ధాన్యం బస్తాలకు చెదలు

ABN , First Publish Date - 2021-05-15T05:58:12+05:30 IST

ఆరుగాలం కష్టపడినప్పటికీ రైతులకు సరైన ఫలితం దక్కక అగచాట్లపాలవుతున్నారు.

ధాన్యం బస్తాలకు చెదలు
కొనుగోలు కేంద్రంలో ఎగుమతి కాకపోవడంతో చెదలు పట్టిన ధాన్యం బస్తాలు

 వాతావరణ మార్పులతో రైతుల్లో ఆందోళన

 కొనుగోలు చేయాలని డిమాండ్‌

ముదిగొండ, మే 14: ఆరుగాలం కష్టపడినప్పటికీ రైతులకు సరైన ఫలితం దక్కక అగచాట్లపాలవుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు వేసి ఎగుమతి చేయకపోవడంతో వర్షానికి తడిసి చెదలు పడుతున్నాయి. మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో 9 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు సుమారు 40వేల క్వింటాళ్లను కొనుగోలు చేసి ఆయా మిల్లులకు తరలించారు. లారీల కొరత వలన ఇంకా 40వేలబస్తాలను ఆయా కేంద్రాల్లో కొనుగోలు చేసి అక్కడే ఉంచటం వల్ల ప్రస్తుతం కురుస్తు న్న అకాల వర్షాల కారణంగా తడిసిపోయి చెదలు పడుతున్నారని రైతులు వాపోతున్నారు. ఇంకా 60వేలబస్తాలకుపైగా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రైతులు కేంద్రాలకు తరలించారు. గన్నీసంచులు, లారీల కొరతతో కొనుగోలు చేయకుండా నిల్వ ఉంచటంతో వాతావరణంలోని మార్పుల వల్ల ఎప్పుడు వర్షం వస్తుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. రైతుల దగ్గర కొనుగోలు చేసి తరలించిన ధాన్యాన్ని మిల్లులు ధాన్యం బాగోలేదని సాకుచూపుతూ బస్తాకు 2నుంచి 3కిలోలు తరుగు తీస్తుండటంతో తాము నష్టపోతున్నామని వాపోతున్నారు. ధాన్యం ఆరబోసేందుకు తెచ్చిన పట్టాల కిరాయి మాకు వచ్చే డబ్బులకే సరిపోతుందని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి గన్నీసంచులు, లారీల కొరతను తీర్చి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు.


Updated Date - 2021-05-15T05:58:12+05:30 IST