
అనంతపురం: ధర్మవరం శోకసంద్రంలో మునిగిపోయింది. ధర్మవరానికి భాకరాపేట బస్సు ప్రమాద మృతదేహాలను తెచ్చారు. మృతదేహాలను చూసిన బంధువులు, కాలనీ వాసులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలను కడసారి చూసేందుకు భారీగా ప్రజలు వచ్చారు. కాసేపట్లు మృతులకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే అంత్యక్రియలకు బంధువులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బాధిత కుటుంబాలను టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఓదార్చారు.
నిన్న నిశ్చితార్థ వేడుక కోసం అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుపతికి బయలుదేరిన బస్సు లోయలో పడిపోయింది. పీలేరు - తిరుపతి మధ్య ఉన్న భాకరాపేట ఘాట్ రోడ్డులో... సుమారు 100 అడుగుల లోయలో బస్సు పడిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్‌తోపాటు 8 మంది అక్కడికక్కడే మరణించారు. ప్రమాద సమయంలో బస్సులో 50 నుంచి 60 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో దాదాపు 40 మంది గాయపడ్డారు. వీరిలో పెళ్లికుమారుడు మల్లిశెట్టి వేణు కూడా ఉన్నారు. ఎక్కువ మంది తలలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పెద్దసంఖ్యలో పిల్లలు ఉన్నారు. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలోనే ఈ ఘోరం జరిగింది.
ఇవి కూడా చదవండి