వడ్లు ఆరబెట్టలేక అరిగోస

ABN , First Publish Date - 2020-12-03T05:57:57+05:30 IST

చౌటుప్పల్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డు లో రైతులు వడ్లు ఆరబెట్టలేక అరిగోస పడుతున్నారు.

వడ్లు ఆరబెట్టలేక అరిగోస
చౌటుప్పల్‌ మార్కెట్‌యార్డులో ఆరబెట్టిన ధాన్యం

 తూకాలకోసం వారాలతరబడి రైతుల నిరీక్షణ

చౌటుప్పల్‌ టౌన్‌, డిసెంబరు2: చౌటుప్పల్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డు లో రైతులు వడ్లు ఆరబెట్టలేక అరిగోస పడుతున్నారు. ధాన్యాన్ని తేమ పేరుతో  నిత్యం ఆరబెట్టిస్తున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యం తూకాల కోసం రైతులు వారాల తరబడి నిరీక్షిస్తున్నారు. వర్షాలకు తడిసిన ధాన్యం కూడా గింజ లేకుండా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనలు  ఆచరణలో అమలు జరగకపోవడంతో రైతులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమ వుతోంది. అక్టోబరు నెల రెండో వారంలో కురిసిన వర్షాలకు రైతుల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వారం రోజుల క్రితం వచ్చిన నివర్‌ తుఫాన్‌తో యార్డులోని ధాన్యంరాసుల కిందకు వర్షపు నీరు చేరడంతో ధాన్యం తడిసి, మొలకెత్తింది. ఈ ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉందన్న కారణంతో తూకాలు వేయించడం లేదు. దీంతో రైతులు యార్డులో ధాన్యాన్ని ఆరబెడుతూ నానా ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా, వర్షాలకు తడిసిన  ధాన్యంతో పాటు రంగు మారిన ధాన్యా న్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పిన  ప్రభుత్వం మాట తప్పిందని, చేసిన ప్రకటనను అమలు చేయడం లేదని రైతు సంఘాలు కన్నెర్రజేస్తున్నాయి. మార్కెట్‌యార్డులో 90మంది రైతులకు చెందిన సుమారు పది వేల బస్తాల ధాన్యం రాసులు ఉన్నాయి.

ధాన్యంలో తేమ శాతం అధికం

 తుఫాన్‌ ప్రభావంతో గత నెల 26 నుంచి ఈ నెల 2 వరకు యార్డులో ధాన్యం తూకాలు వేయలేదు. వరుసగా ఐదారు రోజులు సెలవులు  రావడం, అనంతరం ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉందని ఆరబెట్టించడం వంటి పరిణామాలతో తూకాలు వేయలేక పోయారు. ఈ నెల 1న ఏఈవో శంకర్‌ 75ధాన్యం రాశులలో తేమ శాతాన్ని కొలిచారు. అందులో కేవలం మూడు రాశుల్లోని ధాన్యం మాత్రమే 17 శాతం తేమ రావడంతో తూకాలకు అనుమతి ఇచ్చారు. ఈ మూడు రాసుల్లో సుమారు 300 బస్తాల ధాన్యం మాత్రమే ఉండడంతో తూకాలు వేయించలేదు. ఒక లారీ లోడింగ్‌ కు 550 నుంచి ఆరు వందల బస్తాలు అవసరం ఉంటాయి. మిగిలిన రాసుల్లో 22 నుంచి 25 శాతం తేమ ఉండడంతో తూకాలకు నిరాకరించారు. రెండు రోజుల పాటు ధాన్యాన్ని ఆరబెట్టాలని ఏఈవో శంకర్‌ రైతులను కోరారు.

20 రోజుల క్రితం ధాన్యం తెచ్చాం

-జక్కలి యాదయ్య, రైతు, దర్మాజీగూడెం, చౌటుప్పల్‌ మండలం 

20రోజుల క్రితం ధాన్యాన్ని మార్కెట్‌ యార్డుకు తీసుకు వచ్చాం. ధాన్యంలో తేమ అధికంగా ఉందని, అందుకోసం ఆరబెట్టాలని అధికారులు సూచించారు. తూకాలకు సిద్ధ మైన సమయంలో తుఫాన్‌ రావడంతో ధాన్యం తడిసింది. మళ్లీ ఐదారు రోజులుగా ధాన్యాన్ని ఆరబెట్టాం. తీరా చూస్తే మ్యాచర్‌ తీసే అధికారి రానందున తూకాలు వేయలేమని చెప్పడం బాధాకరంగా ఉంది.

సన్నాలు కొనడం లేదు

-సామిడి బాల్‌రెడ్డి, రైతు, చౌటుప్పల్‌

సన్నాలను మార్కెట్‌ యార్డులో కొనుగోలు చేయడం లేదు. సన్నాలను పండించాలని ప్రభుత్వం పదేపదే చెప్పింది. కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు. దొడ్డు రకం ధాన్యం కంటే ఎక్కువ ధరను సన్నాలకు ఇవ్వాలి. లేకుంటే నష్టపోతాం. నాతో పాటు మరోక ఐదు మంది రైతులు సన్నాలను మార్కెట్‌ కు తెచ్చారు.


 తేమ అధికంగా ఉంటుంది

-శంకర్‌  ఏఈవో(తేమ కొలిచే అధికారి), చౌటుప్పల్‌

మార్కెట్‌ యార్డులోని ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉంటోంది. ఈ నెల 1న  75 ధాన్యం రాసుల్లో మ్యాచర్‌ తీస్తే కేవలం మూడు మాత్రమే సెలెక్ట్‌ అయ్యాయి. ధాన్యం రాశుల్లో 22నుంచి 35శాతం వరకు తేమ శాతం ఉండ డంతో తూకాలు వేయించలేక పోతున్నాం. నిబంధనల ప్రకారం ధా న్యంలో 17 శాతం కంటే తక్కువ తేమ ఉంటేనే తూకాలకు సెలెక్ట్‌ చేస్తాం.

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే 

ఎండి.ఫసియొద్దీన్‌ , మార్కెట్‌  కార్యదర్శి, చౌటుప్పల్‌

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తు న్నాం. 17 కంటే ఎక్కువగా తేమ శాతం ఉన్న పక్షంలో మి ల్లర్లు అన్‌లోడింగ్‌ చేసుకోరు. లోడింగ్‌, అన్‌లోడింగ్‌ల మ ధ్యన తరుగు వచ్చిన పక్షంలో మార్కెట్‌ కమిటీ భరించ వలసి వస్తుంది. ఎక్కువ తేమ శాతం ఉన్న ధాన్యాన్ని తూకాలు వేసేందుకు మ్యాచర్‌ తీసే అధికారి కూడా సెలక్ట్‌ చేయలేరు. రైతులకు మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తున్నాం.


Updated Date - 2020-12-03T05:57:57+05:30 IST