకరిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో పుట్టి రూ.16వేల వరకూ పలికగా, ఒక్కసారిగా దిగుబడి ఎక్కువగా రావడంతో దళారులు ధర తగ్గించినట్లు వాపోతున్నారు. మరోవైపు వాతావరణ హెచ్చరిక, లాక్‌డౌన్‌  బూచి చూపి దళారులు దోచుకుంటున్నట్లు తెలుస్తోంది.


1100 పుట్లు కొనుగోలు చేశాం


ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా బుధవారం నాటికి 1100 పుట్ల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు సొసైటీ సీఈవో పెంచల నరసింహం తెలిపారు. తేమ 17 శాతం ఉంటేనే కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రేడ్‌ ఏ రకానికి రూ. 16,480, సాధారణ రకానికి రూ.15,870  చెల్లిస్తున్నట్లు వివరించారు. వారం రోజుల్లోనే నగదు రైతుల ఖాతాల్లో పడుతుందన్నారు. 


అప్పుకు ఇస్తున్నాం 

దళారులకు ధాన్యాన్ని విక్రయిస్తున్నాం. డిమాండ్‌ లేదన్న సాకుతో దళారులు నగదు చెల్లించడం లేదు. కొందరికి బ్యాంక్‌ చెక్‌లు ఇస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లోనే విక్రయిస్తున్నాం.

-  రమణారెడ్డి


ధర తగ్గింది.. 

ధాన్యం ధర పడిపోయింది. మార్చి నెలలో పుట్టి రూ.16 వేల వరకూ ఉంది. ఇప్పుడు రూ.13 వేలకే అమ్ముకుంటున్నాం. నష్టాలు లేకుండా పెట్టుబడులు మాత్రం వస్తే చాలనుకుంటున్నాం.

- నాగరాజు, రైతు


భయపెడుతున్న వాతావరణం

భయంతోనే కళ్లాలోనే విక్రయిస్తున్నాం. తక్కువ ధరకే తెగనమ్ముకుంటున్నాం. వర్షాలు, లాక్‌డౌన్‌ ప్రకటన తదితర సమస్యలు ఇందుకు కారణం

- రామయ్య



Updated Date - 2021-04-22T04:33:50+05:30 IST