ధరణి షురూ

ABN , First Publish Date - 2020-10-30T11:45:06+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు సిద్దిపేట జిల్లావ్యాప్తంగా అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో గురువారం ధరణి సేవలను ప్రారంభించారు.

ధరణి షురూ

ఇక తహసీల్దారు కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు

జిల్లాలో ప్రారంభమైన సేవలు

అన్ని తహసీల్దారు కార్యాలయాల్లో ఏర్పాట్లు

ప్రారంభమైన స్లాట్‌ బుకింగ్‌

వచ్చే నెల 2 నుంచి పూర్తిస్థాయి రిజిస్ర్టేషన్లు


సిద్దిపేట సిటీ, అక్టోబరు 29: రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు సిద్దిపేట జిల్లావ్యాప్తంగా అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో గురువారం ధరణి సేవలను ప్రారంభించారు. ఇందుకోసం తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కంప్యూటర్లను సమకూర్చి ఆపరేటర్లను నియమించారు. పలుచోట్ల తహసీల్దార్‌ కార్యాలయాలను మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులతో ముస్తాబు చేశారు. తహసీల్దార్లు స్వయంగా ధరణి వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కొద్దిరోజులుగా రిజిస్ర్టేషన్ల ప్రక్రియ నిలిచిపోయాయి. చాలా రోజులుగా రైతులు భూ రిజిస్ర్టేషన్ల కోసం పడిగపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ధరణి సేవలకు మొదలవడంతో కొద్ది రోజుల వరకు రద్దీ కొనసాగే అవకాశముంది. ధరణి వెబ్‌సైట్‌లో రిజిస్ర్టేషన్‌ కోసం ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకొవాల్సి ఉంటుంది. రోజుకు ఎన్ని స్లాట్లు అందుబాటులో ఉంటాయనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. దీంతో తమవంతు ఎప్పుడు వస్తుందోనని రైతులు, ఆస్తులు కొనుగోలు చేసినవారు ఎదురు చూస్తున్నారు.


కొనసాగుతున్న బుకింగ్‌

దరణిలో రిజిస్ర్టేషన్‌ కోసం ముందస్తుగా మీసేవలో స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం దరఖాస్తులను ఆపరేటర్లు పరిశీలించి తహసీల్దార్లకు సిఫారసు చేస్తారు. తహసీల్దార్‌ పరిశీలించి అన్ని పత్రాలు సరిగ్గా ఉంటే రిజిస్ర్టేషన్‌కు అనుమతిస్తారు. మీసేవ కేంద్రాల్లో 29 నుంచి వచ్చే నెల 1 వరకు ధరణి స్లాట్‌ బుకింగ్‌ ప్రారంభించారు. నాలుగు రోజుల్లో రోజూ ఎంతమందికి అవకాశం కల్పిస్తారే విషయంపై అవగాహన  లేదు. స్లాట్‌లు బుక్‌ చేసుకున్న ప్రకారం నంబరు కేటాయించి క్యూ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. వచ్చే నెల 2 నుంచి ధరణిలో రిజిస్ట్రేషన్‌ ప్రారంభించనున్నారు. 


ముస్తాబైన తహసీల్దార్‌ కార్యాలయం

వర్గల్‌, అక్టోబరు 29 : ధరిణి పోర్టల్‌ ప్రారంఢం నేపథ్యంలో గురువారం వర్గల్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి కొత్త కళ వచ్చింది. కార్యాలయానికి రంగులు వేసి, మామిడి తోరణాలు, కొబ్బరి మట్టలతో అలంకరించారు. తహసీల్దార్‌, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ పేరిట ఆఫీసు బోర్డును మార్చారు. కార్యాలయంలో ప్రజలు విశ్రాంతి తీసుకునేందుకు కుర్చీలు ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దారు. 


 కోహెడ: మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ను తహసిల్దార్‌ రుక్మిణి  ప్రారంభించారు. శనివారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని తెలియజేశారు. 


అక్కన్నపేట: మండల తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ సేవలు ప్రారంభించామని, తొలిరోజు ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగలేదని తహసీల్దార్‌ వేణుగోపాల్‌రావు పేర్కొన్నారు.


మద్దూరు: మండలంలో ధరణి సేవలను తహసీల్దార్‌ నరేందర్‌ ప్రారంభించారు. ప్రతీరోజు 10.30 నుంచి 2 గంటల వరకు రిజిస్ర్టేషన్‌ కార్యకలాపాలను నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.


జగదేవపూర్‌: తహసిల్దార్‌ శ్రీనివా్‌సరెడ్డి తన కార్యాలయంలో ధరణి వెబ్‌సైట్‌ ను ప్రారంభించారు. డిప్యూటీ తహసీల్దార్‌ కరుణాకర్‌, ఆర్‌ఐ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


కొండపాక: మండలంలో ధరణి సేవలను తహసీల్దార్‌ రామేశ్వర్‌ ప్రారంభించారు. 

Updated Date - 2020-10-30T11:45:06+05:30 IST