ముర్మును ఏ మ‌ర్మంతో ప్ర‌క‌టించినా ధ‌ర్మ‌మే!

Published: Tue, 28 Jun 2022 00:41:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ముర్మును ఏ మ‌ర్మంతో ప్ర‌క‌టించినా ధ‌ర్మ‌మే!

ఆదివాసి విద్యాధికురాలు 64 ఏండ్ల ద్రౌప‌ది ముర్ము అక‌స్మాత్తుగా ఎన్డీయే రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా తెరమీదికి వ‌చ్చారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇటువంటి ప్ర‌యోగాలు అనేకం చేసి రాటుతేలిపోయింది. న‌రేంద్ర‌మోదీ తాను ఒక బీసీ బిడ్డన‌ని, రాజ‌కీయ అణ‌చివేత‌, అస్పృశ్య‌త‌ను అనుభ‌వించిన‌వాడిన‌ని చెప్పుకున్నారు. త‌ర‌త‌రాలుగా ప్ర‌జాప్ర‌తినిధులుగా ఎదిగే అవ‌కాశాల్లో అణ‌చివేత‌ను, అవ‌కాశ‌లేమిని అనుభ‌విస్తున్న ఒక పెద్ద వ‌ర్గం న‌రేంద్ర‌మోదీని మోసిన ఫ‌లితం అంద‌రం చూసినం. ప్ర‌తిప‌క్షాలు మ‌తానికి మాత్రమే సెక్యుల‌ర్ కాని కులానికి, ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు కాదని త‌మ‌ద‌యిన సోష‌ల్ ఇంజినీరింగ్‌తో వాటిని బోనులో నిల‌బెట్ట‌డంలో నాగ్‌పూర్ కేంద్రంగా ఉన్న బ్రాహ్మ‌ణ ఆధిప‌త్య గుంపు విజ‌య‌వంతం కావ‌డం వ‌ర్త‌మానంలో చేదు అనుభ‌వం. భార‌త స‌మాజ మ‌ర్మ‌మెరిగిన ఆ కేంద్ర‌ం ఇంకా ఎన్ని ప్ర‌యోగాలు చేసి ఎంత ధ‌ర్మ‌నిర‌తిని చాటుకుంటుందో?


దేశం శ‌క్తిమంతం అయ్యే రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల కోసం నిల‌బ‌డి, క‌ల‌బ‌డే వ్య‌క్తిని ప్ర‌తిప‌క్షాలు ముందే వెతికి ప్ర‌క‌టిస్తే చ‌ర్చ ముర్ము చుట్టు కాక మ‌రోలా ఉండేది. కానీ, బీజేపీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న య‌శ్వంత్ సిన్హాను ముందుకు తేవడంతో ద్రౌప‌ది పేరు ప్ర‌క‌ట‌న‌లో మ‌ర్మం ఏదైనా ధ‌ర్మ‌మేనన్న సాఫ్ట్‌కార్న‌ర్ అప్పుడే ఏర్ప‌డ‌డం గ‌మ‌నిస్తున్నాం. ముర్మును బ్రాండింగ్ చేయ‌డం మోదీ వెంట‌నే మొద‌లుపెట్టినారు. ఎన్నిక‌ల్లో విజయానికి వృత్తి వ్యూహక‌ర్త‌ల‌ను గుండె బ‌లంగా భావించినవాళ్ళు ఏదైనా బ్రాండింగే చేస్తారు. వివిధ రాష్ట్రాలలోని పార్టీలు సంతాల్‌తెగ ఆదివాసి ఆడ‌బిడ్డ‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం ధ‌ర్మ‌మే క‌దా అంటున్నాయి. ఆదివాసిని ప్ర‌క‌టించి ఏమి లాభం, ఆమె ర‌బ్బ‌ర్ స్టాంప్ మాత్ర‌మే కదా? అన్న‌వాళ్లు వెంక‌య్య‌నాయుడు రాష్ట్రప‌తి కావాల‌ని ఎందుకు కోరుకున్నారు, మాయావ‌తి రాష్ట్రప‌తి కోస‌మే బిజెపితో స‌ఖ్యంగా ఉంటోంద‌ని ఎందుకు ప్ర‌చారం చేశారు? గోపాల‌కృష్ణ గాంధీని, శ‌ర‌ద్‌ప‌వార్‌ను అడిగిన‌వాళ్లు మాయావ‌తిని ఎందుకు అడగ‌లేదు? ప్ర‌ధానమంత్రి కావాల‌ని కోరుకున్న చ‌మార్ ఆడ‌బిడ్డ రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఉంటే చ‌ర్చ‌ వేరే తీరుగా ఉండేది క‌దా? రబ్బ‌రు స్టాంప్ ప‌ద‌వుల్ని, రాజ‌కీయ ప‌ద‌వుల్ని, పోలిట్‌బ్యూరో పొందిక‌ను చివ‌ర‌కు శిలాఫల‌కాల్లో, వేదిక‌ల్లో నిర్ల‌జ్జ‌గా కొన్ని సామాజికవ‌ర్గాలు కొలువుదీరుతూ సెక్యుల‌ర్ సూక్తులు చెప్పినా, జాతి ఐక్య‌త‌ గురించి మాట్లాడినా అట్ట‌డుగువ‌ర్గాల వాళ్ల‌కు కంప‌రం పుట్ట‌డంలో త‌ప్పేమున్న‌ది?


ఆదివాసీల‌కు ముర్ము ఏమి చేశారు? అని య‌శ్వంత్ సిన్హా ప్ర‌శ్నించ‌డం గురువిందగింజ సామెత‌కు ప‌దిరెట్లు అప‌హాస్యంగా ఉంటుంది. బిజెపిలో అన్ని ప‌ద‌వులు అనుభ‌వించి, కొడుకు పదవి కోసం బ‌య‌ట‌కు వ‌చ్చి, త‌న ప‌ద‌వీకాలంలో రాజ్యాంగ విలువలు, వ్య‌వ‌స్థ‌ల‌ ప‌త‌నం, అమ్మ‌కాల గురించి ఒక్కమాటా మాట్లాడని సిన్హా, ముర్మును అని ఏమి లాభం? రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో గెలుపు కోసం మ‌హారాష్ట్రలో ప్ర‌భుత్వాన్ని బిజెపి కూల్చుతున్నా బుల్డోజింగ్ చేస్తున్నా స్పంద‌న క‌రువుకు కార‌ణాలు స‌మీక్షించాలి. బంధుప్రీతి, ఒకే కులానికి పెద్దపీట‌, కార్పొరేట్ల‌తో మిలాఖ‌త్‌, సిబిఐ కేసులు, ఈడీలు, బేడీలు వెర‌సి మోదీకి ప‌రోక్ష మ‌ద్ద‌తు ఆన‌వాయితీగా మారింది.


స్వాతంత్ర్య అమృతోత్స‌వాల వేళ మునుపెన్న‌డు లేనంత అణ‌చివేత‌, దోపిడి ఆదివాసీల‌పై కొన‌సాగుతున్న‌ది. బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై మొద‌టి సాయుధ తిరుగుబాటు జరిపిన సంతాల్ తెగ వార‌సురాలు ద్రౌప‌ది, ఇప్పుడు ఆదివాసీ స‌మ‌స్య‌ల‌పై ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తుంద‌ని కూడా ఎవ‌రూ ఆశించ‌డం లేదు. కానీ, ఆమె ఒడిషాలోని మ‌యూర్‌భంజ్ నుంచి 280 కిలోమీట‌ర్లు రోడ్డు వెంట భువ‌నేశ్వర్ చేరిన‌ప్పుడు వెల్లివెరిసిన ఆనందాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ప‌్ర‌జాస్వామిక‌ వ్య‌వ‌స్థ‌లో ప్రాతినిధ్యం క‌నీస స‌వ్యపొందిక‌ను క‌లిగి ఉండాలని అణ‌గారిన వ‌ర్గాలు కోరుకుంటున్నాయ‌ని గుర్తించాలి. భ‌విష్య‌త్తులో ఏ రాజ‌కీయ ప‌ద‌వికైనా పోటీ వ‌చ్చిన‌ప్పుడు గేమ్ చేంజ‌ర్‌ నిర్ణ‌యాలు ఉంటాయ‌ని గ‌మ‌నించాలి. లౌక్యంతో, క‌ప‌టంతోన‌యినా ప్ర‌జ‌లు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్న సంద‌ర్భాల‌లో అభ్య‌ర్థుల్ని ఏరి కోరి తెర మీద‌కు తీసుకురావ‌డం బిజెపిని స‌వాల్ చేస్తున్న ప‌క్షాలు అల‌వ‌ర్చుకోవాల్సి ఉంది. వ్య‌వ‌స్థ‌లను మార్చుతామ‌నే ప‌క్షాలే త‌మ సామాజిక పొందిక‌ల‌ను లోకోత్త‌రంగా తీర్చిదిద్ద‌క‌పోతే కౌటిల్యనీతిని పాటించే వాళ్ల‌ను మ‌నువాదుల‌న్నా, మ‌నవాదులు కాద‌న్నా వినేవాళ్ళెవ‌రు?


సంతాల్ తెగ ప్ర‌జ‌లు త‌మ‌కు ఇష్ట‌మ‌యిన అడ‌వి జంతువుల పేర్ల‌ను త‌మ పేరు చివ‌ర కూర్చుతారు. కృష్ణ జింక‌ తీరున ఉండే నీల్‌గాయ్‌ను వాళ్ళు ‘ముర్ము’ అని పిలుస్తారు. ఇప్పుడు ద్రౌప‌ది ముర్మును మోదీ వ‌దిలిన మాయ‌లేడి అని తెగ‌నాడినా, మారీచుడి ఫార్ములా అని విమర్శించినా... ఏమో నాటి ‘ద్రౌప‌ది’ తీరున రాజ‌కీయ మ‌హాభార‌తంలో స‌రికొత్త పాత్ర నిర్వ‌హిస్తుందేమో? ఈ ‘ర‌బ్బ‌రు స్టాంప్’ రాష్ట్రప‌తి పార్ల‌మెంట్‌కే కొత్త స్టాంపింగ్ చేయవ‌చ్చునేమో! 

డా. చెరుకు సుధాక‌ర్‌

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.