ధరణిలోపం రైతుబంధుకు శాపం

ABN , First Publish Date - 2022-07-03T06:02:56+05:30 IST

ధరణి లోపాలు చాలా మంది రైతులకు రైతుబంధు పథకం అందకుండా పోతోంది.

ధరణిలోపం రైతుబంధుకు శాపం
కుంటాల మండలంలో హైలెవల్‌ కాలువ

భూములు కోల్పోయిన బాధితులకు అందని డబ్బులు 

రికార్డులకెక్కని సర్వేనంబర్‌లు 

జిల్లాలోని పలు గ్రామాల్లో రైతుల ఆందోళన 

స్పందించని యంత్రాంగం 

దాదాపు 200 మందికి పైగా రైతుల పడిగాపులు 

బ్యాంకు రుణాలకు సైతం దూరం

నిర్మల్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : ధరణి లోపాలు చాలా మంది రైతులకు రైతుబంధు పథకం అందకుండా పోతోంది. ప్రభుత్వం ధరణి అమలు విషయంలో సరియైున జాగ్రత్తలు తీసుకోని కారణంగా చాలా మంది రైతులు రైతుబంధుకు దూరమవుతున్నారు. ఇలా జిల్లాలోని చాలా గ్రామాల రైతులు ధరణిలోని సాంకేతిక లోపాల కారణంగా అన్ని అర్హలున్నప్పటికీ రైతుబంధు నిధులకు నోచుకోలేని పరిస్థితి నెలకొందంటున్నారు. ముఖ్యంగా ప్రాజెక్ట్‌లు, కాలువల కింద భూములు కోల్పోయిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రభుత్వం అరకొరగా పరిహారం ఇచ్చినప్పటికీ కాలువల కోసం తమ విలువైన భూములను కోల్పోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్ట్‌లు, కాలువల కోసం కేటాయించిన భూములకు సంబందించిన సర్వేనంబర్‌లన్నీ ధరణిలో నమోదుకాకపోవడం ప్రస్తుతం జిల్లాలో సమస్యగా మారింది. కాలువల కోసం ఒక సర్వేనంబర్‌లోని కొంత మేర విస్తీర్ణంలో భూములను కోల్పోయినప్పటికీ ఆ సర్వేలోని పూర్తివిస్తీర్ణం వివరాలు ధరణిలో కనిపించడం లేదు. దీంతో ఎక రాల కొద్దిభూములు రైతుబంధును పొందలేకపోతున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని కుంటాల మండలంలోని ఐదారు గ్రామాలకు చెందిన రైతులు కాలేశ్వరం ప్రాజెక్ట్‌ పరిధిలోని 27వ నంబర్‌ ప్యాకేజీ హైలెవల్‌ కాలువ కోసం కొంత మేరకు భూములు కోల్పోయినప్పటికీ తమ మిగతా భూముల వివరాలు ధరణిలో అందుబాటులో లేని కారణంగా పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు గాని ఇతర ధృవీకరణ పత్రాలు గాని పొందలేకపోతున్నారు. దీని కారణంగా ఇటు రైతుబందుకు దూరమవుతున్న రైతులు, అటు బ్యాంకు రుణాలు ఇతర పథకాలను సైతం పొందలేకపోతున్నారు. ముఖ్యంగా కుంటాల మండల కేంద్రంలోని సర్వేనంబర్‌ 67లో మొత్తం 5 ఎకరాల 36 గుంటల భూమి ఉంది. ఈ మొత్తం భూమి నుంచి హైలెవల్‌ కాలువ కోసం 12 గుంటల భూమిని సేకరించారు. అయితే మిగతా 5 ఎకరాల 24 గుంటల భూమి సదరు రైతుపేరుపై ధరణిలో నమోదు కావాల్సి ఉంది. ప్రస్తుతం దీనికి విరుద్ధంగా ధరణిలో ఎక్కడ కూడా ఈ భూమికి సంబందించిన వివరాలు అందుబాటులో లేకపోవడంతో ఈ సర్వే నంబర్‌కు చెందిన రైతు రైతుబంధుకు నోచుకోవడం లేదు. అలాగే ఓలా గ్రామంలోని 878 సర్వేనంబర్‌లో మొత్తం 2 ఎకరాల 21 గుంటల భూమి కి గానూ 1 ఎకరం 20 గుంటల భూమిని హైలెవల్‌ కాలువ కోసం సేకరించారు. ఇక్కడ ఒక ఎకరం భూమికి సంబంధించిన వివరాలు అందు బాటులో లేని కారణంగా రైతుబంఽధు అందడం లేదు. అలాగే అంబకంటి గ్రామంలో 974 సర్వేనంబర్‌కు గానూ 5 ఎకరాల 36 గుంటల భూమి ఉండగా ఇందులో నుంచి 1 ఎకరం 22 గుంటల భూమిని హైలెవల్‌ కాలువ కోసం సేకరించారు. మిగతా 4 ఎకరాల 24 గుంటల భూమికి సంబందించి సదరు రైతుకు రైతుబంధు పథకం కింద ఆర్థిక సహకారం అందాల్సి ఉంది. మొత్తం భూమి నుంచి సేకరించిన భూమిని వదిలేసి మిగతాభూమికి రైతుబంధును అందించాల్సి ఉండగా అధికారులు మా త్రం రికార్డులు అందుబాటులో లేవని రైతుబంధు విషయంలో తప్పించుకు తిరుగుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలా జిల్లావ్యాప్తంగా 206 మంది రైతులు తమ భూములను కోల్పోయినప్పటికి మిగతా భూములకు మాత్రం రైతుబంధు దక్కపోతుండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రెండు మూడు సంవత్సరాల నుంచి రికార్డుల తప్పిదం కారణంగా తాము రైతుబందుకు దూరమవుతున్నామని చాలా మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైలెవల్‌ కాలువ కింద దాదాపు 200 మందికి పైగా రైతులు రైతుబందుకు అర్హత పొందలేక పోతున్నామంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం ఈ తప్పిదంను సవరించి తమకు రైతుబంధు పథకం మంజూరయ్యేట్లు చూడాలని కోరుతున్నారు. 

హైలెవల్‌ కాలువ బాధితుల గోడు

కాగా జిల్లాలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో నిర్మల్‌, ముథోల్‌ నియోజకవర్గం పరిధిలో హైలెవల్‌ కాలువలను నిర్మిస్తున్నారు. ముథోల్‌ నియోజకవర్గంలో 50వేల ఎకరాల కోసం గాను 28వ నంబర్‌ ప్యాకేజీ కాలువ, నిర్మల్‌ నియోజకవర్గంలో మరో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు గానూ 27వ నంబర్‌ హైలేవల్‌ కాలువ నిర్మాణాలను చేపట్టారు. ఈ కాలువల కోసం రైతుల నుంచి అవసరమైన మేరకు భూమిని సేకరించి పరిహారం చెల్లింపుల్లో అనేక రకాలుగా ఆటంకాలు కల్పించినట్లు ఆరోపణలున్నాయి. ఎట్టకేలకు సేకరించిన భూములకు గానూ పరిహారం అందించినప్పటికి క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల నుంచి సేకరించిన భూముల వివరాలను ధరణిలో సక్రమంగా నమోదు చేయని కారణంగా చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే పరిహారం డబ్బుల పంపిణీకి అలాగే రైతుబంధు లాంటి పథకానికి ప్రస్తుతం అవరోధాలు ఎదురవుతున్నాయి. అధికారుల తప్పిదం కారణంగా రైతులు రైతుబంధుకు దూరమై వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందంటున్నారు. 

బ్యాంకు రుణాలకు సైతం దూరం

కాగా ఇలా తప్పుడు వివరాల కారణంగా కుంటాల మండలంలోని హైలెవల్‌ కాలువ భూ బాధితులు బ్యాంకు రుణాలకు సైతం దూరమవుతున్నారు. తమ సొంతభూమికి బ్యాంకు రుణం దక్కని పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు రైతుబందు పథకం కింద ఆర్థిక సహకారం అందడం లేదని అలాగే బ్యాంకు రుణాలు సైతం అందకపోతుండడంతో తాము సాగు కోసం పెట్టుబడులు ఎలా సమకూర్చుకోవాలో తెలియని పరిస్థితి తలెత్తుతుందంటూ వారు వాపోతున్నారు. 

ఐదు ఎకరాల భూమికి రైతుబంధు రావడం లేదు

కుంటాల శివారులోని 67 సర్వేనంబర్‌లో నాకు 5 ఎకరాల 36 గుంటల భూమి ఉంది.  గత కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డి - 27 హైలేవల్‌ కాలువ నిర్మాణం కోసం నా సొంత వ్యవసాయ భూమి నుంచి 12 గుంటల భూమి కాలువ నిర్మాణం కోసం సేకరించారు. అప్పటి నుంచి నాకు సంబందించిన 5 ఎకరాల 24 గుంటల భూమికి రైతుబంధు రావడం లేదు. ఈ విషయమై అధికారులు స్పందించి తనకు రైతుబంధు వచ్చేలా చూడాలి.

- లింగారావు, కుంటాల 

రికార్డులు లేవని అధికారులు దాటవేస్తున్నారు

అంబకంటి గ్రామశివారులో హైలెవల్‌ కాలువ నిర్మాణం కోసం అధికారులు నా నుంచి 22 గుంటల భూమిని సేకరించారు. అయితే 974 సర్వేనంబర్‌లో నాకు మొత్తం 5 ఎకరాల 36 గుంటల భూమి ఉంది. ఈ కాలువ కోసం భూమిని సేకరించిన అధికారులు రికార్డుల్లో తన సర్వేనంబర్‌ను నమో దు చేశారు. దీంతో మిగతా నాకున్న 4 ఎకరాల 24 గుంటల భూమికి రైతుబంధు రావడం లేదు. ఈ విషయమై అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన దీనికి సంబంధించిన రికార్డులు తమ వద్ద లేదని దాటవేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం ఈ తప్పిదంను సవరించి తమకు రైతుబంధు పథకం మంజూరయ్యేట్లు చూడాలి. 

- మురళీ, అంబకంటి

Updated Date - 2022-07-03T06:02:56+05:30 IST